చంద్రబాబును 1990ల్లో హైటెక్ ముఖ్యమంత్రి అని పిలిచే వారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అమరావతి నిర్మాణానికి పునాదులు వేయడం ద్వారా ఆయన నవ్యాంధ్ర నిర్మాత అయ్యారు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో ఆయనకు అన్ని రకాల సక్సెస్ లు వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా, విభజిత రాష్ట్రంలోనైనా ఎక్కువ కాలం సీఎంగా చేస్తున్నదీ చంద్రబాబే.. అప్పటికీ ఇప్పటికీ దేశంలోనే చంద్రబాబు అత్యంత పాపులర్ చీఫ్ మినిష్టర్. ప్రజాదరణ ఉన్న ప్రధానమంత్రులతో సమానంగా జనం ఆయన్ను చూస్తారు..
చంద్రబాబుకు ఒకప్పుడు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిందని చెబుతారు. ఆ పదవిని తీసుకునేందుకు ఆయన ఇష్టపడలేదు.తనకు రాష్ట్రమే ముఖ్యమని చెప్పుకుని.. అప్పట్లో పీఎం అయ్యే అవకాశాన్ని ఐకే గుజ్రాల్ కు వదిలేశారు. ఆ క్రమంలో ఆయన ప్రధానమంత్రులను నిలబెట్టే కింగ్ మేకర్ గా పేరు పొందారు. చంద్రబాబు ఎవరు ప్రధాని కావాలని తలచుకుంటే వాళ్లు అవుతారని రాజకీయవర్గాల్లో చర్చ జరిగేది. వీ మేక్ ప్రైమ్ మినిష్టర్స్ అని చంద్రబాబు అనేవారట. దేశం ముఖ్యమే కానీ, తన పదవి ముఖ్యం కాదని చంద్రబాబు చెబుతుండేవారని ఆయన సన్నిహితులు కామెంట్ చేస్తుంటారు. దేవెగౌడ, గుజ్రాల్, వాజ్ పేయి ఎవరు ప్రధానిగా ఉన్నా సరే రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలను పొందడంలో చంద్రబాబు ముందుండేవారు. చంద్రబాబు ముఖ్యమంత్రిత్వంలో ఉమ్మడి ఏపీ బాగానే ప్రయోజనం పొందింది. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు ఆ తర్వాత టీడీపీలో చేరి చక్రం తిప్పి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు…
చంద్రబాబుకు ఒకప్పటి సహచరుడు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. రేవంత్ ని సహచరుడు అని మాత్రమే సంబోధించాల్సి వస్తోంది. ఎందుకంటే చంద్రబాబు శిష్యుడు అని సంబోధించిన ఒక విలేకరిని ఆయన ఎవరికి ఎవరు శిష్యుడు అంటూ గట్టిగా మందలిచ్చారు. ఎవరైనా శిష్యుడు అని అంటే గుడ్డు మీద తంతా అని కూడా హెచ్చరించారు. అది వేరే విషయం అనుకోండి. చంద్రబాబు రాజకీయ జీవితాన్ని ఒక్క మాటలో విశ్లేషించిన రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే ప్రధానమంత్రి అయ్యేవారని వ్యాఖ్యానించారు. అది నిజంగానే ఆసక్తికర కామెంట్ అవుతుంది. అదేంటీ గాంధీనెహ్రూ కుటుంబ సభ్యులే ప్రధానమంత్రి కావాలి కదా అని ప్రశ్నించే రోజులు పోయినందున రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్లో రిజనింగ్ ఉందని భావించాల్సి ఉంటుంది. గాంధీ నెహ్రూ ఫ్యామిలీ కాని మన్మోహన్ సింగ్ పదేళ్లపాటు దేశానికి ప్రధానిగా ఉన్నారు. అలాంటప్పుడు చంద్రబాబు ప్రధాని కావడంలో తప్పులేదని, అలాంటి అవకాశాలు ఉండేవని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. పైగా చంద్రబాబుకు పాలనాపరంగా అనుభవం ఉండటం, పాలనలో మెలుకువలు తెలియడం కూడా కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.
చంద్రబాబు అర్థ శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఆర్థికాంశాలపై పూర్తిగా పట్టు ఉంది. ఎలాంటి నిర్ణయాలతో దేశ ఆర్థిక స్థితిని గాడిలో పెట్టే వీలుందో ఆయనకు తెలుసు. బడ్జెటింగ్ లో ఆయన దిట్ట అని చెబుతారు. ఎక్కడ డబ్బులు ఖర్చు చేయాలి, ఎక్కడ ఖజానాకు పొదుపు చేయాలో ఆయనకు బాగానే తెలుసు. ప్రధానమంత్రిగా తన కింద పనిచేసే ఆర్థికమంత్రికి చంద్రబాబు దిశానిర్దేశం చేయగలరని కూడా అభిమానులు విశ్వసిస్తున్నారు. మరి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో లేరు. ప్రస్తుతం ఆయన బీజేపీకి అత్యంత సన్నిహుతుడైన నాయకుడిగా ఎన్డీయే కూటమిలో పనిచేస్తున్నారు. మరి చంద్రబాబు ప్రధానమంత్రి అయ్యేవారన్న రేవంత్ రెడ్డి వాక్కు భవిష్యత్తులో ఫలిస్తుందో లేదో చూడాలి. అదే జరిగితే ఆయన అభిమానులకు అంతకంటే కావాల్సిందేముంటుంది….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…