తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలను కప్పి పుచ్చుకునేందుకు బీఆర్ఎస్ అగ్రనాయకత్వం నానా తంటాలు పడుతోంది. అప్పుడే బాగా చేశామని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని చెడగొడుతున్నారని చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. దీని వల్ల జనబాహుళ్యంలో విమర్శలు వస్తాయని తెలిసి కూడా మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేసేందుకు వెనుకాడకుండా ముందుకెళ్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అండగా ఉంటామని కేటీఆర్ తాజాగా ప్రకటించడం చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ లేకపోవడం వల్లే అన్ని వర్గాలకు ముఖ్యంగా రియల్టర్లకు కష్టకాలం మొదలైందని కేటీఆర్ ఒక సభలో వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. హైడ్రా కారణంగా రియల్ ఎస్టేట్ దెబ్బతిన్న మాట నిజమే అయినా.. బీఆర్ఎస్ కాలంలోనూ తమపై వత్తిడి ఉండేది కదా అని వాళ్లు ప్రశ్నించుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళన చేసినప్పుడు పట్టించుకోకుండా వదిలేసిన కేటీఆర్.. ఇప్పుడు మాత్రం వారిని కాపాడేందుకు వచ్చినట్లుగా కలరింగ్ ఇస్తున్నారని అంటూ నవ్వుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇబ్బడి ముబ్బడిగా భారీ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినప్పటికీ రియల్ ఎస్టేట్ పై అనేక ఆంక్షలతో వత్తిడులు ఉండేవని, వాటిని తొలగించేందుకు మాత్రం ప్రభుత్వం ఒప్పుకోలేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిపై దూకుడుగా వ్యవహరించేందుకు మాత్రమే రియల్టర్ల మీటింగులకు వస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి…
భారీ ప్రాజెక్టులు చేసే మేఘా ఇంజినీరింగ్ సంస్థ విషయంలోనూ కేటీఆర్ తప్పులో కాలేసినట్లు మాట్లాడుతున్నారు. ఆ సంస్థను ఎందుకు బ్లాక్ లిస్టు చేయలేదని ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిందీ వాళ్ల వల్లే అని గుర్తుచేస్తున్నారు. పైగా 4 వేల 350 కోట్ల కొడంగల్ లిఫ్టు పనులతో పాటు లక్షన్నర కోట్ల మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును కూడా మేఘాకే ఇస్తారని కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి బీఆర్ఎస్ హయాంలో మేఘా భారీ ప్రాజెక్టులను చేజిక్కించుకుంది. కేసీఆర్ కుటుంబానికి మేఘా కృష్ణారెడ్డి అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. మేఘా నిర్వహించే భారీ ఫంక్షన్లకు కేసీఆర్ కుటుంబంలో ఎవరోకరు హాజరయ్యే వారు. వాటన్నింటినీ మరిచిపోయి… కేటీఆర్ ఇప్పుడు మేఘా అవినీతిని అక్రమాలను ప్రశ్నిస్తున్నారు. ఈ లోపే మేఘాకిచ్చిన జలమండలి పాత కాంట్రాక్టును రేవంత్ రెడ్డి రద్దు చేయడంతో కేటీఆర్ దూకుడుకు బ్రేకులు పడే అవకాశం ఉందని భావించాల్సి ఉంటుంది…అటు కేటీఆర్ గానీ, ఇటు రేవంత్ గానీ అధికారంలో ఉన్నప్పుడు మేఘా కృష్ణారెడ్డికి ఫ్రెండ్ గా ఉండాల్సిందే. ఎందుకంటే మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఢిల్లీ నుంచి గల్లీ దాకా నేతల చేతులు తడుపుతూ ఉంటుంది. ఇక్కడ కాకపోతే మరో రూటులో పనులు చేయించుకునే సత్తా ఆ సంస్థకు ఉంది. అందుకే కేటీఆర్ దూకుడు తర్వాత వెనుక పీడుకు అవుతుందని భావించాల్సిందే…
కేటీఆర్ ఈ మధ్య కొన్ని పిలవని పేరంటాలకు కూడా వెళ్తున్నారు…ఆటో డ్రైవర్ల మహా ధర్నా జరుగుతుంటే కేటీఆర్ ఒక ఆటో ఎక్కి అక్కడకు వెళ్లిపోయారు. నిన్న నేను పిలవలేదు కదా.. ఎందుకొచ్చావని అడిగితే ఆటో డ్రైవర్ల సంఘం మీదే ఎదురుదాడి చేశారు. మహాలక్ష్మీ స్కీమ్ వల్ల దెబ్బతిన్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలన్న డిమాండ్ మంచిదే అయినా.. రాజకీయ నాయకుడిగా వారి డిమాండ్లను మద్దతివ్వడంలో తప్పులేకపోయినా… పిలవకుండా వెళ్లకూడదు కదా…పైగా కేటీఆర్ హాజరైన ప్రతి సమావేశాల్లోనూ దురుసుగా మాట్లాడుతున్నారన్న టాక్ ఉంది. ఎదుట వారిని కించపరిచేలా మాట్లాడుతున్నారన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. ఎవరు ఆందోళనలు చేస్తున్నా వారి దగ్గరకు అవే మాటలు మాట్లాడుతున్నారని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. పైగా తమకు ఓటు వేయకుండా తప్పు చేశారని జనాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్న వారికి ఇలాంటి ప్రవర్తన అసలు తగదు.. మరి కేటీఆర్ ఆ సంగతి ఎలా తెలుసుకుంటారో…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…