రాజ్యసభ సీటు కోసం కిరణ్ రెడ్డి గాలం….

By KTV Telugu On 8 October, 2024
image

KTV TELUGU :-

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో గంట పాటు హైదరాబాద్ లో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారమైంది. అదే టైమ్ లో ఆయనకు టీటీడీ బోర్డ్ ఛైర్మన్ పదవి ఇస్తారని కూడా చెప్పుకున్నారు. అయితే ఆ రెండు వాదనలు తప్పు అని కిరణ్ రెడ్డికి అత్యంత సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కిరణ్ రెడ్డి రెండు ఫైల్స్ తీసుకుని వెళ్లి చంద్రబాబును కలిశారని చెబుతున్నారు. ఒకటి కృష్ణా ట్రిబ్యునల్ కు సంబంధించిన వ్యవహారంగా టీడీపీ వర్గాలే అంగీకరించాయి. కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదనను ఎలా బలంగా వినిపించాలో కిరణ్ రెడ్డి ఒక రిపోర్టు రూపొందించారట. మరో ఫైల్ ఏమిటో మాత్రం తెలియలేదు. ఇటు టీడీపీ, అటు బీజేపీ వర్గాలు దాన్ని గోప్యంగా ఉంచుతున్నాయి. బహుశా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ అరాచకాలు, పెద్ది రెడ్డి కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు ఆ ఫైల్లో ఉండి ఉండొచ్చని ఒక వాదన ప్రచారమవుతోంది…

కిరణ్ రెడ్డి ఏపీ నుంచి రాజ్యసభ సీటును ఆశిస్తున్నారట. దాని కోసమే ఆయన చంద్రబాబుతో మీటింగుకు వెళ్లారని బీజేపీలో కొందరు అంటున్నారు. రాజంపేట లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కిరణ్ రెడ్డి దురదృష్టవశాత్తు ఓడిపోయారు. కిరణ్ రెడ్డి ఓటమి బ్యాడ్ లక్ అని చెబుతున్నారు. ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు సకాలంలో డబ్బులు అందకపోవడం… కొన్ని వర్గాలు ఆయనకు సహకరించకపోవడం వల్లే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా దెబ్బతిన్నామని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దానితో బీజేపీ అధిష్టానం కూడా కిరణ్ రెడ్డి పట్ల సానుకూలంగా ఉందన్నది బహిరంగ రహస్యమే అవుతుంది. ఆయన్ను ఏదో విధంగా అకామటేడ్ చేసి ఢిల్లీ తీసుకువెళ్లాలని లెక్కలేసుకుంటున్నారు….

ఏపీలో ఇటీవలే రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. వైసీపీకి చెందిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు తమ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. త్వరలో మరో రెండు స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. మొత్తం నాలుగు స్థానాల్లో రెండు టీడీపీ, ఒకటి బీజేపీ, ఒకటి జనసేన తీసుకోవాలని భావిస్తున్నారు. ఆ క్రమంలో బీజేపీకి కేటాయించే స్థానం నుంచి కిరణ్ కుమార్ రెడ్డిని బరిలోకి దించాలని పార్టీ అధిష్టానం కూడా నిర్ణయించింది. అందుకోసం ఓ సారి మర్యాదపూర్వకంగా చంద్రబాబును కలిసి మద్దతు కోరాలని ఆదేశించినందుకే ఆయన వెళ్లారని చెబుతున్నారు. కిరణ్ పోటీ చేస్తే ఎలాగూ ఏకగ్రీవం అవుతుందని తెలుసు. కేంద్రమంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగినప్పుడు కిరణ్ కు మంత్రిగా అవకాశం ఇవ్వాలని కూడా బీజేపీ అధిష్టానం సంకల్పించినట్లుగా పార్టీ వర్గాలు అంటున్నాయి. అలా జరగాలంటే ఎంపీ అయి ఉండాలి కదా… కాంగ్రెస్ ను వదిలి బీజేపీలోకి వచ్చినందుకు ఆ మాత్రం కాంపెన్సేట్ చేయకపోతే బావుండదన్నది అధిష్టానం ఆలోచనగా తెలుుస్తోంది…..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి