ఆంధ్రప్రదేశ్లో లడ్డూ వివాదం మొదలై పక్షం రోజులు కావస్తోంది. దాన్ని ఇంకా సాగదీయాలని రెండు వర్గాల నేతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. డిక్లరేషన్ గొడవల్లో జగన్ రెడ్డి తిరుమల టూర్ ను రద్దు చేసుకున్నప్పటికీ చంద్రబాబు సహా కూటమి నేతలు వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేరు. జగన్ ఎప్పుడైనా తిరుమల వెంకన్న దర్శనానికి రావచ్చని అంటూనే… డిక్లరేషన్ పై సంతకం చేసిన తర్వాతే ఆ పని చేసే వీలుంటుందని చంద్రబాబు తెగేసి చెప్పారు. అప్పట్లో వైఎస్, ఇటీవల సీఎం హోదాలో జగన్ అనేక పర్యాయాలు తిరుమల వెళ్లి వచ్చారు కదా…అప్పుడు అవసరం పడని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకని ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో దానికి కూడా చంద్రబాబు సమాధానం చెప్పేశారు. సీఎం హోదాలో అందరినీ బెదిరించి జగన్ ..తిరుమల వెళ్లి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని చంద్రబాబు ఆరోపించారు. నిజానికి కాస్త లోతుగా ఆలోచిస్తే చంద్రబాబు కూడా తప్పులో కాలేశారు. ప్రతిపక్ష నేత హోదాలో కూడా జగన్ రెడ్డి తిరుమలకు వెళ్లారు. పాదయాత్ర ముగించుకుని కాలినడకన తిరుమల కొండ ఎక్కి వెంకన్న దర్శనం చేసుకున్నారు. అప్పుడు ఆయన్ను అడ్డుకునేందుకు టీటీడీ అధికారులు గానీ, హిందూ సంఘాలు కానీ ప్రయత్నించలేదు. జగన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేసినప్పుడు చంద్రబాబే సీఎం గా ఉన్నారు. ఐనా క్రైస్తవ మతానికి చెందిన జగన్ … డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల ఎలా వెళతారని ఆయన ప్రశ్నించలేదు. అంటే జగన్ రెడ్డి అప్పట్లో చంద్రబాబును బెదిరించారా అన్నది ఇప్పుడు వైసీపీ నేతలు వేస్తున్న సూటి ప్రశ్న.
తిరుమల లడ్డూ వ్యవహారాన్ని సాగదీయకూడదని సూచిస్తున్న సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ…కూటమి సర్కారును ఇరుకున పెట్టే మరో అంశాన్ని కూడా ప్రస్తావించారు. జగన్ భార్య భారతీ క్రైస్తవ సమాజానికి చెందిన మహిళ కాబట్టి జగన్ తిరుమలకు ఎలా వెళతారని టీడీపీ ప్రశ్నిస్తున్న సంగతిని గుర్తుచేసిన రామకృష్ణ.. మరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్నా లేజినోవా కూడా క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తేనని కూడా గుర్తు చేస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ తిరుమల వెళ్లకూడదని తాను చెప్పడం లేదని, మతాన్ని, రాజకీయాలతో ముడిపెట్టవద్దని మాత్రమే చెబుతున్నానని రామకృష్ణ అన్నారు. ఈ క్రమంలో ఆయన వైసీపీ వారికి ఒక అస్త్రాన్ని అందించినట్లయ్యింది.నిజానికి లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు కంటే పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ కామెంట్స్ చేశారు. అందుకే రామకృష్ణ కామెంట్స్ కు ఆయన ఎలాంటి సమాధానం చెబుతారోనని జనం ఎదురు చూస్తున్నారు. పైగా వైసీపీ నేతలు ఇప్పుడు మరో అంశాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. తాను బాప్టిజం తీసుకున్నట్లుగా గతంలో పవన్ చేసిన ప్రకటనను వారు ప్రస్తావిస్తున్నారు. మరి తిరుమల వెళ్లినప్పుడు తాను మళ్లీ హిందువుగా మారానని ఆయన డిక్లరేషన్ ఇచ్చారా అని వైసీపీ నేతలలు నిలదీస్తున్నారు.
అయితే ఇప్పుడు హోం మంత్రి అనిత వ్యవహారాన్ని కూడా వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. గత టీడీపీ హయాంలో అనితకు టీటీడీ బోర్డు సభ్యురాలిగా పదవి ఇచ్చారు. ఆమె క్రైస్తవ మహిళ అని వైసీపీ నేతలు గోల చేయడంతో చంద్రబాబు స్వయంగా ఆమెను పదవి నుంచి తొలగించారు. తర్వాత చాలా సార్లు ఆమె తిరుమల దర్శనానికి వెళ్లారు. తాను హిందువునేనని అనిత చెప్పుకున్నారు. ఆమె క్రైస్తవురాలేనని వాదించే వైసీపీ నేతలు.. అనిత నుంచి టీటీడీ ఎన్ని సార్లు డిక్లరేషన్ తీసుకుందని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఆదివారం రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో వైసీపీ నేతలు పూజలు చేశారు. తిరుమల లడ్డూ విశిష్టతను చంద్రబాబు దెబ్బతీస్తున్నారని వారు ఆరోపించారు. చంద్రబాబుకు మంచి బుద్ధి ఇవ్వాలని వారు వేంకటేశ్వరస్వామిని ప్రార్థించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలకు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…