ఇళయ దళపతి అంటే యువ నాయకుడు అని అర్థం. సినిమాల్లో తమిళ నటుడు విజయ్ ను అదే బిరుదుతో పిలుస్తారు. చాలా మంది సినీ నటుల్లాగే విజయ్ కూడా పార్టీ పెట్టారు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే టార్గెట్ గా విజయ్ అడుగులు వేస్తున్నారు. తమిళగ వెట్రి కళగం..టీవీకే… స్థాపించిన ఎనిమిది నెలలకు విల్లుపురంలో విజయ్ ఒక భారీ మహానాడు నిర్వహించారు. బహిరంగ సభకు ఐదు నుంచి ఆరు లక్షల మంది అభిమానులు హాజరైనట్లు తమిళ రాజకీయ విశ్లేషకులే చెబుతున్నారు. తొలి ప్రయత్నం సక్సెస్ అయ్యిందని కూడా కితాబిస్తున్నారు…
సంప్రదాయ ద్రవిడ తమిళ పార్టీల తరహాలోనే విజయ్ కొన్ని సిద్ధాంతాలను ప్రకటించారనుకోవాలి.అందరూ చెప్పినట్లుగానే పెరియార్, కామరాజార్ పేర్లను ప్రస్తావించారు. కొత్తగా ఇద్దరు మహిళా స్వాతంత్ర్య సమరయోధుల కటౌట్లను పెట్టడం ద్వారా మహిళల ఓట్లను దండుకునేందుకు ప్రయత్నించారు. ఇలా వచ్చి అలా వెళ్లడానికి తాను రాలేదని, తమిళ రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి వచ్చానని చెప్పుకున్నారు…
తొలి ప్రయత్నంలోనే విజయ్ .. సంప్రదాయ ద్రవిడ పార్టీలు, జాతీయ పార్టీలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. బీజేపీని మతవాద శక్తిగా కొట్టిపడేశారు. ద్రవిడ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించారని డీఎంకేపై దుమ్మెత్తిపోశారు. అదో వారసత్వ రాజకీయ పార్టీ అని ఆయన ఆరోపణలు సంధించారు. ఆ మాటలను డీఎంకే ఖండించిందనుకోండి. తాము అధికారంలోకి వచ్చి ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తామని చెప్పుకున్న విజయ్….అవసరమైతే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామన్నారు. పొత్తు పెట్టుకున్న పార్టీకి అధికారంలో భాగస్వామ్యమిస్తామని వెల్లడించారు.
నిజంగా తమిళ రాజకీయాల్లో మరో నాయకుడు అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్న తరుణంలోనే విజయ్ విజృంభించేందుకు ప్రయత్నిస్తున్నారు. జయలలిత,కరుణానిధి చనిపోయిన తర్వాత తమిళ రాజకీయ యవనికపై ఎంకే స్టాలిన్ సెటిలయ్యారు. సీఎంగా స్టాలిన్ పాలన బాగానే ఉందనిపించుకుంటున్నారు. తమిళవాదాన్ని కూడా గట్టిగా వినిపించే డీఎంకే…. కేంద్రంలోని బీజేపీ నేతృత్వ ఎన్డీయేతో ఫైట్ చేసేందుకు వెనుకాడటం లేదు. ఈ పరిస్థితుల్లో విజయ్ ఏ మేర సక్సెస్ అవుతారో కాలమే చెబుతుంది..
విజయ్ తనను తాను ఎలివేట్ చేసుకునేందుకే ప్రయత్నించారు. దక్షిణాది లెజెండ్స్ అయిన ఎంజీఆర్, ఎన్టీయార్ ప్రస్తావన చేస్తూ కొందరు వ్యక్తులు వాళ్లను కూడా నాటకాల వాళ్లని పిలిచారని.. అయితే ప్రజా నాయకులుగా స్థిరపడి తమ సత్తా చాటారని విజయ్ విశ్లేషించారు. ప్రస్తుత రాజకీయాల్లో మాత్రం మరో ఎంజీఆర్, మరో ఎన్టీయార్ రావడం కష్టమేనన్న సందేశం ఇస్తున్నాయి. ఎందుకంటే రాజకీయాల్లోకి వద్దామనుకుని ధైర్యం చాలక వెనక్కి వెళ్లిపోయిన రజనీకాంత్ తమిళనాడులోనే ఉన్నారు. విజయ్ కాంత్, కమల్ హాసన్ జనబాహుళ్యాన్ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు. ఒకరిద్దరు చిన్న నటులు కూడా రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించి చేతులు కాల్చుకున్న వాళ్లే. ఆ సంగతి గ్రహించే…. ఒంటరిగా అధికారానికి రావడం కష్టమని తెలుసుకునే విజయ్.. ఆదిలోనే పొత్తుల ప్రస్తావన చేస్తున్నారు. అన్నాడీఎంకేతో ఆయన పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని ఒక వాదన వినిపిస్తోంది. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత అన్నాడీఎంకే ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఆ పార్టీకి కూడా ఒక తోడు అవసరం. అలా కలిసినప్పుడే రాజకీయ బాంబు పేలడం ఖాయంటున్నారు. తమిళనాడులో విజయ్ బాంబులు పేలతాయా.. అసలే దీపావళి ముందు ప్రకటన చేశారు కదా… చూడాలి ఏం జరుగుతుందో…..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…