అధికారం మారుతోంది. పార్టీలు మారుతున్నాయి. పనులు చేయించే ఏజెంట్లు, పవర్ బ్రోకర్లు మాత్రం మారడం లేదు. వాళ్లే కొనసాగుతున్నారు. ఎవరు అధికారంలో ఉన్నా సరే..తాము దూరిపోయి చక్రం తిప్పుతామని, ఆ సత్తా తమకు ఉందని రాజకీయ మధ్యవర్తులు నిరూపిస్తున్నారు. హార్డ్ కోర్ టీడీపీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాలుగు పదవులు ఆశించిన వాళ్లు లబోదిబోమని మొత్తుకుంటున్నా… ప్రస్తుత ప్రభుత్వం ఏమీ పట్టించుకున్న దాఖలాలు లేవు. నిన్నటి పాలకుల దగ్గర కారిడార్లలో తిరిగిన వాళ్లనే మళ్లీ ఇప్పుడు తమ చుట్టూ తిప్పుకుంటోంది. వారికే పనులు అప్పగిస్తూ చక్కబెట్టాలని ఆదేశిస్తోంది. మీడియా నుంచి సోషల్ మీడియా వరకు ఎవరు ఎన్ని సార్లు మొత్తుకున్నా.. ఇదీ పద్ధతి కాదూ అని పుంఖానుపుంఖాలుగా రాసేసినా పట్టించుకోవడం లేదు..మేము అంతే అని చెబుతోంది…
వైసీపీ హయాంలో ఒక వెలుగు వెలిగిన వాళ్లను ఇప్పుడు టార్గెట్ చేసి లోపలేస్తారని టీడీపీ కేడర్ ఎదురుచూసింది. పరిస్తితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అప్పటి వాళ్లే ఇప్పుడు చక్రం తిప్పుతున్నారు. పైగా టీడీపీలోనూ, టీడీపీకి సన్నిహితంగా ఉండే ఇతర పార్టీల పెద్దలతోనూ రాసుకుని పూసుకుని తిరుగుతూ వాళ్లు.. కావాల్సిన పనులు చేస్తున్నారు.చేయిస్తున్నారు అలాంటి వారిలో సానా సతీష్ పేరు 24 గంటలుగా మారుమోగిపోతోంది. చంద్రబాబు తనయుడైన ఏపీ మంత్రి నారా లోకేశ్ కు తాను ఎంతో సన్నిహితుడినని సానా సతీష్ చెప్పుకుని పనులు చక్కబెట్టుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అందుకు బీజేపీకి చెందిన ఒక ఎంపీ సహకరిస్తున్నారని కూడా తెలుస్తోంది.నిజానికి సానా సతీష్ పై అనేక కేసులున్నాయి. సీబీఐ ఉన్నతాధికారుల మధ్యే తగవు పెట్టినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. ఒక కేసులో ఈడీ అతడ్ని అరెస్టు చేసిన సందర్భం కూడా ఉంది. పొలిటికల్ లాబీయిస్ట్ నుంచి ప్రజాప్రతినిధిగా కొత్త అవతారం ఎత్తాలని తీవ్రంగా సానా సతీష్ ప్రయత్నించాడు. అయినప్పటికీ కుదర్లేదు.దీంతో తన పాత పరిచయాల్ని ఉపయోగించుకుని లోకేశ్‌కు సన్నిహితమయ్యాడు, తాను చెప్పినట్టు మంత్రి వింటారని ప్రచారం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు వైసీపీ నేతలకు సానా సతీష్ చాలా క్లోజ్ గా ఉండేవాడు. వాళ్లతో మాత్రమే మాట్లాడేవారు. వారి పీఏలు ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యేవాడు కాదు. సార్ ఫోన్ చేస్తేనే మాట్లాడేవాడు. ఎన్నికల ముందు జనసేనకు క్లోజ్ అయిన సానా సతీష్… కాకినాడ ఎంపీ టికెట్ అశించాడు. ఆ పని జరిగి ఉంటే..కూటమి ప్రభంజనంలో ఖచితంగా గెలిచి.. పొలిటీషన్ కం లాబీయిస్టుగా మారేవాడు.
టికెట్ దొరక్కపోయినా సానా సతీష్ పోగొట్టుకున్నదేమీ లేదు. రాజకీయ నాయకుడి కంటే ఎక్కువగా లాబీయింగ్ చేసి సంపాదిస్తున్నాడని చెబుతున్నారు. కూటమి సర్కారులో తాను సూపర్ పవర్ అని చెప్పుకుంటున్నాడు. ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో మైనింగ్ వ్యవహారాలను గుప్పిట పట్టాడు. మైనింగ్, అటవీ, రెవెన్యూ అధికారుల బదిలీల్లో అతను చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. తనకు కీలకమైన ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం పరిధిలో ఆయా శాఖల్లో తనకు నమ్మకస్తులైన వారిని కీలక స్థానాల్లో కూర్చోబెట్టినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కాకినాడలో మైనింగ్, అటవీ అధికారులకు అతని సిఫారసు మేరకే పోస్టింగ్ ఇచ్చారని అధికార వర్గాలు చెబుతున్నాయి. సానా సతీష్ దూకుడు వెనుక ఒక ఎంపీ ప్రోత్సాహం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన టీడీపీ ఎంపీ కానప్పటికీ… చంద్రబాబుకు, అటూ బీజేపీ అగ్రనాయకత్వానికి అత్యంత సన్నిహితుడన్న పేరు ఉంది.దానితో సతీష్ రెచ్చిపోతున్నాడని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు సతీష్ లాంటి వారిని చూసి సగటు తెలుగుదేశం నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాము చేయాల్సిన పనులన్నీ.. వైసీపీ నుంచి వచ్చిన పవర్ బ్రోకర్లు చేస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. టీడీపీ అధిష్టానం వారిని ఎందుకు ప్రోత్సహిస్తుందో అర్థం కాక తలబాదుకుంటున్నారు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…