ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేన్నైన సహించగలరు..కానీ అసమర్థతను, ఆశ్రిత పక్షపాతాన్ని, ఉదాసీనతను, పనిలో నిరాసక్తతను అసలు సహించలేరు,సహించరు. ఆయన మంత్రివర్గ సహచరుల్లో చాలా మంది మాత్రం విధి నిర్వహణలో ఉదాసీనతకు అవకాశం ఇస్తున్నారు. మంత్రివర్గ బాధ్యతల కంటే ఇతర పనులపై దృష్టి పెడుతున్నారని తెలుసుకుని చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. మద్యం, ఇసుక దందాలపై ఉన్న దృష్టి పాలనాపరమైన పనులపై లేదని చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఇంకా పూర్తిగా ఆరు నెలలు కాకుండానే పునర్ వ్యవస్థీకరణపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది..
సంక్రాంతి పండుగ నాటికి మంత్రివర్గంలో మార్పులు చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. కొంతమంది మంత్రిపదవిని ఎంజాయ్ చేస్తున్నారే తప్ప.. ప్రజల కోసం ఏదైనా మేలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదని చంద్రబాబుకు అంతర్గతంగా రిపోర్ట్ అందింది. ముగ్గురు నలుగురు మంత్రుల తీరుపై చంద్రబాబు బాగా అసంతృప్తిగా ఉన్నారని వారిని మార్చడం మినహా వేరు గత్యంతరం లేదని ఒక నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. ఈ దిశగా వారికి చంద్రబాబు ముందే నర్మగర్భంగా సందేశం కూడా ఇచ్చారట…
హోం మంత్రి వంగలపూడి అనితను మంత్రివర్గం నుంచి తొలగించి వేరే బాధ్యత అప్పగించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అనిత హైదరాబాద్ లో ఎక్కువ, అమరావతిలో తక్కువగా ఉంటున్నారని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. తన శాఖపై పట్టు సాధించేందుకు ఆమె ప్రయత్నించడం లేదని, పనితీరు మెరుగుపడటం లేదని విశ్లేషించుకున్నారట. అసలు అనిత నిర్వహిస్తున్న శాఖపై డిప్యూటీ సీఎం పవన్ చేసిన కామెంట్స్ వెనుక చంద్రబాబు మంత్రాంగం ఉందని కూడా ఒక వాదన ప్రచారంలో ఉంది. ముఖ్యమంత్రి స్వయంగా కామెంట్స్ చేస్తే ఎస్సీ సామాజికవర్గంలో రాంగ్ సిగ్నల్స్ వెళతాయని అందుకే చంద్రబాబు వ్యూహాత్మకంగా పవన్ చేత మాట్లాడించారని ఒక టాక్ ఉంది.
కార్మిక మంత్రి వాసంసెట్టి సుభాష్ కు కూడా పదవీ గండం తప్పేలా లేదు. టెలీ కాన్ఫరెన్స్ లో మంత్రికి చంద్రబాబు చీవాట్లు పెట్టిన తీరు అందరినీ ఆశ్చర్య పరిచింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను చేర్చలేకపోతే ఇక ఏం పనిచేస్తున్నావని చంద్రబాబు నేరుగా సుభాష్ ను నిలదీయడంతో ఆయన నీళ్లు నమిలారు. తర్వాత సుభాష్ ఎన్ని వివరణలు ఇచ్చుకున్నా పోయిన పరువు మాత్రం వెనక్కి రాదు. చంద్రబాబు మనసులో ఆయన పట్ల పడిపోయిన నెగిటివ్ ముద్ర అంత త్వరగా చెరిగిపోదని భావించాల్సి ఉంటుంది…
అంతమంది పోటీదారులు ఉన్నప్పటికీ తొలి సారి ఎమ్మెల్యే అయిన సుభాష్ కు మంత్రి పదవి కట్టబెట్టారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చంద్రబాబు, లోకేశ్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాల్సిన సుభాష్ ఆ దిశగా విఫలమయ్యారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరో ఇద్దరు ముగ్గురు నేతల నెత్తిన కూడా కత్తి వేలాడుతుందని చెబుతున్నారు. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్థన్ రెడ్డి, ఎం. రాంప్రసాద్ రెడ్డి మంత్రివర్గ కార్యకలాపాలపై దృష్టి పెట్టకుండా తమ పదవిని ఉపయోగించుకుని సొంత పనులు చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఏదేమైనా సంక్రాంతి నాటికి ఏపీ మంత్రివర్గంలో ఆటం బాంబులు పేలడం ఖాయం…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…