అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా…క్షేత్రస్థాయి తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో జోష్ కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి సీఎం అయితే సరిపోతుందా…మా రాజకీయ భవిష్యత్తు ఏమిటని వాళ్లు ప్రశ్నించుకుంటున్నారు. ఇన్నాళ్లు పార్టీ జెండా మోసి..గత ప్రభుత్వ వేధింపులు భరించిన తమకు ఇప్పుడు ఎలాంటి గౌరవం లభించడం లేదని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరడానికి కారణమైన నేతలకు ఇంతవరకు నామినేటెడ్ పదవులు దక్కలేదన్న ఆగ్రహమూ, టెన్షన్ పెరిగిపోతోంది. అది ఖమ్మం అయినా, భద్రాద్రి కొత్తగూడెం అయినా, సిద్ధిపేట అయినా, సంగారెడ్డి అయినా, పాలమూరు అయినా నారాయణ పేట అయినా..ఎక్కడ చూసినా ఒకటే సమస్య.. నామినేటెడ్ పదవులు ఎప్పుడు ఇస్తారనే తీరని వేదన….
కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగినప్పటికీ.. నేతలకు మాత్రం తీవ్ర అసంతృప్తి మిగిలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిస్థితి కూడా అలాంటిదే. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం రెండు చోట్ల పదవులు లేక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎండిపోయారు. మండిపోతున్నారు. ఆ జిల్లాకు ముగ్గురు మంత్రులున్నప్పటికీ.. తమ అనుచరులకు నామినేటెడ్ పదవులు ఇప్పించుకోలేకపోతున్నారన్న చర్చ జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేసీఆర్ హవా తెలంగాణ అంతా ఊపు ఊపినా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి క్లీన్ స్వీప్ చేయగా 2023 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క భద్రాచలం లో మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు గెలిచి అయన కాంగ్రెస్ లో చేరారు.దాంతో కాంగ్రెస్ పార్టీకి బలమైన జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం నిలిచింది.తెలంగాణ ఆవిర్భావం తరువాత వరుసగా రెండు పర్యాయాలు కేసీఆర్ అధికారం లోకి రావడం తో కాంగ్రెస్ శ్రేణులు తమ రాజకీయ భవిష్యత్ పై నిరాశగా ఉన్నవేళ, కాలం కలిసొచ్చి రేవంత్ రెడ్డి నాయకత్వం లో తెలంగాణ గడ్డ పై కాంగ్రెస్ జెండా ఎగిరింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు నియోజక వర్గాలు కొత్తగూడెం, ఇల్లందు, పినపాక, భద్రాచలం, అశ్వరావుపేట నియోజక వర్గాల్లో నేతలు నామినేటెడ్ పదవులు కోసం ఎంతో ఆశగా ఉన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం అంతగా కష్టపడిన వారికి కనీసం నామినేటెడ్ పదవులు ఇప్పించరా అని ప్రశ్నిస్తుంటే… ఎమ్మెల్యేలు నీళ్లు నములుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోదేం వీరయ్యకు మాత్రమే దక్కింది.ఆయన్ను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థకు చైర్మన్ గా నియమించారు.జిల్లా స్థాయి నామినేట్ పోస్ట్ లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు,ఆత్మ కమిటీ చైర్మన్ పదవులు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ పదవులు ,దేవాలయాల పాలక మండళ్ల పదవులు కోసం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రభుత్వం ఏర్పడి పది నెలలైనా నామినేటెడ్ పదవులు భర్తీ చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆశావాహులు ఎమ్మెల్యే లను నిలదీస్తున్నారట.
ఇక దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాద్రి రామాలయ పాలక మండలి నియామకం ఎప్పుడు జరుగుతుందని నేతలు ప్రశ్నించుకుంటున్నారు. ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే ఇదీ కూడా జాప్యమవుతోంది. కేసీఆర్ హయాంలోనూ భద్రాద్రి పాలకమండలి నియామకం జరగలేదని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురవుతోందని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. అయితే ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉండటమే ఇప్పుడు శాపంగా పరిణమించిందని కొందరు చెప్పుకుంటున్నారు. తుమ్మల, భట్టి,పొంగులేటి…ఎవరి అనుచరులకు నామినేటెడ్ పదవులు ఇస్తే ఎవరికి కోపం వస్తుందోనన్న ఆలోచనతో రాష్ట్ర అధిష్టానం తాత్సారం చేస్తోందన్న వాదన కూడా వినిపిస్తోంది…
ఒక ఉమ్మడి నల్గొండలోనే కాకుండా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. ముఖ్యనేతలను నమ్ముకుని పనిచేసిన సీనియర్లు కూడా.. అటు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, ఇటు జిల్లా స్థాయి పదవులను ఆశిస్తూ ఎదురు చూస్తున్నారు. మంత్రుల మధ్య సమన్వయ లోపమే నామినేటెడ్ పదవుల్లో జాప్యానికి కారణమవుతోందని చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో నామినేటెడ్ పోస్టుల జాబితా ఇప్పటికే పీసీసీకి చేరిందని చెబుతున్నారు. ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ మధ్య వివాదాల కారణంగా విషయం కొలిక్కి రావడం లేదని తేలిపోయింది. దీనితో ఆశావహులు తలలు పట్టుకు కూర్చుంటున్నారు. ఇలాగైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలవడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇకనైనా సీఎం రేవంత్ రెడ్డి ఆలస్యం చేయకుండా నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని కాంగ్రెస్ జనం కోరుతున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…