సరస్వతి పవర్ కంపెనీ చర్చ కమ్ రచ్చ ఇప్పట్లో ముగిసేలా లేదు. రోజుకో కథనం బయటకు వస్తూ… పాఠకులకు, వీక్షకులకు రక్తి కట్టిస్తూనే ఉంది. కొత్త కొత్త పాత్రధారుల పేర్లు, సూత్రధారుల రాజకీయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో మరో ఇద్దరి కీలక ఎంట్రీ బయట పడింది. ఇంత వివాదానికి వాళ్లు కూడా ఊడుతా భక్తిగా కాస్త ఆజ్యం పోశారని చెప్పుకోవాల్సి వస్తోంది. అందులో మొదటి వ్యక్తి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. మరో వ్యక్తి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. జగన్ ఇబ్బందుల్లో పడకుండా ఒకరు, 1500 ఎకరాల ఆస్తిని కాపాడేందుకు ఇంకొకరు తమ వంతు సాయాన్ని అందించారు..
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆస్తులు సంపాదించడం మినహా జగన్ కు వ్యాపార దక్షత లేదని తేలిపోయిన సందర్భంగానే అనేక సమస్యలు ఎదురయ్యాయి. అడ్డదారిలో ఆస్తులు కూడ బెట్టడం మినహా వాటి వల్ల వచ్చే సమస్యలు కూడా జగన్ అర్థం చేసుకోలేకపోయారు. అందుకే అనేకానేక కేసులు…సీబీఐ, ఈడీ వెంటబడటం జరుగుతోంది. ఈ క్రమంలో ఒక భారీ సమస్య నుంచి జగన్ ను బయట పడేసిన వ్యక్తి విజయసాయి రెడ్డేనని చెబుతున్నారు. ఇప్పుడు షర్మిలా రెడ్డి… జగన్ రెడ్డిపై దుమ్మెత్తి పోసినా.. కంటతడి పెట్టి, ముక్కు చీదినా… మొత్తం తెరవెనుక సూత్రధారి మాత్రం విజయసాయిరెడ్డేనని చెప్పక తప్పదు. సాయి రెడ్డిని తిట్టలేక ఆమె జగన్ పై విరుచుకుపడుతున్నారన్నది అందరూ అర్థం చేసుకోవాల్సిన అంశం.
విజయసాయి రెడ్డి ఒక దశలో వైఎస్ కుటుంబ తగాదాను తీర్చేందుకు ప్రయత్నించారు. రాజీ పడాలని కోరేందుకు షర్మిలను కలిశారు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో మనకెందుకులే అది వదిలేశారు. అది వేరే విషయం. ఇప్పుడు మరో అంశం వెలుగులోకి వచ్చింది. సరస్వతీ పవర్ షేర్లు షర్మిలకు చేరితే జరిగే నష్టాన్ని అర్థం చేసుకుని, జగన్ కు కలిగే ఇబ్బందులను తెలుసుకుని విజయసాయి రెడ్డి హెచ్చరించి… ఆ పని ఆపినందుకే గత నాలుగు రోజులుగా కుటుంబ గొడవ మీడియాకు ఎక్కుతోందన్నది కొత్త అంశంగా చెప్పుకోవాలి. నిజానికి 2019 ఆగస్టులోనే జగన్ షేర్ల బదలాయింపుకు తెరతీశారు. సరస్వతీ పవర్ తో తనకున్న 99 శాతం షేర్లలో 48 శాతాన్ని తల్లి విజయలక్ష్మికి బదలాయిస్తూ డీడ్ పై జగన్ ఆప్పుడే సంకతాలు చేశారు. ఈడీ కేసులు పరిష్కారమైన తర్వాత సదరు షేర్లను విజయమ్మ, షర్మిలకు బదలీ చేస్తానని ప్రామిస్ చేశారు. కొంత కాలంగా ఈ విషయం మరుగునపడిపోయిన తర్వాత ఈ ఏడాది జూలైలో విజయమ్మ ఒక ప్రయత్నం చేశారు. తన వాటాగా వచ్చిన షేర్లను షర్మిలకు బదలాయించేందుకు ప్రయత్నించారు. ఈ సంగతి పసిగట్టిన విజయసాయి రెడ్డి దాని వల్ల జరిగే అనర్ధాలను నేరుగా జగన్ కే వివరించారు. షేర్ల బదిలీ జరిగితే.. అటాచ్ మెంట్ ఉన్నప్పుడు చేసిన పనికి ఈడీ రంగంలోకి దిగే అవకాశం ఉందని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అక్రమాలకు తెరతీశారని ఆరోపిస్తూ ఈడీ పిటిషన్ వేసి జగన్ బెయిల్ రద్దు కోరే అవకాశం ఉందని కూడా తెలియడంతో… తదుపరి చర్యలు ప్రారంభమయ్యాయి. తన షేర్లను వెనక్కి ఇప్పించాలని జగన్ స్వయంగా ఎన్సీఎల్టీలో కేసు వేయడం కూడా విజయసాయి రెడ్డి ఇచ్చిన సలహా మాత్రమేనని తెలుస్తోంది.
ప్రస్తుతం వైసీపీ నేతలు మూకుమ్మడిగా షర్మిలపై దాడికి దిగడానికి కూడా అదే కారణమని చెప్పాలి. షర్మిల కావాలనే షేర్ల బదలీ వ్యవహారాన్ని రచ్చ చేస్తున్నారని వారంటున్నారు. జగన్ సేఫ్టీ కోసమే వాటిని వెనక్కి తీసుకుంటున్నారని.. అందులో ఎవరికీ అన్యాయం చేసే ఉద్దేశం లేదని చెబుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపిన షర్మిల .. స్వయంగా అన్నయ్యను జైలుకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారన్నది వైసీపీ వారి ప్రధాన ఆరోపణ. మరో పక్క సరస్వతి పవర్ కంపెనీకి పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో ఉన్న 1500 ఎకరాల స్థలం ఎప్పుడో అన్యాక్రాంతం అయ్యే పరిస్థితి వచ్చింది. 2014 తర్వాత చంద్రబాబు హయాంలో రైతులు ఆ స్థలాన్ని ఆక్రమించుకుని వ్యవసాయం చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మందీ మార్బలంతో అక్కడకు వెళ్లి వారి అడ్డగించి.. చివరకు నాటు బాంబులు కూడా వేసి బెదిరించి పంపించేశారు. పిన్నెల్లి ఆపకపోతే ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉండేది. సరస్వతి పవర్ స్థిరాస్థులు ఇప్పుడు జనం చేతుల్లో ఉండేవి. అప్పుడు జగన్, షర్మిల వాటి కోసం కొట్టుకునే వారో లేదో ఇప్పుడు చెప్పలేం….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…