అగ్రరాజ్యం అమెరికాను అవకాశాల గనిగా చెబుతారు. యువత డిగ్రీ చదువు పూర్తి కాగానే ఎంత ఖర్చయినా ఫర్వాలేదు.. అమెరికా వెళ్లిపోవాలనకుంటున్నారు. రెండు మూడు సంవత్సరాలు కష్టపడినా.. తర్వాత చీకుచింతా లేని జల్సా జీవితం గడపే అవకాశం వస్తుందనుకుంటారు. పెళ్లి చేసుకుని, ఇల్లు కట్టుకుని జీవితాంతం హాయిగా ఉంటామనుకుంటారు. భార్యకు ఉద్యోగం వస్తే ఆదాయం పెరిగి హాయిగా ఉండొచ్చనుకుంటారు.. ఇంతకాలం జరిగింది కూడా అదే. పొట్ట చెతపట్టుకుని అమెరికా వెళ్లిన వాళ్లు వందలవేల కోట్లు కూటబెట్టిన సందర్భాలున్నాయి. గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్… అమెరికాలో ఉద్యోగానికి వెళ్లి… తర్వాత వ్యాపారం చేసి 15 వందల కోట్లు సంపాదించారు.మరి ఇవ్వాల్టికి ఇవాళ అదే పరిస్థితి కొనసాగుతుందా అంటే లేదేమో అన్న భయం వేస్తోంది. మునుపటిలా అమెరికా దేశానికి గుంపులు గుంపులుగా పరిగెత్తుకుంటూ వెళ్లే రోజులు పోయాయంటున్నారు…
అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ తీరు చూస్తే భారతీయుల డాలర్ డ్రీమ్స్ కు ఫుల్ స్టాప్ పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమెరికా ఫస్ట్ అంటే స్వదేశీయులకే తొలి ప్రాధాన్యం నినాదంతో విధానాలు రూపొందించాలనుకుంటున్న ట్రంప్ ప్రభుత్వం… విదేశీయులు యద్ధేచ్ఛగా దేశంలోకి వచ్చే పద్ధతిని ఆపెయ్యాలనుకుంటోంది. గత సారి ట్రంప్ అధ్యక్షుడైనప్పుడు కూడా విదేశీయుల ఉద్యోగాలపై ఆంక్షలు విధించే చట్టాలను ప్రతిపాదించారు. అయితే బైడెన్ అధికారానికి రాగానే ఆ చట్టాలను ముందుకు సాగనివ్వలేదు. ఇప్పుడు ట్రంప్ మళ్లీ పాత ఫైళ్లకు దుమ్ము దులిపి.. తన అసలు నైజాన్ని బయట పెట్టే ప్రయత్నంలో ఉన్నారు…
అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇంకా గద్దెనెక్కక ముందే.. శ్వేతసౌధంలోకి అడుగు పెట్టకముందే.. వలస విధానంలో సంచలనం చోటు చేసుకుంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఏడాది జూన్లో ‘కుటుంబాలను కలిపి ఉంచడం’ అంటే కీపింగ్ ఫ్యామిలీస్ టుగెదర్ అనే నూతన వలస విధానాన్ని తీసుకువచ్చారు. దీని ద్వారా అమెరికాలో నివసిస్తున్న విదేశీ పౌరులు తమ కుటుంబ సభ్యులకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోయినా.. చట్టబద్ధత పొందే వీలు కల్పించారు. అయితే.. ఈ విధానాన్ని తాజాగా గతంలో డొనాల్డ్ ట్రంప్ నామినేటెడ్ చేసిన టెక్సాస్ లోని జిల్లా జడ్జి జస్టిస్ జె. కాంప్బెల్ బార్కర్ నిలుపుదల చేశారు.‘‘ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఫెడరల్ ఏజెన్సీలకు చట్టబద్ధత లేదు’’ అని తీర్పు వెలువరించారు. దీంతో నూతన విధానానికి అర్హులైన సుమారు 5 లక్షల మందిపై పిడుగు పడినట్టయింది. అక్రమ వలస దారులను దేశం నుంచి పంపేస్తానని ఎన్నికల సమయంలో ట్రంప్ పదే పదే చెప్పిన విషయం తెలిసిందే. టెక్సాస్ కోర్టు తాజా తీర్పుపై ‘అమెరికన్ ఫ్యామిలీస్ యునైటెడ్’ సంఘం అధ్యక్షుడు ఆష్లే డీ అజెవెడో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తీర్పు లక్షల మంది ఆశలను ఛిద్రం చేసిందన్నారు.
అమెరికాలో ఇప్పుడు హెచ్ ఫోర్ అనే వీసా నిబంధన ఒకటి ఉంది. హెచ్ వన్ బీ వీసాపై అక్కడకు వెళ్లి ఉద్యోగాలు చేసుకునే వారు.. పెళ్లి చేసుకుని భార్యను తీసుకెళ్లిన పక్షంలో ఆ మహిళలు కూడా అక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు. వారిని హెచ్ ఫోర్ డిపెండెంట్స్ అంటారు. వాళ్లు ఎంప్లాయ్ మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ కు దరఖాస్తు చేసుకుని,దాన్ని పొందిన వెంటనే ఉద్యోగం చేసుకునే వీలు కలుగుతుంది. పైగా వారికి సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఇస్తారు. దానితో బ్యాంక్ ఖాతా తెరుచుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం ఉంది. ఇండియాలో పొందిన వివాహ ధృవీకరణ పత్రం ఉంటే అమెరికాలో ఉద్యోగం చేసుకునే అవకాశం కలుగుతుంది.. ఇప్పుడు అలాంటి నియమాలన్నింటినీ రద్దు చేస్తామని ట్రంప్ ప్రకటించడం ప్రవాస భారతీయులకు పెద్ద సమస్యగా మారింది. భర్తతో పాటు అమెరికా వెళ్లిన మహిళలకు ఉద్యోగాలు చేసే అవకాశం లేకుండా చేస్తారట. అదే జరిగితే.. కుటుంబ ఆర్థిక అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అమెరికాలో ఉండలేని పరిస్తితిని ఎదుర్కోవాల్సి రావచ్చు. ట్రంప్ ఉద్దేశం కూడా అదేనట. ఏదో విధంగా వాళ్లకు వాళ్లు అమెరికా వదిలి వెళ్లిపోయే పరిస్థితి తీసుకురావాలన్నది ఆయన వ్యూహం…
అమెరికా వస్తువులనే కొనండి, అమెరికా వారికే అవకాశాలివ్వండి.. అంటే బై అమెరికా, హైర్ అమెరికా అని ట్రంప్ గత పాలనలో భారీ నినాదాన్ని ప్రచారం చేశారు. ఉద్యోగాల్లో అమెరికా వారికే అవకాశాలివ్వాలన్నారు. అప్పట్లో తన విధానాలను అమలు చేయడానికి కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఈ సారి మాత్రం ఖచితంగా అమలు చేస్తామని భీష్మించుకు కూర్చున్నారు. ఇక చిన్నవయసులోనే అమెరికా వెళ్లి ఇంకా అక్కడి పౌరసత్వం లభించని యువత కూడా ఇప్పుడు ట్రంప్ పాలనాతీరుతో భయపడుతోంది. తల్లిదండ్రులు అమెరికా వెళ్లిపోయే వాళ్ల వెంబడి వెళ్లిపోయిన పిల్లలు అక్కడే కాలేజీ చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్లను స్వదేశానికి వెళ్లిపొమ్మంటున్నారు. మీరు ఇక్కడి వారు కాదు.. అక్కడి వాళ్లని చెబుతున్నారు. అమెరికాలో అలా రెండున్నర లక్షల మంది భారతీయ యువకులు ఉన్నారు. వాళ్లు తిరిగి వచ్చినా ఇక్కడ ఇమిడిపోయే అవకాశాలు తక్కువేనని చెబుతున్నారు. ఇప్పుడు ఆ రెండున్నర లక్షల మంది పరిస్తితి త్రిశంకు స్వర్గంలా తయారైంది..ఏం చేయాలో అర్థం కాని దుస్థితిలోకి వాళ్లు నెట్టబడ్డారు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…