విజయసాయి రెడ్డి…కొన్ని రోజులు వైసీపీలో నెంబర్ టు గా ఉంటారు. కొన్ని రోజులు పార్టీలో అనామకుడిగా టైమ్ పాస్ చేస్తారు. ఆయన ఎప్పుడు చక్రం తిప్పుతారో ఎప్పుడు మౌనంగా ఉండిపోతారో చెప్పలేమని పార్టీ వర్గాలే అంటుంటాయి.వాళ్లతో మనకెందుకులే అబ్బా అనేసి ఎవరినైనా దూరం పెట్టగలరు. నచ్చితే ఎవరినైనా నెత్తినెక్కించుకుని తిప్పగలరు. సదరు వ్యక్తి వల్ల తనకు ఎంత నష్టం వచ్చినా బయట పడకుండా మౌనంగా ఉండిపోవడం ఆయన నైజమనే చెప్పాలి…
వైసీపీ మాజీ ఎంపీ, ప్రస్తుతం టీడీపీలో ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు విషయంలో విజయసాయి రెడ్డి వైఖరి ఫుల్ సర్కిల్ తిరిగినట్లయ్యింది. రఘురామ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా విజయసాయి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గతం గతహా: అన్న విజయసాయిరెడ్డి అన్నీ మరచిపోయి ముందుకుపోవాలని రఘురామకు హితవు పలికారు. డిప్యూటీ స్పీకర్ స్థానం గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడతారనే నమ్మకం తనకుందని సాయిరెడ్డి చెప్పారు. గతంలో జరిగిన ఘటనలను వదిలేసి పైకి ఎదుగుతారని ఆశిస్తున్నానని అన్నారు. వైసీపీ నేతలను, విజయసాయిని, జగన్ ను తీవ్రస్థాయిలో విమర్శించిన రఘురామకు విజయసాయి విషెస్ చెప్పడం షాకింగ్ గా మారిందన్నది సోషల్ మీడియా టాక్. కాకపోతే రాజకీయ పరిస్థితులు, విజయసాయి ఆలోచనా విధానం, గతంలో జరిగిన సంఘటనలు తెలిసిన వాళ్లు మాత్రం విజయసాయి ప్రకటన పట్ల ఎలాంటి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం లేదు…
అప్పట్లో రఘురామ వైసీపీలో ఎలా చేరారు, నరసాపురం ఎంపీ టికెట్ ఎలా పొందారో తెలుసుకుంటే విజయసాయికి, రఘురామకు ఉన్న స్నేహం అర్థమవుతుంది. ఒకప్పుడు రఘురామ బీజేపీలో ఉండేవారు. అక్కడ గెలవడం కష్టమని తెలుసుకున్న ఆయన.. వైసీపీలో కలిసిపోయేందుకు విజయసాయిని సంప్రదించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకున్న సాన్నిహిత్యాన్ని విజయసాయికి గుర్తు చేస్తూ ఒక సారి జగన్ తో భేటీకి ఏర్పాటు చేయాలని కోరారు. బాగా మాటకారి అయిన రఘురామ బుట్టలో పడిపోయిన విజయసాయి.. ఆయన్ను జగన్ వద్దకు తీసుకువెళ్లారు. బాగానే రిసీవ్ చేసుకున్న జగన్ ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో మాత్రం ససేమిరా అన్నారు. అయితే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన రఘురామకు టికెట్ ఇస్తే కులం పరంగా వైసీపీకి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని విజయసాయి తమ పార్టీ అధినేతకు నచ్చజెప్పారు. దానితో 2019 ఎన్నికల్లో నరసాపురం ఎంపీ టికెట్ ను రఘురామకు ఇవ్వడం ఆయన గెలవడం జరిగిపోయింది. తర్వాత కట్ చేసి చూస్తే రఘురామ ఏకు మేకై కూర్చున్నారు. జగన్ కంటే తానే గొప్పవాడినన్న ఫీలింగు ఇవ్వడం మొదలు పెట్టారు..దానితో ఆగ్రహం చెందిన జగన్ చాలా కాలం విజయసాయిని సైతం దూరం పెట్టారు. ఆయన మళ్లీ జగన్ కోటరీలో చేరేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది.
రఘురామ వైసీపీ వ్యతిరేక కార్యకలాపాలు మొదలు పెట్టిన తర్వాత కూడా విజయసాయి రెడ్డి ఆయన్ను ట్విటర్ వేదికగా హెచ్చరించేందుకు ప్రయత్నించారు. అన్యాయంగా ఛస్తావ్ అంటూ పోస్టులు పెట్టారు. దాన్ని పాజిటివ్ గా తీసుకోవాల్సిన రఘురామ ఆయనపై ఎదురుదాడి చేశారు. పోరా పొట్టి నా డాష్ అంటూ దిగజారుడు పదజాలాన్ని వాడేశారు. ఐనా తర్వాత కూడా విజయసాయి ఆయన్ను దారికి తెచ్చేందుకు ప్రయత్నించడం సమకాలీన చరిత్రగా చెప్పుకోవాలి. విజయసాయి ముందస్తుగా ఊహించి హెచ్చరించినట్లుగానే రఘురామ కస్టోడియల్ టార్చర్ కు గురయ్యారు. లాకప్ లో పడేసి నాలుగు తన్నులు తన్నారు. విజయసాయి రెడ్డి, రఘురామ ఉప్పు నిప్పుగా ఉంటారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగేది. నిజానికి విజయసాయి ఎవ్వరినీ వ్యతిరేకించరు. ఆయన అందరికీ దారి చూపేందుకే ప్రయత్నిస్తారు..
ఇప్పుడు కూడా విజయసాయి.. తన పాత మిత్రుడు రఘురామ మంచే కోరుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే గతాన్ని మరిచిపోయి రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. మరి ఎవ్వరినీ లెక్కచేయకుండా, అంతా తనకే తెలుసని భావించే రఘురామ రాజు ఆ సంగతి పట్టించుకుంటారో, చెప్పిన మంచి మాటను తలకెక్కించుకుంటారో లేదో కాలమే సమాధానం చెబుతుంది..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…