ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక సమీకరణాలను సరి చేసేందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అన్ని పదవులు ఒక్క సామాజిక వర్గానికేనా అన్న ప్రశ్నలకు స్వస్తి చెప్పి… బలమైన సామాజిక వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలని చంద్రబాబు, నారా లోకేష్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కాపు సామాజికవర్గం నాయకుడు వంగవీటి రాధాకృష్ణకు మంత్రి పదవి కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. టీడీపీలో అనధికార నెంబర్ టూగా ఉన్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్ స్వయంగా రాధాకృష్ణను కలుసుకుని ఈ ప్రతిపాదన చేశారని సమాచారం..
వంగవీటి రాధా కొన్ని రోజుల క్రితం గుండె సంబంధిత అనారోగ్యానికి లోనై… ఆస్పత్రిలో చికిత్స పొందారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ పర్యటన నుంచి నేరుగా రాధా నివాసానికి వెళ్లిన ఏపీ మంత్రి నారా లోకేష్ ఆయన్ను పరామర్శించారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతూ… త్వరలో మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని సూచించారు. అందరం కలిసి పనిచేసుకుందామని ఆకాంక్షించారు. వంగవీటి రాధాను శాసనమండలికి నామినేట్ చేస్తామని కూడా ప్రకటించారు. దానితో వంగవీటికి అప్పగించే బాధ్యతపై చర్చ మొదలైంది. దీనిపై టీడీపీలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు ఇచ్చిన క్లారిటీ ప్రకారం… వంగవీటి రాధాకు మంత్రి పదవి ఇవ్వాలని కూటమి అధినేత చంద్రబాబు ఆలోచిస్తున్నారు. దీనిపై దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఎమ్మెల్సీని చేసి మంత్రిపదవి ఇస్తే బావుంటుందని నారా లోకేష్ స్వయంగా ప్రతిపాదించడంతో చంద్రబాబు కూడా అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. వంగవీటి రాధా విశ్వాసమున్న, విశ్వసనీయమైన నాయకుడని కూడా చంద్రబాబు అంచనా వేసుకుంటున్నారట…
నిజానికి రాధా రెండు మూడు పార్టీలు మారారు. 2019 ఎన్నికల ముందు వరకు వైసీపీలో ఉండి, సరిగ్గా పోలింగ్ కు ముందు టీడీపీలో చేరారు. అప్పుడు ఆయనకు టికెట్ లభించలేదు. ఐనా పార్టీకి విధేయుడిగా ఉన్నారు. నారా లోకేష్ పాదయాత్రకు పూర్తి మద్దతివ్వడంతో పాటు.. విజయవాడలోకి యువగళం ఎంటరైనప్పుడు రాధా ఆయనకు స్వయంగా స్వాగతం పలికారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ లభించకపోయినా రాధా మౌనంగా ఉన్నారు. విజయవాడలో టీడీపీ విజయం కోసం పనిచేసి పార్టీలో పట్టు మరింతగా పెంచుకున్నారు. లోకేష్ కు సన్నిహితుడిగా మారారు.స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టయినప్పుడు జగన్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలైనప్పుడు వ్యక్తిగతంగా కలుసుకుని సంఘీభావం ప్రకటించారు. ఇలాంటి చర్యలన్నీ రాధాకు ఇప్పుడు అనుకూలంగా మారాయి…
టీడీపీలో అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కాపు సామాజికవర్గానికి చెందిన రాధాకు మంత్రి పదవి ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఏకైక మంత్రి పదవిని రాధాకు ఇవ్వబోతున్నట్లు సమాచారం. దీని వల్ల బెజవాడ కాపులను కూడా మంచి చేసుకున్నట్లవుతుందని చంద్రబాబు అంచనా వేసుకుంటున్నారు. కాపు నాయకుడైన పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ… టీడీపీలో కాపులకు అత్యంత ప్రాధాన్యం లభిస్తుందని చెప్పడం కూడా చంద్రబాబు ఉద్దేశం కావచ్చు. అంతకు మించి మరో కోణం కూడా ఇందులో ఆవిష్కృతమవవుతోంది. నారా లోకేష్ తన సొంత టీమును ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలోనే కేబినెట్లో తనకు కావాల్సిన వారిని ఎంపిక చేసుకుంటున్నారని చెప్పుకోవాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…