రాజకీయ నాయకులంటేనే పదవులు. బెల్లం చుట్టూ ఈగెలు మూగినట్లుగా… పదవులు ఉన్న చోటే రాజకీయ నాయకులు ఉంటారు. అధికార పార్టీ ఏదైనా సరే పరుగులు పెట్టి అందులో చేరిపోయి.. ఏదోక పదవి దక్కించుకునేందుకు పోటీ పడుతుంటారు. ఆ రకంగా కూటమిలో ఆశావహులు ఎక్కువైపోయిన కారణంగానే నామినేటెడ్ పదవుల ప్రకటన ఆలస్యమైంది. ప్రతీ పదవికి పది మంది పోటీ ఉండటంతో అన్ని కోణాల్లో ఆలోచించి పదవులు ఇచ్చామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో కొందరికి నిరాశ తప్పలేదు…
వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు రెబెల్ స్టార్ గా రాజకీయాలు నడిపిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల జనసేన కండువా కప్పుకున్నారు. పార్టీ కోసం పనిచేస్తానని ప్రతిజ్ఞ కూడా చేశారు. ఆయన ఎంట్రీతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన బలం పుంజుకుంటుందని ఎదురు చూస్తున్న మాట వాస్తవం. అయితే ఫిరాయించినందుకు తనను తగిన పద్ధతిలో సత్కరిస్తారని బాలినేని ఎదురు చూశారట. రెండో విడత నామినేటెడ్ పదవుల్లో తన గౌరవానికి తగిన పదవి వస్తుందనుకున్నారట. మొత్తం 59 పదవులు ప్రకటించినా అందులో బాలినేని పేరు లేదు.
తన హోదాను అర్థం చేసుకుని ఒక పదవి ఇస్తారని బాలినేని ఆశగా ఉన్నారని, అది నెరవేరలేదని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. కాకపోతే బాలినేని ఎక్కడా లాబీయింగ్ చేయలేదు. పదవులు అడగలేదు. వాళ్లే అర్థం చేసుకుని ఇస్తారని ఎదురుచూశారు. ఐనా అడగనిదే అమ్మ కూడా పెద్దదంటారు. అడగనిదే చంద్రబాబు అస్సలు ఇవ్వరు. పైగా పదవుల కోసం పవన్ కల్యాణ్ పై చాలా ఒత్తిడి ఉంది. అడిగిన వారికే ఆయన రికమండేషన్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అడగని వారికి ఏ మాత్రం ఇప్పించలేరని బాలినేని గుర్తించలేకపోయారు..
నామినేటెడ్ పదవుల కోసం ఉత్తరాంధ్ర జనసేన నేతలు కూడా బాగానే ఎదురుచూశారు. వాళ్లకు కూడా ఈ సారి మొండిచేయి చూపించినట్లయ్యింది. ఉమ్మడి గోదావరి జిల్లాల తర్వాత ఉత్తరాంధ్రలోనే జనసేనకు భారీగా కేడర్ ఉంది. విశాఖలో జనసేనకు అంకితభావంతో పనిచేసే కీలక నేతలున్నారు. విశాఖలో వైసీపీ అరాచకాలు, భూక్జాలను ఎండగట్టి రోజువారీ మీడియా సమావేశాలు పెట్టి మరీ జగన్ పార్టీని అక్కడ ఓడించారు. అలాంటి వారంతా నామినేటెడ్ పదవులను ఆశించారు. పైగా కూటమి ప్రభుత్వంలో జనసేన పోషిస్తున్న పాత్రను బట్టి ఎక్కువ నామినేటెడ్ పదవులు వస్తాయని ఎదురుచూశారు. ఐనా వారికి నిరాశే మిగిలింది. పదవులన్నింటినీ తెలుగుదేశం ఖాతాలో వేసుకున్నారని ఉత్తరాంధ్ర జనసైన్యం పళ్లు కొరుకున్నట్లు సమాచారం. వారి ఆగ్రహాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ ఎలా చల్లార్చుతారో చూడాలి…