హైడ్రా కూల్చివేతలు రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు తెచ్చాయా? కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం అంతకంతకూ పెరుగుతోందా? రేవంత్‌ను ఆదరించి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన పేదలే.. ఇప్పుడు ఆయనపై నిప్పులు చెరుగుతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. హైడ్రా కూల్చివేతలతో.. కాంగ్రెస్ ప్రభుత్వం అబాసుపాలవుతోంది.
హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలు, నాలాలపై ఆక్రమణల తొలగింపు.. మూసీ సుందరీకరణ.. పేరు ఏదైనా అక్కడ జరుగుతోంది కూల్చివేతలే. ఆ కూల్చివేతలే ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి శాపంగా మారాయి. అక్రమార్కులను వణికిస్తున్న హైడ్రా కూల్చివేతలు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ప్రజాగ్రహానికి కారణమవుతున్నాయి. పేదలే టార్గెట్‌గా కూల్చివేతలు కొనసాగుతున్నాయంటూ.. ప్రజలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోసినట్లు తోడవుతున్నాయి.
హైదరాబాద్ నగరాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే.. హైడ్రా, మూసీ ప్రాజెక్టును తీసుకొస్తున్నామని రేవంత్ ప్రభుత్వం చెబుతున్నా. ముఖ్యంగా పేదల ఇళ్లపైకే బుల్డోజర్లు, జేసీబీలు వెళ్తున్నాయి. కూల్చివేతలు ఆపాలంటూ రోడ్డెక్కుతున్న వారిలో.. పేద, మధ్య తరగతి ప్రజలే అధికం. కడుపు కట్టుకుని.. రూపాయి రూపాయి దాచుకుని ఇళ్లు కట్టుకుంటే.. వాటిని రేవంత్ ప్రభుత్వం నేలమట్టం చేస్తోందని.. కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ పాపం ఊరికే పోదని శాపనార్థాలు పెడుతున్నారు. కోట్లు కొల్లగొడుతున్న పెత్తందారులను వదిలేసి.. పేదలను పట్టి పీడిస్తున్నారంటూ మండిపడుతున్నారు.
ఇక.. కూల్చివేతలతో స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పార్టీకి వీర విధేయులుగా ఉన్న కొందరు నేతలు సైతం.. ప్రజల కోసం ప్రభుత్వంపైనే పోరాడతామని స్టేట్‌మెంట్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే.. అది రేవంత్ చేసిన తప్పేనని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా.. అధికార పార్టీలోని కొందరు నేతలు.. హైడ్రా బాధితులకు అండా నిలుస్తూ.. ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నా.. రాబోయే ప్రమాదాన్ని రేవంత్ గుర్తించలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది.
మరోవైపు.. తెలంగాణ హైకోర్టు సైతం హైడ్రా కూల్చివేతలపై మొట్టికాయలు వేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై న్యాయస్థానం సీరియస్ కామెంట్స్ చేసింది. కోర్టు పరిధిలో కేసులు ఉన్నా.. ఎందుకు కూల్చివేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా.. శని, ఆదివారాల్లో కూల్చివేతలపై.. హైకోర్టు ఫైర్ అయ్యింది. రాజకీయ నేతల కోసం పనిచేస్తే ఇబ్బందుల్లో పడతారని.. చంచల్ గూడ, చర్లపల్లికు పంపిస్తే తెలుస్తుందంటూ అధికారులకు హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. అయితే.. హైకోర్టు వ్యాఖ్యలు.. సీఎం రేవంత్‌రెడ్డికి వర్తిస్తాయని.. త్వరలోనే రేవంత్ కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని.. విపక్షాలు కౌంటర్ ఇస్తున్నాయి.
పేదల ఇళ్లను కూల్చివేయడంపై.. అటు అన్ని వర్గాల ప్రజలు, ఇటు ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా.. రేవంత్ రెడ్డి అదే దూకుడుతో ముందుకు వెళ్తున్నారు. తనను విమర్శిస్తున్న ప్రజలపైకి రేవంత్ ఎదురుదాడి చేస్తున్నారు. డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నారంటూ.. ప్రజలను తప్పుపట్టే ప్రయత్నం కూడా చేశారు. ప్రజలకు అండగా నిలుస్తున్న బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులపైనా రేవంత్ మండిపడుతున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి ప్రదర్శించిన దూకుడు ఆయనకు కలిసొచ్చింది. అయితే ప్రతిపక్షంలో ప్రదర్శించిన దూకుడునే.. ముఖ్యమంత్రిగా రేవంత్‌కు కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హైడ్రా కూల్చివేతల వంటి ప్రజా వ్యతిరేక చర్యలతో.. రేవంత్ దూకుడుపై చర్చ జరుగుతోంది. ఆ దూకుడు ఇప్పుడు పనికిరాదంటూ సూచిస్తున్నారు.
మొత్తంగా.. హైదరాబాద్‌లో జరుగుతున్న కూల్చివేతలు.. రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాయి. దీంతో.. మిస్టర్ రేవంత్.. మీకిది తగునా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రజాగ్రహం మరింతగా పెరగకముందే.. కూల్చివేతలను ఆపుతారా.. లేదా కాంగ్రెస్ హైకమాండ్‌తో చివాట్లు తిన్న తర్వాత దారిలోకి వస్తారా అనేది చూడాలి మరి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…