అవకాశవాదానికి కేరాఫ్ అడ్రెస్

By KTV Telugu On 30 October, 2024
image

KTV TELUGU :-

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. గెలిచే పార్టీలో ఉండే వాడే తెలివైన రాజకీయవేత్త అంటారు. ఓడిపోయిన పార్టీలో కొనసాగే వాడిని రాజకీయ అవివేకిగా పరిగణిస్తారు. మాజీ మంత్రి, విజయనగరం వీరుడు బొత్స సత్యనారాయణ ఇలాంటి అంశాలను బాగానే పుక్కిట పట్టారని చెప్పాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలిసినోడే సత్తి బాబు అని ఉత్తరాంధ్ర మొత్తం కోడై కూస్తోంది. కరెక్టు టైమ్ కి ఆయన వైసీపీలో చేరారు. 2019లో పార్టీ గెలిచిన వెంటనే ఆయన మంత్రి అయ్యారు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో సైతం బెర్తు దక్కించుకున్న తెలివైన రాజకీయ నాయకుడు బొత్స అని చెప్పక తప్పదు…

కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగి ఎన్ని ఆరోపణలు వచ్చినా తట్టుకుని మరీ రాజకీయాలు చేసిన బొత్స ఒకప్పుడు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. దాన్ని ఆసరాగా చూసుకునే ఆయన వైసీపీలోకి జంప్ చేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర ఇంఛార్జీలుగా విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఉన్నప్పటికీ వైజాగ్, విజయనగరంలో పారలల్ గా తన రాజకీయాలు ఆయన కొనసాగించారు. బొత్స తన కుటుంబ ప్రాధాన్యం తగ్గకుండా చూసుకున్నారు. ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా బొత్స కొత్త పావులు కదుపుతున్నారు…

బొత్స ఎంత తెలివిగా వ్యవహరిస్తారంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కొన్ని రోజులకే ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. అక్కడ వైసీపీ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుసుకున్న బొత్స చాలా తెలివిగా ముందడుగేశారు. ఎంతో మంది ఆశావహులున్నప్పటికీ జగన్ ను మేనేజ్ చేసి బొత్స పార్టీ టికెట్ కొట్టేశారు. వైజాగ్ లో వైసీపీకి బలం ఉందని తెలియడంతో టీడీపీ పోటీ నుంచి తప్పుకుని… బొత్స ఏకగ్రీవమయ్యారన్నది ఒక టాక్. నిజంగా జరిగింది మాత్రం వేరే విషయం. గెలిచిన తర్వాత టైమ్ చూసుకుని తాను టీడీపీలో చేరతానని బొత్స హామీ ఇచ్చి.. అధికార పార్టీ పోటీలోకి రాకుండా అడ్డుకున్నారని కాస్త ఆలస్యంగా తెలిసింది. ఇంతలో బొత్స ఎమ్మెల్సీ అయిపోవడం జరిగిపోయింది..

ఇప్పుడు బొత్స టీడీపీకి ఇచ్చిన మాట నిలబెట్టుకునే టైమ్ వచ్చిందని చెబుతున్నారు. ఈ లోపు వైసీపీలో మరో పరిణామం జరిగింది. విజయసాయి రెడ్డిని మళ్లీ ఉత్తరాంధ్ర కో ఆర్డినేటర్ పదవిలో కూర్చోబెట్టారు. గతంలో విజయసాయి ఆ పదవిలో ఉన్నప్పుడు కూడా బొత్సకు ఆయనకు పడలేదు. అప్పుడు విజయసాయి పవర్ చూసి బొత్స సైడైపోయారు. ఇప్పుడా పరిస్థితి లేదు. విజయసాయితో తాడో పేడో తేల్చుకోగలిగితే… వైసీపీ నుంచి వెళ్లిపోవచ్చని ఆయన భావిస్తున్నారు ఈ క్రమంలో ఇటీవల జగన్ ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు బొత్స ఎక్కడా కనిపించలేదు. బయటకు వెళ్లిపోతున్నందుకు అదో సంకేతంగా భావించాల్సి ఉంటుందని పార్టీ వర్గాలే అంటున్నాయి. ప్రస్తుతానికి బొత్స టైమ్ కోసం ఎదురుచూస్తున్నారు..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి