పదకొండు నెలలకే బ్యాటరీ డౌన్ అయ్యిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రేవంత్ రెడ్డి, ఆయన పర్సనల్ టీమ్ పెద్దగా ఎదురుదాడులు చేయడం లేదన్న ఫీలింగ్ వస్తోంది. అసలు రేవంత్ తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారా… లేదా ఒక ప్రభుత్వోద్యోగిలా రోజువారీ పనులు చేసుకుంటూ పోతున్నారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు…త్వరలో రేవంత్ రెడ్డిని మార్చేసి కొత్త వారిని తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోందని బీజేపీ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ ప్రకటన చేస్తే రేవంత్ వర్గం దానికి గట్టిగా రిటార్డివ్వలేకపోయింది. పైగా ఆ అంశంపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు కూడా రిప్లై పోస్టులు పెట్టలేకపోతోంది. పైగా ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలో సీఎం కాబోతున్నారని మహేశ్వర్ రెడ్డి ప్రకటించడం కూడా కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లోకి బీజేపీ తలదూర్చినట్లవుతుందని చెప్పుకోవాలి. అసలు ఉత్తమ్ రెడ్డికి, మహేశ్వర్ రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయన అలా మాట్లాడుతున్నారని వాదనలు తెరపైకి వచ్చిన తర్వాత కూడా టీమ్ రేవంత్ మన్నుతిన్న పాములా పడుండటం వారి ఉదాసీనతకు నిదర్శనంగా నిలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలను అణచివేయడంలో కూడా రేవంత్ విఫలమయ్యారు. ఇప్పటికీ ఉత్తమ్ రెడ్డి, కోమటిరెడ్డి వేర్వేరు కుంపట్లు పెట్టుకుని పవర్ సెంటర్లుగా తయారయ్యారు. వారికి భయపడి రేవంత్ తన మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తూ వచ్చారని సోషల్ మీడియా కోడై కూస్తున్నా.. రేవంత్ వర్గం వైపు నుంచి ఎలాంటి సమాధానమూ రావడం లేదు…పైగా పార్టీలోనే రేవంత్ ప్రత్యర్థులు బలపడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదని, రేవంత్ మాత్రమే టీకాంగ్రెస్ పార్టీలో ఏకైక నాయకుడని ప్రచారం చేసుకోలేకపోతున్నారు….
ఆ అంశాలే కాకుండా వరుస ఘటనలు కూడా రేవంత్ రెడ్డి వైపల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనను క్యాష్ చేసుకోవడంతో రేవంత్ గ్రూపు సక్సస్ కాలేకపోయింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి విమర్శలు వెల్లువలా వచ్చి పడటంతో రాహుల్ పర్యటన షెడ్యూల్ ను తరచూ మార్చేశారు. దానితో ప్రధాన ప్రతిపక్షానికి మరింత ఊపిరినిచ్చినట్లు కూడా అయ్యింది. పైగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ మెయింటేయిన్ చేసినంత పీఆర్ ను రేవంత్ రెడ్డి నిర్వహించుకోలేకపోవడం వల్లే రాహుల్ పర్యటనను క్యాష్ చేసుకోలేకపోయారని చెబుతున్నారు… మంగళవారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పర్యటించారు. కుల గణనపై స్పష్టత ఇచ్చారు. ఇదే విధానాన్ని తాము అధికారంలోకి వస్తే దేశం మొత్తం అమలు చేస్తామని వివరించారు. అయితే దీనిని గొప్పగా ప్రచారం చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని కంటే ముందు రాహుల్ గాంధీ నిరుద్యోగులతో భేటీ అవుతారని ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని ఓ పోలీస్ అధికారి లీక్ చేశారు. వెంటనే కేటీఆర్ తన బృందంతో కలిసి అక్కడికి వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాలుక కరుచుకున్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ టూర్ లో అనేక మార్పులు చేశారు. స్థూలంగా చెప్పాలంటే ఇవాల్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలనపై పట్టు చిక్కలేదు. పోలీసులపై, సీనియర్ అధికారులపై అజామాయిషీ లేదు. బీఆర్ఎస్ అనుకూల పోలీసు వర్గాలే ఇప్పటికీ పెత్తనం చేలాయిస్తున్నాయి.
కాంగ్రెస్ అంటేనే గ్రూపుల పార్టీ. ఒకరు పైకి వెళ్తుంటే.. నలుగురు కిందకు లాగుతుంటారు. లేటుగా వచ్చి లేటెస్టుగా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డిపై పాత కాపులు సహజంగానే గుర్రుగా ఉంటారు. వారంతా రేవంత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వంలోని లోపాలను వాళ్లే విపక్షానికి ఉప్పందిస్తుంటారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా రేవంత్ రెడ్డి తన వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ఆయన అనుచరులే చెబుతున్నారు.తిప్పికొట్టడంలో విఫలమవుతున్నామని, అంతా దైవాధీనం సర్వీసులా తయారైందని వాపోతున్నారు. మరి ఇప్పుడేం చేయాలి.. ఆ సంగతి రేవంత్ రెడ్డే ఆలోచించుకోవాలి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…