ముంబైలో కొత్త అండర్ వరల్డ్ గ్యాంగ్… బాబోయ్ ఏం జరుగుతోంది…?

By KTV Telugu On 16 October, 2024
image

KTV TELUGU :-

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో మళ్లీ 1970ల నాటి పరిస్థితులు పునరావృతం కాబోతున్నాయని భయపడుతున్నారు. మూడు దశాబ్దాలకు పైగా ముంబై ప్రజలను వణికించిన అండర్ వరల్డ్ కొట్లాటలు, చంపుకోవటాలు మళ్లీ మొదలవుతాయని జనం ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేవలం శాంపిలేనని అసలు కథ త్వరలో మొదలవుతుందని ముంబై పోలీసులు, యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్..ఏటీఎస్..అధికారులు అనుమానిస్తున్నారు. పాకిస్థాన్లో తలదాచుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పేరును మరిచిపోయేలా చేసి…తానొక్కడే ముంబై నేర సామ్రాజ్యానికి మహారాజులా తయారు కావాలని లారెన్స్ బిష్ణోయ్ భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుస హత్యలకు తెరతీశాడని చెబుతున్నారు. 31 ఏళ్ల బిష్ణోయ్ ను అరెస్టు చేసి చాలా కాలమైంది.అన్ని జైళ్లు తిప్పుతున్న భద్రతా దళాలు అతడ్ని ప్రస్తుతం గుజరాత్లోని సబర్మతీ జైల్లో ఉంచినట్లు చెబుతున్నారు. కాకపోతే బిష్ణోయ్, జైలు నుంచే నేర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. విదేశాల్లో ఉన్న కాంటాక్ట్స్ తో సైతం మాట్లాడుతున్నాడంటే అతను ఎంత పవర్ ఫుల్ గ్యాంగ్ స్టరో అర్థం చేసుకోవచ్చు..

బిష్ణోయ్ విద్యార్థి దశలోనే నేరాలకు పాల్పడి తన కార్యకలాపాలను విస్తరించాడు. లారెన్స్ బిష్ణోయ్ .. పంజాబ్లోని ఫిరోజ్ పూర్ జిల్లా ధత్తరన్ వాలీ గ్రామంలో పుట్టాడు. 12వ తరగతి వరకు అక్కడే చదివిన తర్వాత పంజాబ్ విశ్వవిద్యాలయ పరిధిలోని డీఏవీ కాలేజీలో చేరాడు. అతను జాతీయస్థాయి అథ్లెట్ మాత్రమే కాకుండా… విద్యార్థి సంఘం నాయకుడు కూడా. విద్యార్థి రాజకీయాల్లో గోల్డీ బ్రార్ తో పరిచయం ఏర్పడిన తర్వాత నేరాల వైపుకు వెళ్లాడు. డీఏవీ కాలేజీ గ్యాంగ్ వార్ లో అతడి ప్రియురాలిని హత్య చేయడంతో పూర్తిగా నేరసామ్రాజ్యం వైపుకు మళ్లాడు. 2018లో సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్ని వార్తల్లోకి ఎక్కాడు. పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లో అతని కార్యకలాపాలు విస్తరించాయి.

బిష్ణోయ్ జైలు నుంచే గ్యాంగ్ వార్ కు తెరతీశాడు. భరత్ పూర్లో గ్యాంగ్ విస్తరించడానికి కారణమైన జస్విందర్ హత్య తర్వాతే అసలు గ్యాంగుల కథ బయటపడింది. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యకు కూడా గ్యాంగ్ వారేనని చెబుతారు. తన అనుచరుడు విక్కీ మిదుఖేడా హత్యకు ప్రతీకారంగానే లారెన్స్ అనుచరులు.. సిద్ధూ మూసేవాలాను కాల్చిచంపారు.

బిష్ణోయ్ చాలా కాలంగా జైలులోనే ఉంటున్నాడు. అతను అక్కడ నుంచి ఆర్డర్స్ ఇస్తాడు. కొన్ని రోజులు అక్రమంగా సెల్ ఫోన్ వాడైవాడు. తర్వాత వీఐఓపీ, డబ్బా కాలింగ్ పద్దతిలో తన అనుచరులకు ఆదేశాలిస్తాడు. కొన్ని చోట్ల నడిచే చట్ట విరుద్ధ అక్రమ టెలిఫోన్ ఎక్స్ఛేంజీల ద్వారా అతను ఫోన్లు చేయడం వల్ల పోలీసుల కళ్లు గప్పుతున్నాడు. దీని వల్ల అది రెగ్యులర్ మొబైల్ ఫోన్ ట్రాకింగ్ పరిధిలోకి రాదు…

