సునీతకు న్యాయం జరిగే అవకాశం ఉందా…

By KTV Telugu On 22 October, 2024
image

KTV TELUGU :-

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిలా రెడ్డికి మధ్య రాజీ మార్గానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రెండేళ్లకు పైగా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే కుటుంబ బంధంపై మళ్లీ చిన్న చిన్న ఆశలు రేగుతున్నాయి. అన్నా చెల్లీ ఇద్దరూ బెంగళూరులో సమావేశమై ఆస్తుల వివాదానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా పంపకాలు జరిపేందుకు జగన్ అంగీకరించారని సన్నిహితుల లీకులు ఇస్తున్నారు. జగన్ కూడా తాను ఎన్నికల్లో ఓడిపోయినందున ఇక చెల్లిలో గొడవ వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదని నిర్ణయానికి నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలోనే మరో మహిళ పరిస్థితి ఏమిటి. ఇంతకాలం ఆమె జరిపిన పోరాటం వృథా అయిపోయినట్లేనా అన్న చర్చ కూడా మొదలైంది.

జగన్, షర్మిల రాజీ పడితే మరి బాబాయి కూతురు సునీత పరిస్థితేమిటన్న అనుమానాలు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ అభిమానుల్లో కలుగుతున్నాయి. ఒకప్పుడు తనకూ, షర్మిలకు న్యాయం జరగాలన్న డిమాండ్ తో రోడెక్కిన సునీత ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదన్నది నిజం. ఎన్నికల్లో జగన్ ఓటమి కోసం ఆమె కూడా వైఎస్ వ్యతిరేక ప్రచారం చేశారు. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన వారిని జగన్ కాపాడుతున్నారని ఆమె గగ్గోలు పెట్టారు. హు కిల్డ్ బాబాయ్ అన్న నినాదం ఇంటింటా ప్రచారం జరిగినప్పుడు సునీత ఒక ఫైటర్ గా కనిపించారు. న్యాయం కోసం పోరాడే మహిళగా అందరికీ ఆదర్శంగా నిలిచారు. అవినాశ్ రెడ్డిని ఇతర నిందితులను జగన్ రెడ్డి కంటికి రెప్పలా కాపాడుతున్నారంటూ ఆరోపించారు. కోర్టులు, సీబీఐ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఆమె సరికొత్త సాక్ష్యాలను సమర్పించేవారు. కడప లోక్ సభా స్థానానికి పోటీ చేసిన షర్మిలకు ఆమె పూర్తి మద్దతుగా నిలిచారు.వివేకా హంతకులెవరో తెలియాలంటే, వారిని చట్టం ముందు నిలబెట్టాలంటే షర్మిలను గెలిపించాలని సునీత ఓటర్లకు విజ్ఞప్తి చేసేవారు. ఎన్నికలప్పుడు షర్మిల, సునీతకు కలిపి కడప సిస్టర్స్ అని పేరు కూడా వచ్చింది..

న్యాయపోరాటంలో సునీతకు షర్మిల బాసటగా నిలవడం ఆమెకు కొంత ధైర్యాన్నిచ్చింది. వైఎస్ కుటుంబ వ్యక్తే మద్దతివ్వడంతో సునీత సంతోషించారు. ఎన్నికలు ముగిసే వరకు కూడా వివేకా కేసు గురించే చర్చ జరిగేది. జగన్ ఓడిపోయిన తర్వాత వివేకా కేసును టీడీపీ కూటమి పార్టీలు పట్టించుకోవడం మానేశాయి. గొడ్డలి పోటు అన్న మాటనే అందరూ మరిచిపోయారు. కేసు గురించి సునీత పట్టించుకుంటున్నారా లేదా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. ఆఖరి సారిగా ఆగస్టు 8న సునీత వెళ్లి.. ఏపీ హోం మంత్రి అనితను కలుసుకుని కేసు విచారణ వేగవంతమయ్యేందుకు సహకరించాలని కోరారు. అనిత నుంచి సానుకూల స్పందన వచ్చిన మాట నిజం. అయితే తర్వాత ప్రభుత్వం వైపు నుంచి కూడా అంత వేగం కనిపించడం లేదు. ఇప్పుడేమో… జగన్, షర్మిల మధ్య ప్యాచప్ అవుతోందన్న చర్చ జరుగుతోంది. వైద్యురాలైన సునీత తన వృత్తిలో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం అసలు వైఎస్ కుటుంబ వర్గాల్లో వివేకా హత్య కేసు చర్చకు రావడం లేదు.

జగన్, షర్మిల బెంగళూరులో కలిశారన్న వార్తకు సరైన ఆధారాలు దొరక్కపోయినా.. అటు షర్మిల కానీ ఇతరులు కానీ….. సునీతను పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల తర్వాత సునీత సైడైపోయారన్న టాక్ ఇప్పుడు బలపడుతోంది. వివేకా కేసు అసలు టాపికే కాదన్నట్లుగా షర్మిల సహా ఇతర కుటుంబ సభ్యులు ప్రవర్తిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో రోజుకు మూడు సార్లు వివేకా దారుణ హత్యను ప్రస్తావించిన షర్మిల..ఇప్పుడు ఎక్కడా ఆ మాట ఎత్తడం లేదు. జగన్ పరిపాలనలో లోపాలను ప్రస్తావిస్తున్నారే తప్ప….కుటుంబ అంశాలను టచ్ చేయడం లేదు.దానితో ఎలాంటి మద్దతు లభించక సునీత అన్యాయమైపోతున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి