విశాఖ ఉక్కు కార్మికులు ఎంతగా పోరాడినా ఫలితం ఉండదా. ఆ కంపెనీ స్లో డెత్ వైపు పయనిస్తోందా. ప్రభుత్వం కూడా కల్లబొల్లి కబుర్లు చెబుతూ విశాఖ ఉక్కును చంపేసే ప్రయత్నంలో ఉందా. ఇలాంటి ప్రశ్నలకు అవుననే సమాధానం వచ్చే మరో పిడుగు లాంటి వార్త ఇప్పుడు వినిపిస్తోంది. విశాఖ పక్కన ఉండే అనకాపల్లిలో ఉక్కు కర్మాగారం పెట్టేందుకు అర్సెలార్ మిట్టల్, జపాన్ కు చెందిన నిప్పన్ స్టీల్స్ జాయింట్ వెంచర్ గా స్టీల్ ప్లాంటు పెట్టేందుకు రెడీ అవుతోంది. అనకాపల్లిని అనుకుని ఉండే నక్కపల్లి రాజయ్యపేట దగ్గర ఇంటెగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. పైగా 2029 జనవరికి ఈ పరిశ్రమ మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేసి… ఉత్పత్రి ప్రారంభిస్తామని కూడా మిట్టల్ సంస్థ తన ప్రతిపాదనలో ప్రస్తావించింది. ఈ వార్త దావానలంలా వ్యాపించిన వెంటనే మా సంగతేంటని విశాఖ ఉక్కు కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్లిపోవాల్సిందేనా అని ప్రశ్నిస్తున్నారు.
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రస్తుతం బలిపీఠం మీద ఉంది అని కార్మిక సంఘాలు ప్రగాఢంగా నమ్ముతున్నాయి. విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం ఉదాశీన వైఖరిని చూసి వారు మండిపడుతున్నారు. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయబోమని ఒక్క ప్రకటన ఇస్తే చాలు అదే పదివేలు అని అంటున్న కార్మిక సంఘాలకు నాలుగేళుగా ఆ మాట వినే భాగ్యం అయితే దక్కడం లేదువిశాఖ ఉక్కుని లాభాల బాటను పట్టించాలంటే మొత్తం ఉన్న బ్లాక్ ఫర్నెస్ విభాగాలు అన్నీ పూర్తి సామర్ధ్యంతో పనిచేయాలి. ఉద్యోగులు కార్మికులు పూర్తిగా ఉండాలి. పదవీ విరమణ చేసిన వారి స్థానంలో కొత్తవారి నియామకం జరగాలి. విశాఖ ఉక్కుకు సొంత నిధులు కావాలి. ఆర్ధికంగా కేంద్రం చేయూతను ఇవ్వాలి. ఇప్పుడు జరుగుతున్న తంతు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. అనకాపల్లిలో ప్రైవేటు ప్లాంట్ ప్రస్తావనతో విశాఖ ఉక్కు అటకెక్కే ప్రమాదం కనిపిస్తోంది..
అనకాపల్లి ప్లాంట్ నిర్మాణం కోసం రెండు వేల ఎకరాల స్థలం కావాలని మిట్టల్ సంస్థ ప్రభుత్వాన్ని కోరుతోంది. అలాగే తీరంలో మూడు వేల గజాల స్థలం కేటాయిస్తే ముడి సరుకు రవాణాకు కూడా వీలుంటుందని చెబుతోంది. ప్రభుత్వం తమ ప్లాంటును అనుమతిస్తే 20 వేల మందికి ఉద్యోగాలిస్తామని, దాదాపు లక్ష మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి లభిస్తుందని లెక్కలు చెబుతోంది. పైగా విశాఖ ఉక్కుకు, మిట్టల్ స్టీల్ కు ఒక తేడా కూడా ఉంది. తమకు క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయని మిట్టల్ గ్రూపు ప్రకటించింది. ముడి సరుకుకు ఇబ్బంది లేదని తేల్చేసింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం అంటే విశాఖ ఉక్కుకు ఆ పరిస్థితి లేదు. క్యాప్టివ్ మైన్స్ లేకనే ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోంది. క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. పరిశ్రమను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలు లేవు. కంపెనీ ఆర్థిక పరిపుష్టి కోసం చేయాల్సిన ఒక్క పని జరగడం లేదు. ఇప్పటికే ఆరు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించారు. సకాలంలో జీతాలు అందడం లేదు. ఆ పరిస్థితులు చూస్తుంటే… ప్రైవేటుకు ప్రోత్సాహం, ప్రభుత్వ రంగానికి నిరుత్సాహం అన్నట్లుగానే పరిస్థితులు కొనసాగుతున్నాయి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…