బిష్ణోయ్ గ్యాంగ్ పరిధిలో 700 మంది షార్ప్ షూటర్లున్నారు. అందులో పంజాబ్ ప్రాంతంలోనే 300 మంది ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఎవరి నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి… ఎవరిపై కాల్పులు జరపాలి..లాంటి సమాచారం తెలియకుండానే యువకులు బిష్ణోయ్ గ్యాంగ్ కు సహాయ పడతారు. ఆఖరి రోజుల్లో మాత్రమే ఫోటోలు చూపించి షూట్ చేయమని చెబుతారట. చాలా మంది యువకులకు డబ్బులు ఆశచూపడంతో పాటు..పాశ్చాత్య దేశాలకు తీసుకువెళ్తామని హామీతో వారిని నేర సామ్రాజ్యంలోకి లాగుతున్నారు. అతని గ్యాంగ్ టార్గెట్ కిల్లింగ్ చాలా సులభంగా పూర్తి చేస్తోంది..బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ కెనడాలో ఉంటూ… నేర కార్యకలాపాలకు ఊతమిస్తున్నాడు.

బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పుడు ముంబై మహానగరంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ముసలితనం వచ్చిన దావూద్ ఇబ్రహీం క్రమంగా ముంబై అండర్ వరల్డ్ పై పట్టు కోల్పోతున్నాడని తెలిసి.. బిష్ణోయ్ అతని స్థానాన్ని భర్తీ చేసే ప్రయత్నంలో ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. దాని కోసం అతను పాకిస్థాన్, కెనడాలో తిరిగే గ్యాంగ్ స్టర్లతో కూడా టచ్ లో ఉన్నాడు. రెండేళ్ల క్రితం అతను పాకిస్థాన్లో ఉన్న ఒక నేరగాడితో ఫోన్లో మాట్లాడుతండగా పోలీసులు గుర్తించారు. బిష్ణోయ్ గ్యాంగ్ సీమాంతర స్మగ్లింగుకు కూడా పాల్పడుతోంది. లిక్కర్ మాఫియాను బెదిరించి డబ్బులు వసూలు చేస్తోంది. పేరుమోసిన వ్యాపారుల దగ్గర వసూళ్లకు పాల్పడుతుంది. డబ్బులిచ్చేందుకు నిరాకరించిన వారిపై షార్ప్ షూటర్లను ప్రయోగిస్తోంది. ఒకరిద్దరిని చంపిన తర్వాత మిగతా వాళ్లు దారికి వస్తారని గ్యాంగ్ విశ్వసిస్తుంది.

బిష్ణోయ్ గ్యాంగ్ ఒక కార్పొరేట్ కంపెనీలా పనిచేస్తుంది. గతంలో దావూద్ ఇబ్రహీం కార్యకలాపాలు కూడా అలాగే ఉండేవి. ఆయుధాలు సమకూర్చే గ్యాంగ్ వేరుగా ఉంటుంది. పోలీసులకు చిక్కిన వారిని జైలు నుంచి బయటకు తెచ్చేందుకు లీగల్ టీమ్ సిద్ధంగా ఉంటుంది. చంపాలనుకున్న వారి సమాచారాన్ని, కదలికలను సేకరించి షూటర్లకు అందించే మరో టీమ్ నిత్యం పనిచేస్తూ ఉంటుంది. మొత్తం 12 కేసుల్లో బిష్ణోయ్ నిందితుడిగా ఉన్నాడు. ఐనా సరే అతను బెయిల్ కు దరఖాస్తు చేసుకోవడం లేదు. ఇంతవరకు తాను ఎలాంటి నేరం చేయలేదని పోలీసులే కేసులు బనాయిస్తున్నారని అతను ఆరోపిస్తున్నాడు. కృష్ణ జింకల కేసు నిందితుడు సల్మాన్ ఖాన్ ను మాత్రం విడిచిపెట్టేది లేదని, అత్యంత ఆటవికంగా చంపుతామని అతను ప్రకటించారు. తమ కులదైవమైన కృష్ణజింకను సల్మాన్ చంపాడని అతను గుర్తుచేస్తాడు. ఇప్పటికే సల్మాన్ పై రెండు పర్యాయాలు దాడికి యత్నం జరిగింది. తాజాగా హత్యకు గురైన బాబా సిద్దిఖీ కూడా సల్మాన్ ఖాన్ మిత్రుడే. అందుకే రేపు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి