ధరణి మార్పులు ఖాయమంటున్న పొంగులేటి…

By KTV Telugu On 24 October, 2024
image

KTV TELUGU :-

తెలంగాణ రాజకీయాలు సంచలనాలకు వేదిక కానున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేల్చిన పొలిటికల్ బాంబుపైనే ఇప్పుడు రాష్ట్రమంతా చర్చించుకుంటోంది. ఎవరిని ఎవరు టార్గెట్ చేయబోతున్నారనేది పెద్ద ప్రశ్న. రేవంత్ ప్రభుత్వ పాలన ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో అసలు కార్యాచరణ ప్రారంభమవుతుందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏడాది పాటు సేకరించిన సాక్ష్యాధారాలను బయటపెట్టి దర్యాప్తును వేగవంతం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ క్రమంలో కొన్ని అరెస్టుకు కూడా తప్పవని తెలుస్తోంది. పైగా సమయం లేదు మిత్రమా అన్నట్లుగా ఒకటి రెండు రోజుల్లోనే పెద్ద బాంబులు పేలబోతున్నాయని పొంగులేటి స్వయంగా ప్రకటించడం ఇప్పుడు అసలు సంచలనానికి కారణమవుతోంది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన ప్రతీ అవినీతికర కార్యక్రమానికి లెక్క తీస్తామని కాంగ్రెస్ ప్రకటించడం మామూలు విషయం కాదని.. పక్కా ప్రణాళికతోనే ముందుకు వెళ్తున్నారని చెప్పక తప్పదు.

బీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టే విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసు అధికారులను అరెస్టు చేసినప్పటికీ ఇంతవరకు రాజకీయ నాయకుల జోలికి రాలేదు. ట్యాపింగ్ లో బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందన్న అనుమానాలు బలపడుతున్నప్పటికీ.. పోలిటికల్ మాస్టర్స్ చెబితేనే పోలీసులు ట్యాపింగ్ చేశారని తెలిసినప్పటికీ…ఇంతకాలం తొందరపడలేదు. ఇప్పుడిక ఉపేక్షించే పరిస్తితి లేదని పొంగులేటి సందేశమిచ్చారు. పైగా సియోల్ పర్యటనలో మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ పొంగులేటి ..పొలిటికల్ బాంబుల ప్రస్తావన తీసుకురావడం కూడా వ్యూహాత్మకమేనని చెప్పాలి. కాంగ్రెస్ వచ్చాక ధరణిని బంగాళా ఖాతంలో వేస్తాం అని చెప్పామని… చెప్పినట్లుగానే ధరణిని మారుస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. విదేశీ కంపెనీ కబంధహస్తాల నుంచి కేంద్రంలోని ఎన్ఐసికి అప్పగిస్తున్నామన్నారు. 2024 కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకు వస్తున్నామని, 15 దేశాల్లోని మంచి రెవెన్యూ అంశాలను తీసుకుని డ్రాఫ్ట్ తయారు చేశామని చెప్పారు.గత ప్రభుత్వంలో ధరణి అనే భూతాన్ని తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టారని, విదేశీ కంపెనీలకు కోట్ల భూములను తాకట్టు పెట్టారని, ధరణి పేరుతో ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చాక ధరణిని బంగాళా ఖాతంలో వేస్తామని చెప్పామని… చెప్పినట్లుగానే ధరణిని మారుస్తున్నామని అన్నారు. ఇప్పటికే డ్రాఫ్ట్ కు తుది మెరుగులు దిద్దామన్నారు. ధరణీలోని 36 మ్యాడుల్స్ తొలగించి సింగిల్ డిజిట్‌లో మ్యాడుల్ తెస్తున్నామని, పార్ట్ బి లోని 13 లక్షల ఎకరాల సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం పెద్దలు తమ తొత్తులకు ఇచ్చిన ప్రభుత్వ భూములను వెలికి తీస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదీ ఒక కీలకాంశమే అవుతుంది. భూములు కట్టబెట్టడం ద్వారా అప్పటి బీఆర్ఎస్ పాలకులు బినామీలకు ధారాదత్తం చేసి ఉంటారన్న అనుమానాలకు కూడా తెరపడే టైమ్ వచ్చినట్లే అనుకోవాలి.

పొంగులేటి ఏకకాలంలో పది అంశాల ప్రస్తావన చేశారు. ఇందుకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలతో ఫైళ్లు కూడా సిద్ధం చేశామని తెలిపారు. పైగా కొన్ని రోజులు కూడా కాకుండా, కొన్ని గంటల వ్యవధిలోనే చర్యలు ఉంటాయని చెప్పడం ద్వారా… అనేక మంది నాయకులను ఏకకాలంలో ఫిక్స్ చేస్తామని పరోక్షంగా ప్రకటించారు. తప్పు చేసింది ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ దాదాపు పూర్తయిందని, మొత్తానికి ఫోన్‌ ట్యాపింగ్‌, కాళేశ్వరం, ధరణి అంశాలు ట్రాక్‌లో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ఎలాంటి చర్యలు లేవని ప్రజలు భావించవద్దని, వారు కోరుకునే విధంగా పూర్తి ఆధారాలతో ముందుకు రాబోతున్నామని వెల్లడించారు.

ధరణికి సంబంధించి కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలోనే దర్జాగా భూములు కొల్లగొట్టారని కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోంది. ఈ విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒకటి రెండు పర్యాయాలు ఆరోపణలు సంధించి ఉన్నారు. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి పలు పర్యాయాలు హెచ్చరించారు.దోపిడీ చేసేందుకు ధరణి పోర్టల్ ను సమస్యల పుట్టగా మార్చారన్నది కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలో వరుస అరెస్టులు జరుగుతాయన్న చర్చ మొదలైంది. అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను తొలుత అరెస్టు చేస్తారా లేక నేరుగా నేతలపై దృష్టి పెడతారా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వానికి టార్గెట్ గా ఉన్నారు.దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి…

https://youtu.be/yXmv5rlgR9Y

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి