ఈసారి సొంత పార్టీ నేతలతోనే ఫైట్..

By KTV Telugu On 15 October, 2024
image

KTV TELUGU :-

మంత్రి కొండా సురేఖ వివాదాలకు చిరునామాగా మారుతున్నారు. తొలి సారి కాంగ్రెస్ లో ఉన్నప్పుడే ఆమె వివాదాల వీరనారిగా పేరు తెచ్చుకున్నారు. ఎప్పుడూ గిల్లిగజ్జాలు పెట్టుకుంటూ, ఎవరోకరిని ఏదోకటి అంటూ గడిపారు. సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండదండలు ఉండటంతో ఎవరూ ఆమెతో గొడవ పెట్టుకునేవారు కాదు. వైసీపీలోకి మారిన తర్వాత కూడా సురేఖ తీరు అదే ధోరణిలో కొనసాగింది. జగన్ రెడ్డి తనను లెక్కచేయడం లేదని డిసైడ్ అయిన తర్వాత ఆమె ప్రస్తుత బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ సామంతరాజులా వ్యవహరించడంతో పార్టీ ఆమెను పక్కన పెట్టింది. టికెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో మళ్లీ కాంగ్రెస్ లో చేరిన సురేఖ..కొంతకాలం మౌనంగా ఉన్నప్పటికీ తర్వాత విజృంభించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యారు. అప్పటి నుంచి మళ్లీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నప్పటికీ.. ఇటీవలే ఆమె పేరు బాగా మారుమోగిపోతోంది…

ఇటీవల అక్కినేని నాగార్జున కుటుంబంపై సురేఖ వివాదాస్పద కామెంట్స్ చేశారు. మంత్రి హోదాలో ఉన్న మహిళ అనకూడని మాటలు ఆమె అనేశారు. సమంతకు సారీ చెప్పినప్పటికీ… నాగార్జునను పట్టించుకోకపోవడంతో ఆయన పరువు నష్టం దావా వేశారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం మౌనంగా ఉన్నప్పటికీ సురేఖ తీరుపై అసంతృప్తి చెందినట్లు చెబుతున్నారు. నాగార్జున వేసిన కేసులు సంబంధించి సురేఖ కోర్టుకు హాజరు కావాల్సిన తరుణం కూడా ఆసన్నమవుతోంది..

అధిష్టానం ఆమె పట్ల అసంతృప్తిగా ఉందని కొండా సురేఖకు అర్థమైందో లేదో. అంతలోనే ఆమె పార్టీ నేతలతో గొడవలు మొదలు పెట్టారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరును వీధికెక్కించారు. గీసుకొండ మండలంలోని ధర్మారంలో మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గీయుల మధ్య నెలకొన్న వివాదం రచ్చ కెక్కడానికి ఆమే కూడా కారణమని చెబుతున్నారు.. దసరా పండుగను పురస్కరించుకొని ధర్మారంలో కొండా వర్గీయులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ఫొటో లేదని ఆయన వర్గీయులు నిరసన తెలిపారు.ఈ నేపథ్యంలో ఫ్లెక్సీని ధ్వంసం చేశారని రేవూరి వర్గీయులపై కొండా అనుచరులు దాడి జరిపినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో గీసుకొండ పోలీసులు కొండా వర్గానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ చేసిన ఆ ముగ్గురిని విడిచి పెట్టాలనే డిమాండ్‌తో ధర్మారం రైల్వే‌గేట్ వద్ద వరంగల్- నర్సంపేట ప్రధాన రహదారిపై కొండా వర్గీయుల ధర్నాకు దిగారు. సమస్యను పరిష్కరిస్తామని గీసుకొండ సీఐ మహేందర్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

తాజా పరిణామాల నేపథ్యంలోనే తన అనుచరుల అరెస్టును మంత్రి కొండా సురేఖ సీరియస్ గా తీసుకున్నారు. గీసుకొండ పోలీస్ స్టేషన్ వెళ్లి సీఐ కుర్చీలో కూర్చోని మరో వివాదానికి ఆస్కారమిచ్చారు. సీఐని తమ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. వెంటనే తమ వారిని విడిచిపెట్టాలని మంత్రి సురేఖ కోరారు. కొండా సురేఖ వర్గీయులు ఈ సందర్భంగా పెద్దఎత్తున గీసుకొండ పోలీస్ స్టేషన్ ఎదుట మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. వివాదం సద్దుమణిగినప్పటికీ… సీఐ కుర్చీలో కొండా సురేఖ కూర్చున్న వివాదం పెద్దదిగా మారే ప్రమాదం ఏర్పడింది. ఒక అధికారికి సంబంధించిన కుర్చీలో మంత్రి ఎలా కూర్చుంటారని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం కూడా కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి వెళ్లిందని చెబుతున్నారు. దీనిపై హైకమాండ్ చర్య తీసుకుంటుందా…ఇంకొంత అవకాశం ఇస్తుందా అన్నది చూడాలి..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి