బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగి..ఓటమి తర్వాత వీలైనంత… లో ప్రొఫెల్ మెయింటెయిన్ చేస్తున్న వారిలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఒకరని చెప్పక తప్పదు. బీఆర్ఎస్ ఓటమికి కారణమైన వారిలో ఆయనదీ కూడా కీలక పాత్రేనని చెప్పాలి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో పాటు, పార్టీలో ఎవరినీ ఎదగనివ్వకుండా అడ్డుకుని మరీ ఆయన కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ను ఛిన్నాభిన్నం చేశారు…
బీఆర్ఎస్ పాలనలో ఎర్రబెల్లికి, అప్పుడు టీడీపీ, కాంగ్రెస్ లో ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి అస్సలు పడేది కాదు. దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా బుక్కయిపోవడానికి ఎర్రబెల్లే కారణమని చెప్పుకునే వారు. రేవంత్ కూడా అనేక పర్యాయాలు తన మిత్రుల వద్ద అదే మాట అనేవారట. రేవంత్ రెడ్డి టీడీపీలో కొనసాగుతున్న సమయంలో తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్‌గా ఎర్రబెల్లి దయాకర్ రావు ఉండగా… అందులోని ఓ నేతగా రేవంత్ రెడ్డి ఉండేవారు.రేవంత్ జీవితంలో మాయని మచ్చగా మిగిలిపోయిన ఓటుకు నోటు కేసులో ఆయన రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడానికి… గులాబీ దళపతి కేసీఆర్ కు ఎర్రబెల్లి దయాకర్ రావు ఇచ్చిన సమాచారమే కారణమని… పార్టీలోని పరిణామాలను కేసీఆర్ కు తెలియజేసి తన జీవితాన్ని అంధకారంలోకి నెట్టాడని రేవంత్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. జైలుకు వెళ్లొచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి స్టార్ తిరిగింది. ఆయన కాంగ్రెస్ లో చేరి సీఎం అయ్యారు. దయాకర్ రావు డౌన్ అయిపోయారు. కొందరు ఎమ్మెల్యేలను మార్చితే బీఆర్ఎస్ మళ్లీ గెలుస్తుందని గొప్పగా సలహాలు ఇచ్చిన ఎర్రబెల్లి..2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ఇప్పుడు కొందరు నేతల్లా ఎర్రబెల్లి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నా.. రేవంత్ రెడ్డి తనను దగ్గరకు రానివ్వరని తెలిసి మౌనంగా ఉండి పోయారని చెబుతున్నారు..
రేవంత్ రెడ్డి తలచుకుంటే ఇప్పుడు దయాకర్ రావును అడ్డంగా ఇరికించే టైమ్ వచ్చిందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు భూదాన్ భూముల కేటాయింపుల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉండగా, అమోయ్ కుమార్ ను ఈడీ కూడా ఈడీ విచారిస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూములలో వందల కోట్ల విలువైన 42 ఎకరాలను బదిలీ చేసినట్లు, ఇందులో అక్రమాలు జరిగినట్లు పలు ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో పోలీసులు కేసు నమోదైంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో అమోయ్ కుమార్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎర్రబెల్లి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అండ చూసుకుని అమోయ్ కుమార్ రెచ్చిపోయారని చెబుతున్నారు. పైగా బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న కొందరు పాత్రికేయులు.. ఎర్రబెల్లికి, అమోయ్ కుమార్ కు మధ్యవర్తులుగా వ్యవహరించారని కూడా వార్తలు వస్తున్నాయి. దానితో సదరు జర్నలిస్టులపై కూడా నజర్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఎర్రబెల్లిని ఇరికించేందుకు రేవంత్ కు మంచి అవకాశాలున్నట్లుగా భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు బంతి రేవంత్ కోర్టులో ఉన్న నేపథ్యంలో ఆయన రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…