సింధూ వ్యతిరేక నిరసనల వెనుక టీడీపీ ఉందా…

By KTV Telugu On 8 November, 2024
image

KTV TELUGU :-

పీవీ సింధూ..ప్రపంచ ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుసగా రెండు సార్లు ఆమె ఒలింపిక్స్ లో పతకాలు సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో సింధూ అభిమాని కాని వారుండరు. సింధూ ఆధ్వర్యంలో ఒక బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభిస్తే మేటి క్రీడాకారులను తయారు చేసి మరిన్ని ఒలింపిక్స్ పతకాలను సాధించే వీలుంటుందని జనం అభిప్రాయం. ఆ సంగతి ప్రభుత్వం కూడా గ్రహించిన కారణంగానే ఒక బ్యాడ్మింటన్ అకాడమీ స్టార్ట్ చేయాలంటూ విశాఖ దగ్గరి పెదగదిలి జంక్షన్ లో రెండెకరాల స్థలాన్ని కేటాయించారు. తర్వాత సింధూ అభ్యర్థన మేరకు మరో ఎకరం స్థలం కూడా ఇచ్చారు. మూడు సంవత్సరాల తర్వాత సింధూ తన తల్లిదండ్రులతో కలిసి వచ్చి గురువారం ఆ స్థలంలో భూమీ పూజ చేశారు. రెండు సంవత్సరాల్లో వ్యవధిలో అకాడమీని సిద్ధం చేసి కోచింగ్ ప్రారంభిస్తామని ఆమె చెప్పారు…

సింధూ బ్యాడ్మింటన్ అకాడమీపై కొన్ని రోజులుగా వివాదం రగులుతోంది. ఆమెకు ఆ స్థలం కేటాయించకూడదని కొందరు స్థానికులు ఉద్యమించారు. మొత్తం మూడెకరాల్లో అకాడమీ నిర్మాణానికి ఇటీవల భూమి చదును చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఆ స్థలంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో సింధు.. సీఎం చంద్రబాబునాయుడును కలిసి సమస్యను వివరించారు. ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని, అక్కడే పనులు ప్రారంభించుకోవాలని సీఎం ఆమెకు సూచించారు. జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌ను ఆ మేరకు తగిన సహకారం అందేలా చూడాలని ఆదేశించారు. కాగా తాము ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే పనులు చేపడుతున్నామని సింధు తండ్రి రమణ చెప్పారు. భూమీ పూజ జరిగిన రోజున నిరసనలు తెలియజేసేందుకు జనం రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. స్థానికంగా జనాభా బాగా పెరిగిపోయిందని అక్కడ కాలేజీ కట్టాలని మరో సారి డిమాండ్లు వినిపించారు. కాస్త దూరంగా వందల ఎకరాల అటవీ స్థలం ఉందని అక్కడ సింధూకు ఎన్ని ఎకరాలైనా ఇచ్చుకోవచ్చని జనం సూచిస్తున్నారు..

సింధూ వ్యతిరేక నిరసనలకు టీడీపీలోని ఒక వర్గమే కారణమని ప్రచారమవుతోంది. అందుకు రెండు కారణాలు చెబుతున్నారు. సింధూ తన అకాడమీ ప్రారంభానికి సంబంధించి స్థానిక టీడీపీ నేతలను సంప్రదించలేదని, దానితో వాళ్లు అలిగి ఆమెకు చిన్న ఝలక్ ఇచ్చేందుకు ప్రయత్నించారన్నది ఒక వాదన. అయితే జగన్ హయాంలో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు రాష్ట్రం మొత్తం నిరసనలు జరిగాయి.అన్ని వర్గాల వారు ఆరెస్టును ఖండించారు. సింధూ మాత్రం ఆ విషయంలో నోరు విప్పలేదని అసలు తనకు ఏమీ తెలియనట్లు వ్యవహరించారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కనీస మర్యాద పాటించని సింధూకు ఎందుకు మూడెకరాల స్థలం ఇవ్వాలని టీడీపీ జనం ప్రశ్నిస్తున్నారు. ఆ సంగతి అర్థం చేసుకున్న సింధూ కుటుంబం పరిగెత్తుకుంటూ వెళ్లి చంద్రబాబును శరణు వేడినందునే ఆయన ఆదేశాల మేరకు ఇప్పుడు గొడవ చేయకుండా వదిలేశామని టీడీపీలోని కొందరు చెప్పుకుంటున్నారు….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి