కాంగ్రెస్ పార్టీలోకి ఆయన లేటుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ లేటెస్టు నేతగా మారారు. సీనియర్లందరినీ పక్కకు నెట్టి మరీ అధిష్టానానికి అత్యంత సన్నిహిత నాయకుడయ్యారు. పార్టీ గెలిస్తే రేవంత్ ఒక్కరే సీఎం అభ్యర్థి అని అధిష్టానంతో చెప్పించగలిగారు. ఈ క్రమంలో సగటు తెలంగాణ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన ఇవ్వని హామీ లేదు. చేయని హడావుడి లేదు. జనం మీదకు వరుస డిక్లరేషన్లు వదిలారు. కోటి ఆశలు చిగురింపజేశారు. కట్ చేసి చూస్తే.. నిన్నటి శుష్క వాగ్ధానాలు, నేటి శూన్య హస్తాలే కనిపిస్తున్నాయి. హైడ్రా పేరుతో రేవంత్ జరుపుతున్న కూల్చివేతలు, ఫోర్త్ సిటీ పేరుతో మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ కనిపించే ఖరీదైన గ్రాఫిక్స్ తప్పితే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సాధించి పెట్టిందీ శూన్యమనే చెప్పాలి. ఉదయం హరీష్ రావుపై సవాళ్లు, మధ్యాహ్నం కేటీఆర్ తో మాటకు మాట, సాయంత్రం కూల్చి తీరుతామంటూ ప్రకటనలు మినహా రేవంత్ చేసిందేమీ లేదు.. కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోవడానికేమీ లేదన్న పరిస్థితిని ఆయనకు ఆయనే సృష్టించేశారు.
రుణమాఫీ పేరుతో జరుగుతున్న ప్రహసనం ప్రతీ ఒక్కరికీ తెలిసింది. పట్టణాల్లో ఉండే ఆదాయ వర్గాలకు ఈ సంగతి సరిగ్గా అర్థంకాకపోయినా…పల్లెల్లు ఉండే రైతులు మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం జరుపుతున్న రుణమాఫీ విషయంలో గోల్ మాల్ ను ఎండగడుతూనే ఉన్నారు. ఇంకా సగం మందికి రుణమాఫీ జరగలేదన్నది ఒక లెక్క. అంతకాకపోయినా కొన్ని పొరపాట్లు ఉన్నాయని ప్రభుత్వమే ఒప్పుకుంటూ దానికి టెక్నికల్ మిస్టేక్ అని పేరు పెట్టింది. రుణమాఫీకి పెద్ద కసరత్తే చేసిన తర్వాత మళ్లీ టెక్నికల్ మిస్టేక్ అని జాప్యం చేయడం తగదు కదా.. పంట సీజన్ దాటిపోతుంటే రుణమాఫీ జరగకుండా ఇబ్బందిపడుతున్న వారికి కొత్త అప్పు ఎక్కడ నుంచి దొరుకుతుందన్నది పెద్ద ప్రశ్న..బ్యాంకులకు వెళితే అప్పులు ఇవ్వకుండా వెనక్కి పంపుతున్నారని జనం వాపోతున్నారు.
రైతులకు ఎంతగానో ఉపయోగపడే రైతు బీమాకు కూడా రేవంత్ సర్కార్ మంగళం పాడింది. 2018 ఆగస్టు 15 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బీమా అమలు చేస్తూ వచ్చింది. దీనికి సంబంధించిన ప్రీమియం సొమ్మ కింద 500 కోట్ల రూపాయలు ప్రభుత్వమే చెల్లించింది. రైతు మరణిస్తే ఆయన కుటుంబానికి ఐదు లక్షల బీమా సొమ్ము వచ్చేది. రైతు చనిపోయిన పది రోజుల్లో అతని నామినీకి బీమా సొమ్ము చెల్లించేవారు. రేవంత్ సర్కారు వచ్చిన వెంటనే ఆ ప్రోగ్రాంకు టాటా బైబై చెప్పినట్లుగా తెలుస్తోంది. నిధులు లేవన్న సాకుతో బీమా ప్రీమియం చెల్లించలేదు.
రేవంత్ ప్రభుత్వం చేసిన పనుల్లో కంటికి కనిపిస్తున్నదీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటేనని చెప్పాలి. అది కూడా తక్షణమే నిధులు అవసరం లేకుండా ఉన్న బస్సులు ఎక్కించెయ్యడమే కదా అని సంబురపడిపోతూ ప్రారంభించారనుకోండి. ఇప్పుడు బస్సులు క్రిక్కిరిసి పోతున్నాయి. డొక్కు బస్సులు భారీగా జనాన్ని మోయలేక పురిటి నొప్పులు పడుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో చిన్న ప్రైవేటు ఆపరేటర్లు..అంటే గ్రామాల నుంచి పట్టణాలకు రవాణా చేసే షేర్ ఆటోలు ఎంత మేర నష్టపోయాయో చూడాలి. పేద మహిళలు దసరా పండుగ జరుపుకోలేని దుస్థితిలోకి రేవంత్ ప్రభుత్వం వారిని నెట్టేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్రమంతటా మహిళల్లో రేవంత్ సర్కార్‌పై కీలక చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వం హయాంలో బతుకమ్మ పండుగ వచ్చిందంటే రేషన్ కార్డులున్న మహిళలందరికీ ఒక్కో చీర ఇచ్చే వారు. పండుగకు బహుమతిగా అందించే వారు. అలా.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఏటా బతుకమ్మ పండుగ వచ్చిందంటే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసేవారు.ఇప్పుడు బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఇచ్చే కానుకకు మంగళం పాడారు. రాష్ట్రంలో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమైనప్పటికీ ఇంతవరకు వారికి చీరలు అందించలేదు. బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరల స్కామ్ జరిగిందని చెప్పి రేవంత్ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. అక్కడెక్కడో చీరలు గుట్టలు గుట్టలుగా దొరికాయని చెప్పి వీడియోలు పెట్టేసి ఊరుకుంది. ఈ క్రమంలో ఇటీవల ఒక చర్చ కూడా జరిగింది. పండుగ కోసం ప్రతీ పేద మహిళ ఖాతాలో ఐదు వందల రూపాయలు జమ చేయబోతున్నారని ప్రచారం చేశారు. చివరకు అదీ కూడా అతీ గతీ లేదు. తెలంగాణ పేద మహిళలకు నిరాశే మిగిలింది..
కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో మహిళలకు తులం బంగారం స్కీమ్ కూడా ఉంది. వందరోజుల్లో అమలు చేస్తామన్న ఈ హామీ పది నెలలైనా ఎక్కడా కనిపించడం లేదు. కల్యాణ లక్ష్మీ స్కీమ్ కింద లక్ష రూపాయల సాయంతో పాటు తులం బంగారం మాట ఎవరూ ఎత్తడం లేదు. ప్రతీ మహిళ ఖాతాలో నెలకు 2 వేల 500 రూపాయలు జమ చేస్తామని డాంబికాలు పలికిన రేవంత్ సర్కారు ఇంతవరకు పైగా వేసిన పాపాన పోలేదు. హైదరాబాద్ మినహా జిల్లాల్లో ఇబ్బడి ముబ్బడిగా మహిళల ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ వారిని అడ్డంగా మోసగించిందన్న ఆరోపణలున్నాయి. అదేమంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అథోగతి పాలైందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ టైమ్ పాస్ చేస్తోంది. మరి ఈ బురదజల్లుడు, తప్పించుకు తిరుగుడు కార్యక్రమం ఎన్ని రోజులు సాగుతుందో చూడాలి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…