చంద్రబాబు నాలుగు పర్యాయాలు ఇంతవరకు 5 వేల రోజులకు పైగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఖచితంగా చెప్పాలంటే 5,200 రోజుల్లో వరెస్ట్ 100 రోజుల పాలన గత మూడు నెలల్లో చూశాం…. ఈ మాట అన్నది ఎవరో కాదు.. ఆయన కులస్తుడైన ఒక పెద్ద మనిషి..అదీ కూడా బహిరంగంగానే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అంశం. దీనిపై చంద్రబాబు, లోకేష్ కూర్చుని రివ్యూ చేసుకోవాలని కూడా ఆ పెద్ద మనిషి సూచించారు. చంద్రబాబు ఇదివరకు రాజకీయంగా తప్పులు చేసేవారని, ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ లో కూడా తప్పులు చేస్తున్నారని సదరు సోషల్ మీడియా స్టార్ వాపోయారు. నిజానికి ఇదీ మామూలు విషయం కాదు. అధికారానికి వచ్చి మూడు నెలలు దాటినా ఇంకా ప్రభుత్వం ఏ దిశగానూ అడుగులు వేయలేకపోతుందన్న సగటు టీడీపీ కేడర్ ఆందోళన కూడా ఇదే కావచ్చు. టీడీపీ సోషల్ మీడియా వారియర్స్ కూడా ఇప్పుడు చంద్రబాబు పేరు చెబితే గగ్గోలు పెట్టి.. అసలేం జరుగుతుంది బాబూ అని ప్రశ్నించే దుస్థితి వచ్చింది…
ఉచిత ఇసుకను అమలు చేయడానికి ఇన్ని రోజులా, మద్యం షాపుల కేటాయింపులు ఇన్ని సమస్యలా అని వాళ్లకు వాళ్లే ప్రశ్నించుకునే సమయం వచ్చేసింది. జనం ఓటేసిందీ ఎందుకూ, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సి కదా.. అని చంద్రబాబు కులస్థులు, టీడీపీ కేడర్ ప్రశ్నించుకుంటున్నారు. జగన్ హయాంలో ఐదేళ్ల పాటు జరిగిన అరాచక, ఆశ్రిత పక్షపాతాన్ని చంద్రబాబు రాగానే రివర్స్ చేస్తారని భావిస్తే.. ఆయన మడికట్టుకుకూర్చున్నారన్న ఆగ్రహం కమ్మ సామాజికవర్గంలో పెల్లుబుకుతోంది. అందుకు చాలా కారణాలే ఉన్నాయి. జగన్ హయాంలో భారీగా నష్టపోయి దివాలా తీసినదీ కమ్మ వ్యాపారులు, పారిశ్రామికవెత్తలేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా జైలుకు వెళ్లిన వారిలో చంద్రబాబు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సహా పలువురు ప్రముఖులు కమ్మవారే. కలిసి ఉంటే కలదు సుఖం అన్న సూక్తిని మరిచి చంద్రబాబు కమ్మవారినే దూరం పెడుతున్నారన్న ఆగ్రహం ఆ సామాజికవర్గంలో కనిపిస్తోంది…
జగన్ హయాంలో రెడ్డి సామాజికవర్గానికి పెద్ద పీట వేశారు. తనతో పాటు రెడ్లకు ప్రయోజనం కలిగించే చర్యలు తీసుకున్నారు. అమరావతి – అనంతపురం ఎక్స్ ప్రెస్ వే అలైన్మెంట్ మార్చివేసి అనంతపురం రూటును చెన్నై – కోల్ కతా హైవేతో అనుసంధానం చేయడం ద్వారా తన పులివెందుల భూముల రేట్లు పెంచుకున్నారు. చంద్రబాబు ఇలాంటి పని ఒకటైనా చేశారా.. కమ్మవారికి ప్రయోజనం కలిగించారా అన్నదే ఇప్పుడు వారిని వేధిస్తున్న ప్రశ్న. దాన్ని మళ్లీ యధాస్థితికి తీసుకురావాలని కొందరు వెళ్లి చంద్రబాబు దగ్గర ప్రస్తావిస్తే.. వేరే ఏదైనా చెప్పు ఇదీ కుదరదబ్బా..ఇప్పటికే భూసేకరణ పూర్తి చేసి పనులు మొదలు పెట్టారని ఆయన సన్నాయి నొక్కులు నొక్కేశారు…
