దక్షిణ కోస్తా, రాయలసీమలో రేపటి వరకు వర్షాలు

By KTV Telugu On 17 October, 2024
image

KTV TELUGU :-

నాలుగు రోజులుగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, ఉత్తర కోస్తా తమిళనాడును భయపెట్టిన వాయుగుండం ఎట్టకేలకు తీరం దాటింది. తిరుపతి జిల్లా తడ వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన ఆరు గంటల్లో 22 కిలోమీటర్ల వేగంతో కదిలి తీరాన్ని చేరినట్లు వాతావరణ శాఖ లెక్కగట్టింది. బుధవారం గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదిలిన వాయుగుండం తీరం దగ్గరకు వచ్చే సమయానికి వేగం పెరిగింది. తీరం దాటిన తర్వాత అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమతో పాటు ఉత్తర తమిళనాడులో మరో 24 నుంచి 36 గంటల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి…

వాయుగుండం ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పారుమంచాలలో భారీ వర్షానికి ఇసుక వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనితో పలు గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. నందికొట్కూరులో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది.

శ్రీసత్య సాయి జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఎగువన కురిసిన భారీ వర్షాలకు చిత్రావతి నది పొంగి పొర్లుతోంది. నదిలోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు వచ్చి చేరుతోంది.చిత్రావతి డ్యామ్ నీటితో కళకళలాడుతోంది. కోవెలగుట్టపల్లి, రాయలవారిపల్లి వంతెనలపై ప్రవహిస్తున్న వరదనీటికి దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

వాయుగుండం తీరం దాటినా 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఇవాళ ప్రభుత్వాధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులకు ఇన్ ఫ్లో పెరుగుతోంది. వారం లోపు డెలవరీలున్న 60 మంది మహిళలను ముందు జాగ్రత్తగా ఆస్పత్రులకు తరలించారు. వర్షాలు పెరిగితే రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడి వారిని ఆస్పత్రులకు తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఉంటాయని గ్రహించారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 2008 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అక్కడకు తరలించి ఆహారం, మంచినీరు అందిస్తున్నారు.

వాయుగుండం ప్రభావంతో ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి నియోజక వర్గాల్లో పొంగి పొర్లిన వాగులతో జనానికి ఇబ్బందులు తప్పలేదు. జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో పాటు కలెక్టరేట్లో కంట్రోల్ రూము ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1077 అని ప్రకటించారు.

వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి ,తిరుపతి, అనంతపురం, కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో వరద ముప్పు వాటిల్లే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

రాష్ట్రంలో భారీ వర్షాలపై కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితిని సిఎంకు వివరించిన ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు.. పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు వెల్లడించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడినట్లు తెలిపిన జిల్లా అధికారులు…జనాన్ని సురక్షిత ప్రదేశాలకు తరలించామన్నారు,. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు, చెరువులు, వాగులు పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని సూచించిన చంద్రబాబు….ఆనకట్టల్లో నీటి నిల్వలపై ఆరా తీశారు. గురువారం కూడా భారీ వర్షాలు ఉంటాయనే హెచ్చరిక నేపథ్యంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించిన చంద్రబాబు…ఎక్కడా ఉదాసీనతకు అవకాశం లేకుండా చూసుకోవాలన్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి