కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టయ్యారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో మార్నింగ్ వాక్ చేస్తుండగా నరేందర్ రెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందే తడవుగా లగచర్ల దాడి కేసులో నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన కలెక్టర్ పై దాడి కేసులో బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నరేందర్ రెడ్డిని పిన్ పాయింట్ చేసినట్లుగా తెలుస్తోంది. తమపై కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించినప్పటికీ దాడిలో పాల్గొన్న నిందితుడు నరేందర్ రెడ్డితో ఎక్కువ సార్లు ఫోన్లో మాట్లాడినట్లుగా పోలీసులు గుర్తుచేశారు. ఈ విషయమై విచారించేందుకే పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారని భావిస్తున్నారు…
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం.. లగచర్ల, పోలేపల్లిలో 1350 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. తొలుత ఫార్మా విలేజ్ ఏర్పాటు చేద్దామని ప్రభుత్వం భావించింది. దీనికి ఆయా గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ క్రమంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. అందులోభాగంగా ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకోసం సోమవారం.. దుద్యాలలో అధికారులు గ్రామ సభ, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లిలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్‌పై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ నేతలతోపాటు పలువురిపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. జిల్లా కలెక్టర్‌పై దాడికి దిగేలా ప్రజలను రెచ్చగొట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. నిందితుడు పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు సురేశ్ అని పోలీసులు స్పష్టం చేశారు. ఈ దాడి జరిగే సమయానికి ముందు పట్నం నరేందర్ రెడ్డితో పదుల సంఖ్యలో పోన్ కాల్ చేసి సురేశ్ మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. ఇక పట్నం నరేందర్ రెడ్డి సైతం.. ఓ వైపు సురేశ్‌తో మాట్లాడుతూనే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకు వచ్చేందుకు డీజీపీ ఇప్పటికే సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. పట్నం నరేందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్న సురేశ్‌పై ఇప్పటికే రేప్ కేసుతో సహా వివిధ కేసులు సైతం నమోదయ్యాయి. అయితే గతంలో సురేష్‌పై నమోదు అయిన కేసులను తొలగించేందుకు పట్నం నరేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల విచారణలో బహిర్గతమైంది.
పోలీసులు నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నప్పటికీ… అసలు టార్గెట్ కేటీఆర్ అయి ఉంటారని రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్, ఆయన సిబ్బందిపై దాడి జరుగుతున్నప్పుడు నరేందర్ రెడ్డి , ఎందుకు కేటీఆర్ కు ఫోన్ చేశారన్నది పెద్ద ప్రశ్న. వారిద్దరూ ఏమి మాట్లాడుకున్నారు, జనాన్ని రెచ్చగొట్టాలని కేటీఆర్ ఆదేశించారా.. లాంటి ప్రశ్నలు ఇప్పుడు ప్రభుత్వ వర్గాలను వేధిస్తున్నాయి. దానిపై క్లారిటీ కోసమే నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి ఉంటారని భావిస్తున్నారు. దాడిలో కేటీఆర్ ప్రమేయం ఉంటే.. ఆయన అరెస్టుకు సైతం వెనుకాడకూడదని ప్రభుత్వం భావిస్తోంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…