పదేళ్లు ఆయన సీఎంగా ఉండి ఉండొచ్చు. ఇప్పుడు మాత్రం తన రాజకీయ జీవితంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఆయన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు. చెప్పలేక చెప్పడం లేదు. చెప్పడం ఇష్టం లేక చెప్పడం లేదా అన్నది అర్థం కావడం లేదు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారో బోధ పడటం లేదు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ పార్టీ చేసిన తర్వాత తొలి పరీక్ష కూడా మహారాష్ట్రలో ఎదురుకాబోతోంది. దానితో ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారన్నది పెద్ద ప్రశ్నగా మారింది…
గత డిసెంబరులో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పదేళ్ల పాలనకు బ్రేకులు పడ్డాయి. అప్పటి నుంచి మాజీ సీఎం కేసీఆర్ లైమ్ లైట్లో లేరు.
పది నెలలుగా ఫామ్‌హౌజ్‌లోనే ఉండిపోయిన కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడు వస్తారు.. ఇప్పుడు వస్తారు అంటూ లీకులు ఇస్తున్నారు తప్పితే ఇంతవరకు ఆయన వచ్చింది లేదు. కానీ ప్రజలు మాత్రం ఆయన రాకకోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆయన స్పీచులు కోసం నిరీక్షిస్తున్నారు. మరోవైపు రోజురోజుకూ పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా మారుతున్నదని.. ఇప్పటికైనా రావాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. పార్టీకి మునుపటి ఊపు రావాలంటే తప్పనిసరిగా కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి గట్టి కౌంటర్లు ఇవ్వాలంటే అది కేసీఆర్ తోనే సాధ్యమని చెప్పుకుంటున్నారు.మిగతా వారి వల్ల ఆ పని కావడం లేదన్న టాక్ కూడా నడుస్తోంది. నిజానికి కేసీఆర్ ప్రజల్లోకి రావడంపై మరో ప్రచారం మొదలైంది. డిసెంబర్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి సంవత్సరం పూర్తవుతుంది. దాంతో సంవత్సరం కాలంలో కాంగ్రెస్ చేసిన పనులు.. చేసిన అప్పులు.. చేపట్టిన ప్రయోజనాలపై నిలదీసేందుకు వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. డిసెంబర్ లేదంటే జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో ఇదే సరైన సమయం అని కేసీఆర్ కూడా నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. రైతుల సమస్యలు, హైడ్రాతో పాటు ప్రతి అంశంపై ఆయన మాట్లాడుతారన్న టాక్ నడుస్తోంది. కేసీఆర్ నేరుగా జనంలోకి వెళ్లే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే బస్సు యాత్ర తరహాలో ఆయన ఏదో ప్లాన్ చేయబోతున్నారు. ఈ క్రమంలో పార్టీలో ప్రక్షాళన కూడా జరుగుతుందని లీకులు వస్తున్నాయి పై నుంచి కింది వరకు కొత్త కమిటీలు వేయబోతున్నారు…
కేసీఆర్ కు ఇప్పుడు మరో అతి క్లిష్టమైన ప్రశ్న ఎదురుకాబోతోంది. ఆయన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అనివార్యతలో ఉన్నారన్న చర్చ మొదలైంది. రెండో సారి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఆయన దృష్టి జాతీయ రాజకీయాలపై పడింది. దానితో ఆయన బీఆర్ఎస్ ను ప్రారంభించి.. బీజేపీయేతర, కాంగ్రెస్సేతర ఫ్రంట్ అంటూ కొత్త వాదనకు తెరతీశారు. ఆ తరువాత మహారాష్ట్ర నుంచి కూడా చాలా మంది నాయకులు వచ్చి స్వచ్ఛందంగా చేరారు. దాంతో కేసీఆర్ మహారాష్ట్రపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. నాందేడ్‌లో పార్టీ ఆఫీసును ప్రారంభించారు. అదే క్రమంలో అక్కడ జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ పోటీ చేసి పార్టీ సత్తాచాటారు. నాగ్‌పూర్ డివిజన్‌లోని భండారా జిల్లాలో 20, విదర్భ, షోలాపూర్‌లోని 15 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. అలాగే.. భారీ ఎత్తున సభ్యత్వాలు కూడా నమోదు చేయించింది. 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి. గ్రామస్థాయిలోనూ పార్టీ నిర్మాణం చేపట్టారు.
తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మాత్రం టీఆర్ఎస్ జాతీయ ఆకాంక్షలు గాలి బుడగలా పేలిపోయాయి. మహారాష్ట్ర పార్టీలో నేతలు ఒక్కరొక్కరుగా జారుకున్నారు. కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ కు పరిమితమై మౌనంగా ఉండిపోయాయి. ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించిన తర్వాత కేసీఆర్ ఏం చేయబోతున్నారన్న చర్చ మొదలైంది. మహారాష్ట్రలోకి రీ ఎంట్రీ ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి కేసీఆర్ మాత్రమే సమాధానం చెప్పగలరన్నది మాత్రం నిజం…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…