ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అమెరికాకు లింకు పడింది. అదానీపై అమెరికాలో నమోదైన కేసు ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి మెడకు కూడా చుట్టుకుంది. అదానీ నుంచి జగన్ కు 17 వందల 50 కోట్లు అందిందని వెల్లడైంది. ఆ కేసులో జగన్ రెడ్డిపై టీడీపీ అనుకూల మీడియా ఆరోపణలు సంధిస్తోంది. ఐనా టీడీపీ నేతృత్వ కూటమి మాత్రం మౌనంగా ఉంటుంది. ఇదో వ్యూహాత్మక మౌనంగానే పరిగణించాలి..
కేంద్ర ప్రభుత్వ సంస్థను అడ్డం పెట్టుకొని, రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థలకు సౌరశక్తిని అమ్మే కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం 2021-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సహా ఐదు రాష్ట్ర ప్రభుత్వాల్లోని కీలక వ్యక్తులకు 2,029 కోట్లు లంచంగా చెల్లించారని అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ సంచలన ప్రకటన చేసింది. అందులో 1,750 కోట్లు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తికి చెల్లించారని ప్రకటించింది.
భారత సౌర విద్యుత్తు సంస్థ …సెకీ… రాష్ట్రాలకు సోలార్ పవర్ సరఫరా చేసేందుకు ఆహ్వానించిన టెండర్‌ను అప్పట్లో అదానీ గ్రూప్ దక్కించింది. దీని ప్రకారం… రాష్ట్రాల డిస్కమ్‌లు ‘సెకీ’తో ఒప్పందం చేసుకుంటే… అదానీ ప్లాంట్ల ద్వారా సౌర విద్యుత్తును సరఫరా చేస్తారు. అయితే… అదానీ కోట్ చేసిన ధరను చూసి డిస్కమ్‌లు బెంబేలెత్తాయి. ఒక్క ప్రభుత్వం కూడా సెకీతో ఒప్పందానికి ముందుకు రాలేదు. అవి కుదిరితే తప్ప ప్లాంట్లు ఏర్పాటు చేయలేరు. సొమ్ములు సంపాదించలేరు. ప్లాంట్ల ఏర్పాటు పేరుతో అప్పటికే భారీగా అప్పులు తెచ్చి, పెట్టుబడులు సమీకరించిన నేపథ్యంలో ‘అదానీ’పై ఒత్తిడి బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ ‘లంచాల యాత్ర’ మొదలుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాల్లోని కీలక వ్యక్తులను కలిసి లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఇందులో… జగన్ జమానాలో జరిగిన సంఘటనల గురించి మరింత వివరంగా వెల్లడించాయి. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ను అదానీ పలుమార్లు స్వయంగా కలిశారు. 2021లో ఆగస్టు 7న జగన్‌తో అదానీ భేటీ అయ్యారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదరకపోవడంపై చర్చించారు. లంచాలు ఆఫర్ చేశారు.ఆ తర్వాత సెప్టెంబరు 12, నవంబరు 20 తేదీల్లోనూ వీరు సమావేశమయ్యారు’’ అని అమెరికా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి.
అదానీ గ్రూప్ 2020-2024 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్ గఢ్, జమ్మూ కశ్మీరు రాష్ట్ర ప్రభుత్వాలతో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు సౌర విద్యుత్‌ను ప్రోత్సహించే ముసుగులో ముడుపులు తీసుకొని 20 ఏళ్ల వరకు అదానీ గ్రూప్ దగ్గరే విద్యుత్ కొనే విధంగా డిస్కమ్‌లతో ఒప్పందాలు చేయించాయన్నది అభియోగం. ఆంధ్రప్రదేశ్‌లో 1,750 కోట్ల ముడుపులకు బదులుగా ఏడు గిగావాట్ల సౌర విద్యుత్‌ను 26 ఏళ్లపాటు కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారన్నది అభియోగం. దాంతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధిక సౌర విద్యుత్ కొంటున్న రాష్ట్రంగా మారింది. ఆరోపణలన్నీ నిరాధారమైనవని అదానీ గ్రూప్ ఖండించినప్పటికీ వివాదం చినికి చినికి గాలివానగా మారింది. అదానీని అరెస్టు చేయాలని కాంగ్రెస్ తో సహా ప్రతిపక్షాలన్నీ డిమాండ్ చేయగా, సోమవారం నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాలు స్తంభించిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోదీ-అదానీల మధ్య అవినీతి బంధం ఉందని ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్‌గాంధీ ఈ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ…జేపీసీ.. దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
అదానీ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ను ఊపేస్తోంది. మీడియాలో కథనాలు, డిబేట్లు జరుగుతున్నాయి. అధికార కూటమి నేతలు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకే నేతలు మౌనం వహిస్తున్నారని తెలుస్తోంది. అదానీ వ్యవహారం కావడంతో వాళ్లు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. అదానీ అందరికీ ఆప్తుడని అన్ని పార్టీలకు ముడుపులు ఇస్తారని అందుకే చంద్రబాబు తమ పార్టీ వారికి జర భద్రం అని చెప్పారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…