ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. రౌడీయిజాన్ని,మహిళిలపై అత్యాచారాలు, అఘాయిత్యాలను ఆపలేకపోతున్నారని ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించడం ఇప్పుడు కూటమి పార్టీల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది . తాను హోంమంత్రి పదవిని తీసుకుంటే పరిస్థితి వేరుగా ఉండేదని, ఆ శాఖ మంత్రి అనిత బాధ్యత వహించాలని పవన్ సూచించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పవన్ హోం శాఖను ఆశిస్తున్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అంతలోనే జనసేన, వైసీపీ సోషల్ మీడియా విభాగాలు యాక్టివ్ అయిపోయాయి. పవన్ తక్షణమే హోం శాఖను తీసేసుకోవాలని జనసైనికులు కోరుతుంటే.. కూటమిలో భారీ లుకలుకలు మొదలయ్యాయని వైసీపీ బ్యాచ్ ఆరోపణలు సంధిస్తోంది. దీనిపై అనిత మాత్రం చాలా కూల్ గా రియాక్టయ్యారు. పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేమీ లేదని అనిత చెప్పుకొచ్చారు. ఏపీలో శాంతిభద్రతల పరిరక్షణపై సీఎం చంద్రబాబు, పోలీసు ఉన్నతాధికారులతో తాను ఎప్పటికప్పుడు చర్చిస్తున్నానని అనిత అన్నారు.ఆ చర్చల్లో పవన్ కల్యాణ్ కూడా భాగమేనని చెప్పారు. పవన్ కు అన్ని విషయాలు తెలుసు కాబట్టే మాట్లాడారని అన్నారు. ఆయన ఏ కేసు విషయంలో ఆగ్రహంగా ఉన్నారో తనకు తెలుసని, త్వరలోనే పవన్ తో భేటీ అయ్యి అన్ని విషయాలు మాట్లాడతానని అనిత అన్నారు.
పవన్ వ్యాఖ్యలపై అనేక కోణాల్లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. పవన్ ఎందుకు కామెంట్స్ చేశారు? ఆయన అసంతృప్తితో ఉన్నారా? లేకుంటే వేరే ఆలోచనతో ఉన్నారా? ఈ దిశగా పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరోవైపు ఆయన వ్యూహాత్మకంగానే మాట్లాడారని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఆలోచనతోనే ఆయన మాట్లాడి ఉంటారని ఒక అంచనా ఉంది. ఎందుకంటే మంత్రివర్గంలో ఉన్నవారు చురుగ్గా వ్యవహరించడం లేదన్న విమర్శ ఉంది. పైగా ఇటీవల ఏపీలో నేరాలు పెరిగాయి అన్నది వాస్తవం. నేర నియంత్రణలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని విపక్షం ఆరోపిస్తోంది. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్తే ఇబ్బందికర పరిణామాలు తప్పవు. అందుకే పవన్ వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పోలీసు యంత్రాంగం ఉదాసీనత ఇటువంటి ఘటనలకు కారణమని పవన్ అభిప్రాయపడ్డారు. ఫలానా నిందితుడు మా కులం వాడు, మా బంధువు అంటూ కొంతమంది అధికారులు, నేతలు అనుకోవడం వల్లే ఇటువంటి ఘటనలు పెరుగుతున్నాయి అన్నది పవన్ అభిప్రాయం. అందుకే రివ్యూలు జరపాలని హోంమంత్రి వంగలపూడి అనితకు సూచించారు. అది కచ్చితంగా చంద్రబాబు సూచనతోనే ఉంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వాస్తవానికి హోం శాఖ మంత్రి అనితకు గతంలోనే చంద్రబాబు ఒకసారి హెచ్చరిక పంపారు. ఇప్పుడు అదే హెచ్చరిక పవన్ నుంచి వచ్చేసరికి కూటమిలో విభేదాలు అంటూ వైసీపీ సంబరపడుతోంది.
మీడియా వర్గాల్లో మరో చర్చ కూడా జరుగుతోంది. పవన్ అవసరానికి మించి స్పందిస్తున్నారని, పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని కొందరు వాదిస్తున్నారు. ఏమైనా అనుమానాలుంటే అంతర్గత సమావేశాల్లో చర్చించుకోవాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. అంతగా అసంతృప్తి ఉంటే చంద్రబాబుకు, అనితకు ఫోన్ చేసి కూడా తన నిరసనను తెలియజేసే వీలుంది. వాటన్నింటినీ పక్కన పెట్టి పవన్ కల్యాణ్ బహిరంగ విమర్శలు చేస్తున్నారని అది సహేతుకం కాదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా నేరుగా మహిళా హోం మంత్రి అనితను విమర్శించడం కూడా తగదని అంటున్నారు. పవన్ తన బలాన్ని ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారని, వాపును బలుపుగా భావిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అనిత పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నారని, క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలు గొడవలకు దిగినా పోలీసులు సంయమనం పాటిస్తున్నారంటే అదీ అనిత ఆదేశాల వల్లేనని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ఆ సంగతి అర్థం చేసుకుంటే చాలన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…