భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు బావమరిది రాజ్ పాకాలకు చెందిన జన్వాడ ఫామ్ హౌస్ లేదా విల్లాలో డ్రగ్స్ పార్టీ జరిగిందని ఆరోపణలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒక కుదుపు కుదుపుతున్నాయి. అనుమతి లేకుండా జరుగుతున్న పార్టీలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో విజయ్ మద్దూరి అనే వ్యక్తికి డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఆయన మీద కేసు నమోదు చేశారు.
అలాగే ఇంటి యజమాని రాజ్ పాకాల మీద, ఆ ఫామ్ హౌస్ సూపర్వైజర్ కార్తీక్ మీద కూడా కేసులను నమోదు చేసి అక్కడ దొరికిన కర్ణాటక లిక్కర్ తో పాటు విదేశీ మద్యం సీసాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ జన్వాడ పార్టీ వ్యవహారంలో కేటీఆర్ ఎంత లోతుగా ఇరుక్కోబోతున్నారు అనేది ఇప్పుడు కీలకమైన చర్చనీయాంశంగా ఉంది.
జన్వాడ ఫామ్ హౌస్ లో పార్టీ జరుగుతుండగా పెద్ద ఎత్తున వస్తున్న చప్పుళ్లపై ఫిర్యాదు అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల నివాసం ఉంటున్న ఓరియన్ విల్లాస్ వద్దకు కూడా పోలీసులు వరుస తనిఖీలు చేశారు.
రాజ్ పాకాల నివాసం ఉంటున్న విల్లా తాళం వేసి ఉండటంతో తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లారు. రాత్రంతా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆయన ఇంట్లో సోదాలు ముగియడంతో సమీప బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగించారు.
ఇక్కడ విజయ్ మద్దూరి ఎవరన్న ప్రశ్నలు తలెత్తుతుండగా… స్వయంగా ఆయనే వివరణ ఇచ్చుకున్నారు. తాను ఒక అమెరికన్ సిటిజెన్ అని చెప్పుకున్నారు. తన పేరుతో ఎఫ్ఐఆర్ లో పెట్టిన ప్రతీ అంశం తప్పేనని, ఇండియాలో తాను ఎలాంటి మాదక ద్రవ్యమూ తీసుకోలేదని చెప్పుకొచ్చారు. తాను చెప్పని మాటలను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారని వెల్లడించారు. పైగా కొందరు వ్యక్తులు పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు…కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఎక్కడున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. రాజ్ పాకాల స్వయంగా తనకు కొకైన్ ఇచ్చారని విజయ్ వాగ్మూలం ఇవ్వడం వల్లే కేసు పెద్దదైందని ఒక వాదన ప్రచారంలో ఉన్న నేపథ్యంలోనే పోలీసులు ఆయన కోసం వెదుకుతున్నారు. పైగా పార్టీకి హాజరైన 14 మంది మహిళలు డ్రగ్స్ టెస్టుకి నిరాకరించడం మరో వివాదానికి దారితీసింది.
ఓరియంట్ విల్లాస్ లోని విల్లా నెంబర్ ఐదు, నలభై, 43లో తనిఖీలు నిర్వహించిన తర్వాత అక్కడ 53 విదేశీ మద్యం సీసాలు స్వాధీనమయ్యాయి. జన్వాడ ఇంట్లో కూడా భారీగా విదేశీ మద్యం స్వాధీనం కావడంతో ఎక్సైజ్ చట్టంలోని వేర్వేరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
డ్రగ్స్ వ్యవహారం బయట పడినప్పటి నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రాత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ కాంగ్రెస్ ను తిట్టిపోశారు. ఒక్కరికి మాత్రమే డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని, మిగతా వాళ్లు మద్యం తాగితే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ కూడా ఎదురుదాడి చేస్తోంది. తాగి దొరికిన కేసులో బుకాయించి మాట్లాడితే తప్పు ఒప్పవుతుందా అని హస్తం పార్టీ ఎదురు ప్రశ్న వేస్తోంది. డ్రగ్స్, మద్యం వ్యవహారానికి ప్రభుత్వానికి సంబంధం లేదని, పోలీసులు చూసుకుంటారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు..
ఇక పార్టీ జరిగినప్పుడు కేటీఆర్ సతీమణి శైలిమ కూడా అక్కడే ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడినట్లేనని చెప్పుకోవాలి. అసలు అది రేవ్ పార్టీ అని ఒక వర్గం ఆరోపిస్తోంది. మరో పక్క కేటీఆర్ డ్రగ్స్ వాడతారని గతంలో కాంగ్రెస్, బీజేపీ ఆరోపించాయి. దానితో ఆయన గట్టిగానే సమాధానమిచ్చారు. ఏ టెస్టుకైనా రెడీ అంటూ సవాలు చేసిన సందర్భం ఉంది. అయితే మొత్తం వ్యవహారం కేటీఆర్ సొంత బావమరిదికి లింకు ఉండటంతో అన్ని విదేశీ మద్యం సీసాలు ఎక్కడ నుంచి వచ్చాయి…. ఎలా తెచ్చారన్న కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఆ దిశగానే దర్యాప్తు జరుగుతోంది. ఈ క్రమంలోనే కేటీఆర్ ఇరుక్కునే అవకాశం ఉందన్నది ఒక టాక్. మరో పక్క విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించడం కూడా ఇప్పుడు పోలీసు కేసు బలపడటానికి కారణమవుతోంది. ఇదీ కేటీఆర్ మెడకు చుట్టుకునే ప్రమాదమూ ఉంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…