అనూహ్య పరిణామాల మధ్య జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీకి ఒకప్పుడు పట్టిందల్లా బంగారమైంది. మోదీ ఈజ్ గ్రేట్ అంటూ ఇంటా బయట జనమూ, నేతలు వేనోళ్ల పొగిడారు. మోదీ మాట్లాడిందే వేదమన్నట్లుగా తలూపారు. మోదీ తప్పుచేస్తున్నాడని విపక్షాలు ఎంత మొత్తుకున్నా జనం వారిని ఛీకొట్టారే తప్ప… మోదీ తప్పిదాలను ప్రశ్నించేందుకు ఇష్టపడలేదు. పైగా టీ అమ్మిన ఆయన ప్రధాని అయితే ప్రత్యర్థులంతా కుళ్లుకుంటున్నారని కూడా ఎద్దేవా చేశారు. మోదీ ఆర్థిక విధానాలతో దేశం అథోగతిపాలయ్యే అవకాశం ఉన్నప్పటికీ జనానికి ఆ సంగతి పట్టలేదు. పెద్ద నోట్ల రద్దు పెద్దగా ప్రయోజనం కలిగించకపోయినా…ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిన్నా సరే మోదీ మంచి పనే చేశారని మెచ్చుకున్నారు. పాకిస్థాన్ పై రెండు సార్లు చేసిన సర్జికల్ స్ట్రైక్స్ … అప్పట్లో మోదీని హీరోగా నిలబెట్టిన మాట వాస్తవం. కొంతకాలం పాకిస్థాన్ తోకముడిచి కూర్చోవడానికి కూడా ఆ దాడులు ఉపకరించాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తొలి పదేళ్లు మోదీకి తిరుగులేకుండా పోయింది.హిందీ బెల్టు సహా అనేక రాష్ట్రాల్లో బీజేపీ జయభేరీ మోగించింది. లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రాలకు రాష్ట్రాలే స్వీప్ చేసింది. మోదీ నాయకత్వాన్ని అంగీకరించినోళ్లే ఉంటారు.. లేని వాళ్లు వెళ్లిపోవాల్సిందే అన్నట్లుగా పార్టీలో వన్ మ్యాన్ షో అయ్యింది. ఆయన డిప్యూటీ అమిత్ షా అన్నీ తానై పాలనను నడిపిస్తుంటే… ప్రధానిగా మోదీ అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు.
కట్ చేసి చూస్తే మాత్రం ఎక్కడో తేడా కొడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఆర్థిక శాస్త్రంలో క్రమక్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతంగా మోదీ మోతాదు పెరిగే కొద్ది శాటిస్ఫాక్షన్ లెవెల్ తగ్గిపోతూ వచ్చి..ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లయ్యింది. పార్టీకి సొంత మెజార్టీ రాక 240 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితిలో పడిపోయింది. కంచుకోటగా ఉన్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సైతం సగం సీట్లు రాలేదు. ఎన్డీయే భాగస్వాముల సంపూర్ణ మద్దతు ఉండబట్టి మోదీ ప్రధానిగా కొనసాగుతున్నారు. ఇక ఒక్కో రాష్ట్రం బీజేపీ నుంచి జారిపోతున్న తీరు ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఇప్పుడు జరిగిన జమ్మూకశ్మీర్, హరియాణా ఎన్నికల్లో బీజేపీకి మిశ్రమ ఫలితాలొచ్చాయ్ . కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం లాంటి నిర్ణయాలు దెబ్బకొట్టాయనే చెప్పాలి. అక్కడ ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానికి రాబోతోంది. హరియాణాలో అతి కష్టం మీద బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే పరిస్థితి దాపురించిందనే చెప్పాలి….
దక్షిణాదిలో బీజేపీ అసలు నిలబడలేని పరిస్థితిలో ఉంది. ఏపీలో టీడీపీ కూటమిలో అదో చిన్న పార్టీ. తెలంగాణలో ఉండీ లేనట్లుగా కనిపిస్తోంది. 2026లో తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపుకు దగ్గరగా వస్తుందన్న విశ్వాసం కూడా లేదు. నాలుగు సీట్లు పవన్ కల్యాణ్ సాయం పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. హిందూత్వం, సనాతనం లాంటి పాతకాలపు పదజాలంతో నెట్టుకురావాలని చూస్తోంది. వచ్చే సారి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తుందన్న నమ్మకం పార్టీ వర్గాలకే లేవు. తూర్పున ఒడిశాను కైవసం చేసుకున్నప్పటికీ… బెంగాల్, బిహార్లో పార్టీ బలపడలేకపోతోంది. కూటముల తగవులున్న మహారాష్ట్రలో కూడా పార్టీకి ఆశాజనకమైన ఫలితాలు ఉండకపోవచ్చు. మధ్య భారతంలో పార్టీ పరిస్థితి ప్రస్తుతానికి మెరుగ్గానే ఉంది.
భయపెట్టి, కేసులు పెట్టి రాజ్యాధికారం సుస్థిరం చేసుకోవాలన్న మోదీ అండ్ కో ప్రయత్నాలు ఎక్కువ కాలం సాగేవిగా కనిపించడం లేదు. పూర్తిగా దెబ్బతిన్నదనుకున్న కాంగ్రెస్ పార్టీ ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో బాగా పుంజుకుంది.పప్పు అనుకున్న రాహుల్ గాంధీ ఇప్పుడు మోదీకి పోటీ ఇచ్చే బలమైన నాయకుడిగా ఎదిగారు. ఒకప్పుడు రాహుల్ ను ఎగతాళి చేసిన వాళ్లే ఇప్పుడు ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. రాజకీయం ఇప్పుడు నిజంగానే మోదీ వర్సెస్ రాహుల్ గా మారింది. ఒకప్పుడు విపక్షాల్లో చాలా మంది ప్రధాని అభ్యర్థులు ఉండేవారు. ఇప్పుడు అలా లేదు. కేవలం రాహుల్ ఒక్కరే ఫ్రేమ్ లో కనిపిస్తున్నారు. అందుకే మోదీకి ముచ్చెమటలు పడుతున్నాయి. కేవలం పబ్లిసిటీ స్టంట్ తోనూ, భావోద్వేగాలను రెచ్చగొట్టడంతోనూ జనాన్ని మభ్యపెట్టలేరని అర్థమైపోయింది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…