తెలంగాణా రాష్ట్రంలో హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్ లో ఆక్రమణలను కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మూసీ పరీవాహక ప్రాంతాలలో కూడా ఆక్రమణలను తొలగించే పనిలో భాగంగా అధికారులు ఇల్లిల్లూ తిరిగి మార్కింగ్ చేస్తున్నారు… ఆపరేషన్ మూసీ నేపధ్యంలో పేద నిరుపేదల ఆవేదన అర్ధం చేసుకున్న తాము మూసీ బాధితులకు అండగా ఉంటామని, బుల్డోజర్ ను అడ్డుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.తాజాగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు పేరుతో 163 ఇళ్లను నేలమట్టం చేశారు. చాదర్ ఘాట్ శంకర్ నగర్ బస్తీలో ఈ ఇళ్లను కూల్చేశారు. మూసీ నదిలో కట్టుకున్న మరో 700 ఇళ్లను కూల్చివేయాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కొందరు ఈ తొలగింపులకు సహకరించగా… మెజార్టీ వర్గం దీన్ని వ్యతిరేకించింది.దశాబ్దాలుగా తాము అదే ప్రాంతంలో ఉంటున్నామని, అది సెంటిమెంటుతో కూడుకున్న విషయమని చెప్పుకున్న జనం.. రేవంత్ ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతూ.. దుమ్మెత్తి పోస్తున్నారు. కొందరైతే బూతులు తిడుతున్నారు. ఐనా సరే ఆక్రమణలను తొలగించి తీరుతామని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో బాధితులకు అండగా నిలిచేందుకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కాంగ్రెస్ కార్కకర్తలు అడ్డుకున్నారు. ఆయన కారుపై దాడి చేశారు. మంత్రులు కూడా బీఆర్ఎస్ నేతలతో మాటల యుద్ధానికి దిగారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ఈనాటికి కాదని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆ పని మొదలైందని, దాన్ని తాము కంటిన్యూ చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు గుర్తు చేశారు.
మూసీని సుందరీకరణకు 2017లో జీఓ ఎంఎస్ 90 ద్వారా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూసీలో ఆక్రమణల తొలగింపు, రోడ్ల అభివృద్ధిపై 2020లో అప్పుడు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. 55 కిలో మీటర్ల మూసీ పరిధిలో 50 మీటర్ల వరకు మూసీ సరిహద్దును నిర్ణయించారు. 110 కిలో మీటర్ల పరిధిలో సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించి బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, 14 వంతెనలు నిర్మించాలని 2021లో నానక్ రాం గూడలో జరిగిన సమావేశంలో అప్పటి మంత్రి కేటీఆర్ అధికారులు ఆదేశించారు.2022లో మూసీ పరివాహక ప్రాంతంలో ఫిజికల్ సర్వేతోపాటు డ్రోన్ సర్వే కూడా నిర్వహించారు. ఈ సర్వేలో రివర్ బెడ్ లో 1537 ఆక్రమణలు, బఫర్ జోన్ లో 7057 ఆక్రమణలు ఉన్నట్టు గుర్తించారు. అదే ఏడాది అధికారులతో కేటీఆర్ నిర్వహించిన సమావేశంలో ఆక్రమణలను యుద్ధప్రాతిపదికన తొలగించాలని ఆదేశించారు. బాధితులకు పునరావాసం కింద డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించడంతోపాటు పట్టాదారులైతే భూమి విలువ నిర్ణయించి పరిహారం ఇవ్వాలని సూచించారు. ఈ బాధ్యతలను హైదరాబాద్, రాజేంద్రనగర్, కీసర, కందుకూరు ఆర్డీఓలకు అప్పగించారు. కానీ చేయలేకపోయారు. మూసీలో బోటింగ్ పెడతామని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ ప్రకటించారు. అరచేతిలో వైకుంఠం చూపించడం కేసీఆర్ కు అలవాటే. ఒకప్పుడు హుసేన్ సాగర్ ను కొబ్బరినీళ్లతో నింపుతానని ఆయన ప్రకటించారు. ఇచ్చిన హామీ మరిచిపోవడం బీఆర్ఎస్ కు బాగా అలవాటే..
బీఆర్ఎస్ తప్పిదాలను సరిచేసేందుకే జనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు చూస్తే జనం నెత్తిన శఠగోపురం పెడుతున్నట్లుగా అనిపిస్తోంది. మూసీ నదిని ఆక్రమించి ఇళ్లు కట్టుకున్న వారికి డబుల్ బెడ్ రూములు ఇవ్వడమేంటని జనం ప్రశ్నిస్తున్నారు. ప్రతీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కనిష్ఠంగా 25 నుంచి 30 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అంటే వెయ్యి నుంచి 1500 వరకు డబుల్ బెడ్ రూము ఇళ్లు అసలు లబ్ధిదారులకు ఆపి.. మూసీ నిర్వాసితులకు ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడుతోంది. బీఆర్ఎస్ నిర్ణయాలు తప్పుల తడక అని ఆరోపించినప్పుడు…అదే తప్పును కాంగ్రెస్ ఎందుకు చేయాలన్నది ఇప్పుడు సామాన్యులు అడుగుతున్న ప్రశ్న. 1500 డబుల్ బెడ్ రూములు ఒక వర్గానికే ఇస్తే మిగతా వారి పరిస్థితేమిటన్నది పెద్ద ప్రశ్న. రేవంత్ రెడ్డి తన మెహర్బానీ కోసం, ఇతర నేతల కంటే తాను పైచేయిగా ఉండేందు కోసం ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెడుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇదీ ఏ మాత్రం సహేతుకం కాదని గుర్తించాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…