ఫైర్ బ్రాండ్ … ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుకు ఎట్టకేలకు ఒక పదవి దక్కింది. ఈ క్రమంలో ఆయన అలిగి, మొత్తుకుని సాధించారన్న ప్రచారమూ ఉంది. జగన్ పై యుద్ధం చేసి ఆయన్ను దించడంలో తాను కీలక పాత్ర వహించానని ట్రిపుల్ ఆర్ తరచూ చెప్పుకునే వారు. ఇంకెన్నాళ్లీ నిరీక్షణ అన్నట్లుగా రఘురామ అసహనం బయట పడుతూ తారా స్థాయికి చేరుకున్న తరుణంలో పొంగుతున్న పాలపై కాసిని నీళ్లు చల్లి చల్లార్చినట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రకటించారు..
వైసీపీలో ఉంటూ సొంత పార్టీపై యుద్ధం చేసిన ఘనత రఘురామది. ఆ క్రమంలో ఆయన జైలుకు వెళ్లారు, పోలీసు దెబ్బలు తిన్నారు. ఏదైతేనే జగన్ ను ఓడించడంలో కీలకపాత్ర పోషించారు.ఎన్నికలు వచ్చే సరికి రఘురామకు టికెట్ ఇచ్చేందుకు పార్టీలు నానా యాగీ చేశాయి. ఆయన మా వాడు కాదంటే, మా వాడు కాదన్నట్లుగా ప్రవర్తించాయి. నరసాపురం ఎంపీ పదవిని ఆశించిన రఘురామకు..అటు తిప్పి ఇటు తిప్పి చివరకు టీడీపీలో ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. జనాదరణ బాగా పెరిగిన రఘురామ సునాయాసంగా గెలిచారు.
గెలిచిందే తడవుగా రఘురామ స్పీకర్ పదవిని ఆశించారు. అందుకు ఒక కారణమూ ఉంది. వైసీపీ అధినేత జగన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే కిందా మీదా చేసి ఉతికి ఆరెయ్యాలన్నది రఘురామ కోరిక. చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. అయ్యన్నపాత్రుడికి స్పీకర్ పదవి ఇచ్చి.. రఘురామకు మొండిచేయి చూపించారు.రఘురామకు టికెట్ ఇవ్వనప్పుడు బాధపడిన అభిమానులు, ఆయనకు ఏ పదవీ రానప్పుడు కూడా కాస్త నొచ్చుకున్న మాట వాస్తవం. ఈ లోపు సోషల్ మీడియా ఈ విషయంలో యాక్టివ్ అయ్యింది. రఘురామకు అన్యాయం జరిగిందని కొందరు రాస్తే, బాగా జరిగిందని మరికొందరు వ్యాఖ్యానించారు.
రెండు సార్లు నామినేటెడ్ పదవులను ప్రకటించినప్పుడు తనకు ఒక్క పదవి కూడా ఇవ్వకపోవడంపై రఘురామ అసంతృప్తిని, ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఎంత చేసినా తనను పట్టించుకోవడం లేదని ఆయన తీవ్ర నిరాశను వ్యక్తపరిచారు. ఈ లోపు చంద్రబాబు మనసు మారిపోయినట్లుగా కనిపించింది. రఘురామకు ఆయన డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ప్రకటించారు. ఇప్పుడిక ఏం జరగబోతోందన్నదే పెద్ద ప్రశ్న. జగన్ రెడ్డి ఆయన అనుచరులు అసెంబ్లీకి రావడం అనుమానమే అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్సీలు మండలికి వచ్చినప్పటికీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం లేదు.దానిపై స్పీకర్ అయ్యన్న సీరియస్ అయ్యారు. జగన్ రెడ్డి పరివారం సభకు వచ్చిన పక్షంలో మాత్రం రఘురామ ఒక ఆటాడుకునే అవకాశం ఉంది.. తను ఛైర్లో ఉన్నప్పుడు వాళ్లు ఎవరైనా మాట్లాడితే.. చాలు చాల్లేవయ్యా కూర్చో అని మందలించే వీలుంది. మైక్ ఇవ్వకుండా ఏడిపించే ఛాన్స్ ఎక్కువగానే ఉంటుంది. అప్పుడు సీన్ రసవత్తరంగా ఉంటుంది. అటువంటి తూ తూ మై మై గేమ్ చూసేందుకే ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…