జగన్ ఐదేళ్ల పాలనలో తన అస్మదీయులకు, రెడ్డి కులస్తులకు కట్టబెట్టిన కాంట్రాక్టులు కూడా మార్చడానికి వీల్లేదని చంద్రబాబు అంటున్నారు. పారిశ్రామిక వాతావరణం దెబ్బతింటోందని ఆయన కూడా మాట్లాడుతున్నారు. ఏపీని పారిశ్రామికంగా అభివృద్ది చేసిందే తాము అని చెప్పుకుంటున్న కమ్మ కులస్థులకు ఇప్పుడు చంద్రబాబు సమాధానం వింటే చిర్రెత్తుకొచ్చేస్తోంది. జగన్ హయాంలో విజయసాయి బంధువులకు చెందిన అరబిందో సంస్తకు రామాయపట్నం నిర్మాణ కాంట్రాక్ట్ అప్పగించారు. నవయుగ సంస్థ చేస్తున్న పోలవరం, బందరు పోర్టు పనులు లాగేసుకుని మెగా కృష్ణరెడ్డికి అప్పగించారు. అదేమంటే రివర్స్ టెండరింగ్ అంటూ కొత్త రాగం అందుకున్నారు. కొందరు పారిశ్రామికవేత్తలు ఇప్పుడు చంద్రబాబును అదే ప్రశ్న అడుగుతున్నారు. మా దగ్గరున్నది లాక్కుని జగన్ అనుచరులకు ఇచ్చినప్పుడు.. మీరు ఎందుకు మళ్లీ వెనక్కి ఇవ్వరని వారు నిలదీస్తున్నారు. చంద్రబాబు నుంచి సరైన సమాధాన రాకపోవడంతో వాళ్లు తీవ్ర ఆగ్రహం చెందుతున్నారు. అందుకే ఇప్పుడు వాళ్లు ఒక విషయంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. చంద్రబాబు సీఎంగా కొనసాగేందుకు మా డబ్బులు ఎందుకు ఖర్చుపెట్టాలి. ఆయనకు మంచి పేరు వచ్చేందుకు మేమెందుకు ఆర్థికంగా దెబ్బతినాలీ అని వాళ్లు ప్రశ్నించుకుంటున్నారు. అందుకే ఇకపై ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పునరాలోచించుకోవాలన్న ఉద్దేశంలో వాళ్లున్నారు.ఇక్కడ పెట్టే బదులు తెలంగాణ, కర్ణాటకలో పెట్టుబడులకు దిగితే… ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా ఉంటాయన్న ఆలోచనలో వాళ్లున్నారు…
టీడీపీ కేడర్లో మరో ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఏపీని సర్వనాశనం చేసిన జగన్ పై చర్యలు తీసుకోవడానికి ఎంత టైమ్ పడుతుందని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబును, తమను అరెస్టు చేసిన జగన్ సహా ఆయన పరివారాన్ని లోపసేందుకు ఎంత కాలం వేచి చూడాలని వాళ్లు ప్రశ్నిస్తున్నారు..ఇంకెంతకాలం జనం నుంచి చంద్రబాబు తప్పించుకు తిరుగుతారని వారు నిలదీస్తున్నారు. చాణక్యం బాగా తెలిసిన చంద్రబాబు వాటికి సమాధానం చెబుతారని ఎదురు చూడటం కూడా కష్టమే…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…