వైసీపీ చేసిన తప్పులే చేస్తున్నారా…?

By KTV Telugu On 7 October, 2024
image

KTV TELUGU :-

వైసీపీ ఐదేళ్ల పాలనలో జనం విసిగిపోయారు. రాష్ట్రం యాభై ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ అధికారానికి వచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పరిస్థితిలో ఏ మార్పు రాలేదని జనం వాపోతున్నారు.కొత్తగా ఎమ్మెల్యేలైన వారు పార్టీ క్రమశిక్షణను పాటించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తుంటే అధిష్టానం తలపట్టుకు కూర్చుంటోంది.ఈ క్రమంలో తిరువూరు ఎమ్మెల్యే అయిన నిన్నటి విశ్లేషకుడు కొలికపూడి శ్రీనివాసరావు నెంబర్ వన్ ఉల్లంఘన వీరుడిగా మారారు. ఇష్టానుసారం వ్యవహరిస్తూ, అందరి మీద తగవులకు వెళ్తున్నారు. ఎన్నికల్లో తనకు మద్దతిచ్చిన వారినే ఆయన తూలనాడుడూ వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. ఒక వైసీపీ నేత ఇంటిని పడగొట్టేందుకు స్వయంగా జేసీబీ తీసుకువెళ్లిన కొలికపూడిని అధినేత చంద్రబాబు పిలిచి మందలించినా ఆయన తీరులో మార్పు రాలేదు . కొలికపూడిపై మరికొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. మహిళా ఉద్యోగులకు వాట్సాప్ నెంబర్ లపై అసభ్యకరమైన సందేశాలు పంపిస్తూ కొలికపూడి వారిని వేధిస్తున్నారని.. అతని వెంటనే సస్పెండ్ చేయాలని మహిళలు టీడీపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల తిరువూరు మండలంలోని చిట్టేలలో మహిళలు ప్రధాన రహదారిపై నిరసన ప్రదర్శనకు దిగారు. కొలికపూడి పై తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. మరో పక్క మీడియా ప్రతినిధులను అగౌరవపరిచిన ఆరోపణలకు సంబంధించి కొలికపూడిపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వత్తిడి రాగా.. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు తిరుమల డిక్లరేషన్ వివాదంలో చిక్కుకున్నారు. తిరుమలలో స్వామివారి దర్శనానికి వచ్చే అన్య మతస్తులు డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటనను ఖరారు చేసుకుని.. చివరి క్షణంలో రద్దు చేసుకున్నారు. వైఎస్‌ జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుందనే కారణంతోనే తన పర్యటనను రద్దు చేసుకున్నారనే విమర్శలు బలంగా వినిపించాయి. సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన సందర్భంగా కూడా డిక్లరేషన్ వివాదం చెలరేగింది. చంద్రబాబు పర్యటన సందర్భంగా పలువురు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు సైతం తిరుమలకు వచ్చారు. వీరిలో ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గమైన గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం థామస్, మనదపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా కూడా ఉన్నారు. అయితే.. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా అన్య మతస్తుడు అయినప్పటికీ తిరుమలలో డిక్లరేషన్‌ ఇవ్వలేదని.. ఇవ్వకుండానే స్వామివారి దర్శనం చేసుకున్నారని వైసీపీ ఆరోపించగా, దానికి టీడీపీ వైపు నుంచి ఇంకా సమాధానం రాలేదు. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్‌ డిక్లరేషన్‌ పైన సంతకం చేశారని తెలుస్తోంది. ఆయన క్రిస్టియన్‌ కావడంతో డిక్లరేషన్‌ పై సంతకం చేశారని చెబుతున్నారు. అయితే క్రిస్టియన్లకు ఎస్సీ రిజర్వేషన్‌ వర్తించదని అందరికీ తెలిసిందే. బీసీ రిజర్వేషన్‌ మాత్రమే ఉంటుంది. అలాంటప్పుడు ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గమైన గంగాధర నెల్లూరు నుంచి రిజర్వేషన్‌ తో ఆయన పోటీ చేయడమే అక్రమవుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. మరి దీనికి టీడీపీ సమాధానం ఏమిటో చూడాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి