ఆంధ్రప్రదేశ్‌ను మళ్లీ తుపాను భయం వెంటాడుతోంది. నైరుతీ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం ఆగ్నేయ బంగాళాఖాతంలో కూడా ఆవర్తనం ఏర్పడి స్థిరంగా కొనసాగుతోంది.దీని ప్రభావంతో వర్షాలు తప్పవని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడి.. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా వైపు పయనిస్తుంది. ఇది తుపానుగా బలపడే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో గురువారం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఓ మోస్తరు వర్షాలు మొదలయ్యాయి. దీని ప్రభావంతో రాయలసీమలో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..
కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటిన తరువాత దక్షిణ భారతం మీదుగా పయనించి అరేబియా సముద్రంలో ప్రవేశించి అక్కడ బలపడుతుందని విశ్లేషిస్తున్నారు.. అయితే.. అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిన తరువాత కొంత వరకు స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
నైరుతీ రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ మొదలైంది. వాటి స్థానంలో దక్షిణ భారతంలో వర్షాలకు ఊతమిచ్చే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. దీనికి బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలంగా మారి తూర్పుగాలులు వీస్తున్నాయి. ఈ సారి వర్షాలు బాగానే ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…