జగన్ తర్వాతి స్థానం కోసం పోటీ…

By KTV Telugu On 26 October, 2024
image

KTV TELUGU :-

వైసీపీ ఓడిపోయినా కూడా క్రియాశీలంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. పడిన వెంటనే లేచి నిల్చున్న ఫీలింగు ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండో రోజు నుంచే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వచ్చేశారు. ఏదో విధంగా మాస్ కాంటాక్ట్ లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. రోజూ వారీ ప్రకటనలిస్తూ… చంద్రబాబు ప్రభుత్వంపై ఇసుక, మట్టి చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ సమస్య కనిపించినా వాలిపోతున్నారు. ఈ క్రమంలో వైసీపీలో మరో చర్చ పారలల్ గా నడుస్తోంది. ఐదేళ్ల పాటు కూటమి ప్రభుత్వంపై యుద్ధం చేసేందుకు జగన్ తో పాటుగా ఉండేదెవ్వరూ అని పార్టీ శ్రేణులు ప్రశ్నించుకుంటున్నాయి. కేసుల విషయంలో జగన్ జైలుకు వెళ్లాల్సి వస్తే పార్టీని ఎవరు నడిపిస్తారన్న సందేహాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే జగన్ తర్వాతి పొజిషన్ ఎవరూ అన్న ప్రశ్న తలెత్తుతోంది. పార్టీలో నెంబర్ టూ…. ఫలానా వారేనా అని శ్రేణులు చర్చించుకుంటున్నాయి.

పార్టీ ప్రధాన కార్యదర్శి, నిన్నటి దాకా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నెంబరు టూ గా ఉంటారని కొన్ని రోజులు చర్చ జరిగిన మాట వాస్తవం. అయితే ఎన్నికలైన తర్వాత ఆయన్ను పక్కన పెట్టిన తీరు మాత్రం జగన్ మనసులో మాటను బయటపెట్టింది. సజ్జలకు అంత సీన్ లేదని జగనే స్వయంగా చెప్పినట్లయ్యింది. ఒకప్పుడు విజయసాయి రెడ్డి పార్టీలో చాలా పవర్ ఫుల్ గా ఉండేవారు. ఆరోజుల్లో ఉత్తరాంధ్ర సీఎం అని ఆయన్ను పిలిచేవారు. జగన్ చేయని పనులను కూడా సాయి రెడ్డి చేయించేస్తారని జనం ధైర్యంగా ఆయన్ను కలిసేవారు. తర్వాతి కాలంలో విజయసాయి దాదాపుగా ఫేడవుట్ అయిపోయారు. ఉత్తరాంధ్ర ఇంచార్జీగా వైవీ సుబ్బారెడ్డిని నియమించిన తర్వాత ఆయన చాలా వరకు సైలెంట్ గా ఉండిపోయారు. ఎవరు వచ్చినా.. నాతో కాదులే పార్టీలో మాట్లాడుకోండని చెప్పడం మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు మళ్లీ సాయి రెడ్డికి మంచి రోజులు వచ్చాయన్న ఫీలింగ్ కలుగుతోంది.

