భట్టి విక్రమార్క సూపర్..మరి రేవంత్ రెడ్డి సంగతేంటి…?

By KTV Telugu On 25 November, 2024
image

KTV TELUGU :-

రెండు ఉత్తరాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పార్టీలకు విభిన్న తీర్పులు ఇచ్చాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యం చెందితే.. జార్ఖండ్ లో కూటమి కట్టి విజయం సాధించింది.దానితో రెండు రాష్ట్రాల్లో పార్టీ విజయం కోసం పనిచేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతల విషయంలో రాజకీయ విశ్లేషకులు తలోమాట మాట్లాడుతున్నారు. ఆయా రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం చేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతల సక్సెస్, ఫెయిల్యూర్ పై సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది…

జార్ఖండ్ రాష్ట్రంలో ఇండియా కూటమి విజయం వెనుక తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రాంగం ఉందని కాంగ్రెస్ వర్గాలే అంగీకరిస్తున్నాయి.కాంగ్రెస్ ఎన్నికల మానిటరింగ్ బాధ్యత తీసుకున్న భట్టి .. ఎంతో సమర్థంగా పనిచేశారని చెప్పుకుంటున్నారు. మూడు సార్లు జార్ఖండ్ లో పర్యటించి ఆయన ఎన్నికలకు కూటమిని సమాయత్త పరిచారు. ఏఐసీసీ సీనియర్ పరిశీలకుడిగా, స్టార్ క్యాంపెయినర్ గా డిప్యూటీ సీఎం తీవ్రంగా శ్రమించారని, జార్ఖండ్ విజయంలో భట్టి పాత్ర మరువలేనిదని ఏఐసీసీ అగ్రనేతలంతా ప్రశంసిస్తున్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరూ పనిచేయాలని భట్టి ప్రచారం చేశారు. మైనింగ్ పనులు స్థానికులకే అప్పజెప్పాలని నినదించారు. ఎన్నికలు ప్రకటించిన వెంటనే రంగంలోకి దిగిన భట్టీ.. అక్కడ మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో ప్రధాన భూమిక పోషించారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా సీట్ల సర్దుబాటు పూర్తయ్యిందంటే అది భట్టీ చొరవతోనేనని చెప్పుకున్నారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాల్లో కూడా ఆయన కీలకంగానే ఉన్నారు. జార్ఖండ్ కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పనలోనూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కు వెన్నుదన్నుగా ఉన్నారు. భారీ బహిరంగ సభలతో పాటు క్షేత్రస్థాయి మీటింగులకు కూడా భట్టి పార్టీ అజెండాను రూపొందించారు…

రాంచీ నుంచే భట్టి తన ప్రచార కార్యక్రమాలను నిర్ధారించి నిర్వహించారు. బీజేపీ వ్యూహాలను తిప్పకొట్టడంలో కీలకంగా ఉన్నారు. జార్ఖండ్ లోని అపారమైన ఖనిత సంపదను దోచుకుని నలుగురు బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడమే బీజేపీ అజెండాగా ఉందని భట్టి రూపొందించిన ప్రచార వ్యూహం క్షేత్రస్థాయిలో బాగానే పనిచేసింది. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలంటే కాంగ్రెస్ కూటమి విజయం సాధించాలని ఆయన నూరిపోశారు. అందుకే ఇప్పుడు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో భట్టీ పట్ల గౌరవం పెరిగిందని చెప్పక తప్పదు….

ఒకపక్క భట్టీ చొరవతో జార్ఖండ్ లో పార్టీ విజయం సాధిస్తే.. మరో పక్క తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు ప్రచారం చేసిన మహారాష్ట్రలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఓడిపోయింది. ఇదే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణను ఆనుకుని, నిజం పాలనలో తెలంగాణలో కలిసున్న రాష్ట్రంలో తెలంగాణ అధికార పార్టీ నేతలు ప్రచారం చేసినప్పటికీ ప్రయోజనం కలగలేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహారాష్ట్రలో కాంగ్రెస్‌ 15 సీట్లకు పడిపోవడం టీపీసీసీ నేతలను తీవ్ర నిరాశకు గురి చేసింది. తెలంగాణ సరిహద్దు నియోజకవర్గాల్లోనూ పొరుగు సెంటిమెంటు ఏమాత్రం పనిచేయలేదు. ఆయా ప్రాంతాల్లో మహాయుతి నేతలే భారీ మెజారిటీలతో గెలుపొందారు.

మహారాష్ట్ర ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి మూడు విడతల్లో ప్రచారం చేశారు. గుగ్గూస్‌, రాజూర, డిగ్రామ్‌, వార్దా, సోలాపూర్‌, కడెగావ్‌, ధారావి, వర్లి తదితర నియోజకవర్గాల్లో తిరిగారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ, ఇతర పథకాలపై అక్కడి ప్రజలకు వివరించారు. తాను ప్రచారం చేసిన నియోజకవర్గాల అభివృద్ధి బాధ్యతను తీసుకుంటానని ప్రకటించారు. రేవంత్‌ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కడెగావ్‌, ధారావి, వర్లి స్థానాల్లో మహా వికాస్‌ అఘాడీ అభ్యర్థులు విజయం సాధించారు.మిగతా చోట్ల కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది.

ఇక ఏఐసీసీ పరిశీలకులుగా మంత్రి ఉత్తమ్‌ కమార్‌రెడ్డి మరాఠ్వాడా ప్రాంతం, మంత్రి సీతక్క ఉత్తర మహారాష్ట్ర ప్రాంత బాధ్యతలను తీసుకున్నారు. ఇద్దరూ కలిసి 80కి పైగా నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య సమన్వయం, తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించడం వంటివి చూసుకున్నారు. దాదాపు పది రోజుల పాటు మహారాష్ట్రలోనే మకాం వేసి అక్కడి వ్యవహారాలను చక్కదిద్దారు. ఆ రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులు ఓటమిపాలు కావడం మంత్రులను నిరుత్సాహపరిచింది. ఎంపీలు ఎమ్మెల్యేలు పరిశీలకులుగా వెళ్లి ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. దానితో ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.ఆయన ప్రచారం చేయకుండా ఉన్నా బావుండేదంటూ కొందరు జోకులు వేస్తున్నారు. తెలంగాణ వేరు, మహారాష్ట్ర వేరు అని రేవంత్ ఇప్పటికైనా తెలుసుకోవాలని కొందరు హితబోధ చేస్తున్నారు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి