ఆంధ్రప్రదేశ్ తీరానికి గత వారమే ఒక తుపాను గండం దాటిపోయింది. ఇప్పుడు మరో తుపాను పొంచి ఉందని భయపడుతున్నారు. తుపాను ఒడిశా – పశ్చిమ బెంగాల్ వైపు వెళ్తుందని చెబుతున్నప్పటికీ దాని ప్రభావంతో ఉత్తర కోస్తా తీర ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే టైమ్ లో తుపాను దిశ మార్చుకుని ఆంధ్రప్రదేశ్ వైపుకు వస్తే..కల్లోలం ఖాయమని భయపడుతున్నారు….
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్యంగా పయనించి మంగళవారం ఉదయానికి వాయుగుండంగా బలపడింది. సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఒడిశాలోని పారాదీప్‌కు 600 కిలోమీటర్ల ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. గురువారం ఉదయానికి అది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీనికి ఒమన్ దేశం సూచించిన ‘దానా’ పేరు పెట్టారు. ఈ నెల 25న దానా తుపాను ఒడిశాలోని పారాదీప్ నుంచి బాలాసోర్ మధ్య తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. 25న తీరం దాటే సమయంలో ఉత్తరాంధ్రలో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. దీనిపై మరి కొన్ని గంటల్లో స్పష్టత వస్తుంది.
రానున్న 24 గంటల్లో రాయలసీమలో పలుచోట్ల, కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. 12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని చెప్పారు.దానా తుపాను ప్రభావంతో ఈ నెల 25 వరకు తూర్పు కోస్తా రైల్వేలోని పలు రైళ్లను రద్దు చేశారు. గురువారం అత్యధికంగా 37 సర్వీసులు రద్దయ్యాయి. దీని వల్ల హౌరా, ఖరగ్ పూర్, భువనేశ్వర్, పూరీ వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గురువారం భువనేశ్వర్ – విశాఖ వందే భారత్ రైలు కూడా రద్దయ్యింది.
ఇక ఈశాన్య రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. వాటి ప్రభావంతో తమిళనాడులో వర్ష బీభత్సం నెలకొంది. అదే క్రమంలో రాయలసీమ జిల్లాలోనూ ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉంటూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజులు సీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాలో కూడా మరో రెండు రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…