తాజాగా విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర కో ఆర్డినేటర్ గా నియమించారు. విశాఖలో విజయసాయి కుటుంబం ఆక్రమణలకు పాల్పడిందని తెలిసినప్పటికీ జగన్ ఆయనకే పెద్ద పీట వేయడం వెనుక..పార్టీలో స్టేటస్ పెంచడమేనని చెప్పుకుంటున్నారు. ఒక పక్క కూటమి ప్రభుత్వ పూర్తి నిఘాలో కూడా పార్టీకి వెన్నుదన్నుగా ఉండే నాయకుడు విజయసాయి మాత్రమేనని జగన్ భావించి ఉండొచ్చు. ఈ క్రమంలో విజయసాయి కూడా కాస్త దూకుడు పెంచబోతున్నట్లుగా చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆయన ఆమరణ దీక్ష చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. ఉక్కు ఉద్యమానికి వైసీపీ పూర్తి అండగా ఉంటుందని చెప్పేందుకే విజయసాయి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్రలో పోయిన పరపతిని పట్టాలెక్కించేందుకు కూడా ఆయన కంకణం కట్టుకున్నట్లుగా తెలుస్తోంది. పైగా ఇంతకాలం రాజ్యసభ సభ్యుడిగా కీలక పాత్ర పోషించిన విజయసాయి రెడ్డికి కేంద్రంలోని పెద్దలతో సత్సంబంధాలున్నాయి. వాటి ఆధారంగా ఏదో ఒకటి చేసి వైసీపీకి ఉత్తరాంధ్ర ప్రజల మద్దతు కూడగట్టుకోవాలని సాయి రెడ్డి ప్రయత్నం కావచ్చు. ఏదో విధంగా మళ్లీ వైసీపీలో నెంబర్ టూ స్థానానికి ఎదగాలని ఆయన కష్టపడుతున్నట్లుగా చెప్పుకోవాలి…అయితే విశాఖ కేంద్రంలో గతంలో విజయసాయి చేసిన దందాలు మాత్రం పునరావృతం కాకుండా చూసుకోవాలి.

విజయసాయి సంగతి సరే సరి… మరో నేత మాత్రం నెంబర్ టూ కోసం గట్టిగా పోటీ పడుతున్నారు. ఆయనే చంద్రగిరి చంద్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల మనిషిగా తనకున్న పేరును ఉపయోగించుకుని చెవిరెడ్డి పార్టీలో మళ్లీ బలపడేందుకు ట్రై చేస్తున్నారు. వైసీపీలో ఎవ‌రికైనా జ‌గ‌న్‌తో మాత్ర‌మే అనుబంధం వుంటుంది. కానీ చెవిరెడ్డికి మాత్రం వైఎస్ జ‌గ‌న్ కుటుంబ స‌భ్యుల‌ అభిమానాన్ని కూడా ద‌క్కించుకున్నారు. జగన్ సతీమణి వైఎస్ భారతికి చెవిరెడ్డి అత్యంత విధేయుడని కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. పైగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి నిష్క్రమించిన తర్వాత ఇక చెవిరెడ్డి సూపర్ పవర్ గా మారుతున్నారని చెబుతున్నారు. పోటీదారులను అడ్డంగా అణిచివేసి… తానొక్కడే సీన్లో కనిపించే విధంగా ప్లాన్ చేయగల సమర్థుడు ఆయన. తాను తప్ప ఎవరూ జగన్ కు, ఆయన కుటుంబానికి దగ్గర కాకూడదన్న ఎత్తుగడలు వేస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పెద్దిరెడ్డి కుటుంబాన్ని కూడా పక్కకు నెట్టేశారని పార్టీ వర్గాలు బహిరంగంగానే చెప్పుకుంటున్నాయి. కిందిస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతున్న క్ర‌మంలో ఎప్పుడు, ఎక్క‌డ , ఎలా మెల‌గాలో చెవిరెడ్డికి తెలిసినంత‌గా మ‌రో నాయ‌కుడికి తెలియ‌దంటే అతిశ‌యోక్తి కాదు.

విజయసాయి పార్టీ వారిని దూరంగా ఉంచుతారు. చెవిరెడ్డి పార్టీ వారికి దగ్గరగా ఉంటారు. కూటమి ప్రభంజనంలో సైతం చెవిరెడ్డి ఒంగోలు లోక్ సభా నియోజకవర్గంలో కేవలం యాభై వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు పార్టీలో నెంబర్ టూ ఎవరంటే చెప్పడం కష్టమేనని వైసీపీలో వినిపిస్తున్న మాట. క్లారిటీ కోసం కొన్ని రోజులు ఆగాల్సిందే….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి