మాజీ సీఎం జగన్ రెడ్డికి సొంత జిల్లాలోనే సమస్యలు ఎదురవుతున్నాయి. నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. స్వాతంత్ర్యం ప్రకటించుకున్న సామంతరాజుల్లా వ్యవహరిస్తున్నారు. కడప జిల్లా పర్యటనకు వెళ్లి జగన్ .. అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులను చూసి విస్తుపోయారు. ఇలాగైతే కష్టమని, ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తన మార్క్ భాషతో కూడా ఆయన గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది..
ఇప్పటికే రాష్ట్రంలో పార్టీ 11 స్థానాలకు పడిపోతే.. మళ్లీ జీవం పోసుకునేందుకు తమ వంతు కర్తవ్యం నిర్వర్తించాల్సిన వారంతా నిర్వీర్యంగా పడుండి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని జగన్ ఆగ్రహం చెందినట్లు తెలుస్తోంది.నాయకుల మధ్య అనైక్యతను ఆయన సూటిగా ప్రశ్నించినట్లు చెబుతున్నారు. తన సొంత జిల్లాలో నేతలు బాగా పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తెస్తారనుకుంటే నానాటికి తీసిబొట్టు అన్నట్లుగా తయారయ్యారని జగన్ ఆవేదన చెందినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాధ్ రెడ్డిని పార్టీ నడిపిస్తున్న తీరు మీద జగన్ నిలదీసినట్లు సమాచారం. తెలుగుదేశం ఎమ్మెల్యేలు లెఫ్ట్, రైట్ ఇస్తుంటే మనవాళ్లు మౌనంగా ఎందుకున్నారు, ఎందుకు ప్రతిఘటించడం లేదని ఆయన ప్రశ్నించారు. కడప మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు కడప టీడీపీ ఎమ్మెల్యే పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు చెత్తను పోసిన సంఘటనను జగన్ సీరియస్ గా తీసుకున్నారు అని అంటున్నారు ఇంత పెద్ద విషయం జరిగితే ఎందుకు గట్టిగా వ్యవహరించలేకపోయారు అని జగన్ నేతలను ప్రశ్నించారు . పార్టీ కార్యక్రమాలు రోజురోజుకు బలహీనపడుతున్నాయని కూడా జగన్ నిలదీశారు. కడపను వైసీపీ నాశనం చేసిందని కూటమి నేతలు ఆరోపిస్తుంటే.. దాన్ని తమ వారు తిప్పికొట్టలేకపోయారని జగన్ ఆరోపించారు. కడప నియోజకవర్గం ఇంచార్జిగా మాజీ మంత్రి అంజాద్ భాషా మాటే ఫైనల్ అని జగన్ స్పష్టం చేశారు.
జమ్మలమడుగులో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డిల మధ్య పోరుని జగన్ సర్దుబాటు చేశారు అని చెబుతున్నారు. ఇద్దరు నేతలను పిలిచి ఆయన మంతనాలు జరిపారని అంటున్నారు. జమ్మలమడుగు వైసీపీ ఇంచార్జి పదవి కోసం ఇద్దరు నేతలూ పోటీ పడుతున్నారు. ఇద్దరూ రెండు పార్టీ ఆఫీసులను ఏర్పాటు చేసుకుని పని చేస్తున్నారు అయితే జగన్ వారికి సర్దిచెప్పారు. జమ్మలమడుగులోని ఆరు మండలాలను చెరి మూడు పంచి ఆ మండలాల పరిధిలో మాత్రమే పర్యటనలు చేయాలని ఆ విధంగా పనిచేస్తూపోవాలని సూచించారు . రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం మండలాలు, సుధీర్ రెడ్డికి ఎర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురం మండలాలు పంచినట్లుగా చెబుతున్నారు. ఇదే ఫైనల్ అని జగన్ గట్టిగా స్పష్టం చేయడంతో నేతలు దారికి వచ్చారు అని అంటున్నారు.
ఇక మీదట తన జిల్లాలో క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని జగన్ ప్రకటించారు. అవసరాన్ని నేతలను పిలిపించుకుంటానని పిలిచిన వెంటనే రావాలని కూడా ఆయన ఆదేశించారు. దానికి వారు తలూపినా తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…