ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన జనసేనాని పవన్ కల్యాణ్ దూకుడు మీదున్నారు. మంత్రిగా సమర్థంగా బాధ్యతలు నిర్వరిస్తూనే తాను ప్రాతినిధ్యం వహించే పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. రాజకీయాలు ముందు.. సినిమా తర్వాత అన్న నినాదంతో ఆయన పనుల వేగం పెంచారు. నియోజకవర్గం ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకునేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. తనకు 70 వేల ఓట్ల మెజార్టీ ఇచ్చిన ప్రజల సంక్షేమాన్ని విస్మరించేది లేదని పవన్ చెబుతున్నారు.
పవన్ గత ఐదు రోజుల్లో మూడు ఫైళ్లకు కదలిక తెప్పించారు. స్కూల్స్, హాస్పిటల్స్, హాస్టల్స్ లో తాగునీటి సరఫరాకు సంబంధించిన ఫైలు మొదటిది. అధికారులు ఆయా ప్రాంతాలకు వెళ్లి నివేదికలు సమర్పించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని పవన్ ఆదేశించారు. ఈ క్రమంలో గొల్లప్రోలు బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మంచి నీటి సమస్య తీరిందని చెబుతున్నారు. పిఠాపురం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మూడు మండలాల్లోని 52 గ్రామాల్లో పారిశుద్ధ్యానికి సంబంధించినది రెండో ఫైలు అని చెప్పాలి.
డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం వెదకాలని కోరుతూ ఒక ప్రతిపాదనను పవన్ కల్యాణ్ తీసుకొచ్చారు. జిల్లా కలెక్టర్ కు ఒక ఫైలును అందించారు. ఏళ్ల తరబడి నలుగుతున్న ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ప్రస్తుతం ఎకరంన్నర ప్రదేశంలో ఉన్న డంపింగ్ యార్డుకు బదులు.. పావు ఎకరా స్థలంలో దాన్ని సమర్థంగా నిర్వహించే ఏర్పాటు జరుగుతోంది. ఇంతకాలం డంపింగ్ యార్డ్ కారణంగా ఆస్పత్రికి వెళ్లే రోడ్డు మూసుకుపోగా.. ఇకపై జనం అటు వెళ్లేందుకు అవకాశం వస్తుంది.
పవన్ చర్యలతో టీడీపీ నేత వర్మకు నిద్ర పట్టని పరిస్థితి ఏర్పడింది. పొత్తులో భాగంగా పవన్ కల్యాణ్ కోసం పిఠాపురం సీటును త్యాగం చేసిన తనకు టీడీపీ అధిష్టానం న్యాయం చేస్తుందని ఎదురుచూస్తుంటే ఇంతవరకు జరిగిందీ శూన్యమని ఆయన వాపోతున్నారు. తొలి దఫా నామినేటెడ్ పదవుల్లో తనకేమీ దక్కలేదని ఆయన వాపోతున్నారు. పైగా పిఠాపురంలో జనసేన కార్యకర్తలు, నేతలు రెచ్చిపోతూ..టీడీపీని అణచివేస్తున్నారని ఆయన ఆసంతృప్తిగా ఉన్నారు. తమను పని చేయనివ్వడం లేదని, రోజురోజుకు జనంలో పలుచనైపోతున్నామని కూడా వర్మ ఆందోళన చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే జనం తమను అసలు లెక్కచేయరని అర్థం చేసుకున్న వర్మ.. ఇటీవల చంద్రబాబును కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. చంద్రబాబు వైపు నుంచి ఎలాంటి సమాధానం వచ్చిందో తెలియలేదు. ప్రస్తుతానికి మాత్రం వర్మ మౌనంగానే ఉన్నారు… ఇష్టపడో, కష్టపడో మాత్రం చెప్పలేము….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…