తానా నిధులు స్వాహా చేసిన మాజీ కోశాధికారి

By KTV Telugu On 26 November, 2024
image

KTV TELUGU :-

ఉత్తర అమెరికా తెలుగు సంఘము.. తానా.. తీవ్ర సంక్షోభంలో ఇరుక్కునే పరిస్థితులు వచ్చాయి. తానా నిధులు గోల్ మాల్ జరిగింది. గుట్టుచప్పుడు కాకుండా నిధులు మరో ఖాతాకు బదలీ అయ్యాయి. అమెరికాలో ఉండే తెలుగు వారి సాంస్కృతిక, సామాజిక అభివృద్ధి కోసం ఏర్పాటై సొంత ప్రాంతాలైన తెలుగు రాష్ట్రాల్లో కూడా సేవలందిస్తున్న తాజా ఫౌండేషన్ ముందన్నడూ లేనట్లుగా ఇప్పుడు వత్తిడిలో ఉంది. రూపాయి కాదు, రెండు రూపాయలు కాదు ..ఏకంగా 30 లక్షల డాలర్ల తానా నిధులు దారిమళ్లాయి…

తానా ఫౌండేషన్ మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు ఎవరిని సంప్రదించకుండా తన సొంత కంపెనీ ఇర్వింగ్ టెక్సాస్ లో వున్న బృహత్ టెక్నాలజీస్ కి మూడు మిలియన్ డాలర్ల పైన నిధులు మళ్లించుకున్నారు. ఈ అంశాన్ని తానా బోర్డు చాల తీవ్రంగా పరిగణించింది. శ్రీకాంత్ పోలవరపు…తానా ఫౌండేషన్ మీటింగ్ లో డిస్కస్ చెయ్యకుండా, ఫౌండేషన్ అనుమతి లేకుండా నిధులు మళ్లించారని నిర్థారణ అయ్యింది. ప్రస్తుత తానా బోర్డు చైర్మన్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలితో పాటు ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి దీనిపై చర్చించారు. శ్రీకాంత్ పోలవరపు ని సంప్రదించగా నిధులు మళ్ళింపు నిజమే అని అది తన సొంత నిర్ణయం అని ఈ సంఘటనకి పూర్తి బాధ్యత వహిస్తాను అని ఇమెయిల్ మెసేజ్ ద్వారా తెలిపారు.

నిధుల మళ్ళింపు సంఘటన పై తానా బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించింది. సమావేశం లో బోర్డు సభ్యులు అందరు ఈ సంఘటనని తీవ్రంగా పరిగణించి దారి మళ్ళిన నిధులు వెనక్కి తీసుకు రావడానికి అవసరమైన అన్ని చర్యలు వెంటనే ప్రారంభించాలని తానా బోర్డు చైర్మన్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలిని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసారు. నేడు జరిగే బోర్డు సమావేశానికి హాజరు కావాలని శ్రీకాంత్ పోలవరపుకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు.

నిజానికి తానా కార్యవర్గం నిస్వార్థ సేవలకు పెట్టింది పేరు. తమ సొంత నిధులు ఖర్చు పెట్టడమే తప్ప.. ఫౌండేషన్ డబ్బులు తీసుకున్నట్లుగా ఎవరి మీద ఆరోపణలు లేవు. ఈ సారి మాత్రం శ్రీకాంత్ పోలవరపు చేసిన ద్రోహం కాస్త ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది. సభ్యులు, దాతల పట్ల ఇది ముమ్మాటికి ద్రోహమేనని తానా వర్గాలు అంటున్నాయి. ఎంతో ప్రతిష్టత్మకమైన ఒక సంస్థలో నిధులను సొంత వ్యాపారాలకు మళ్లించంచడమేంటని ప్రశ్నించుకుంటున్నారు. అందుకే పోయిన 30 లక్షల డాలర్లను తిరిగి పొందేందుకు న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నారు. శ్రీకాంత్ పోలవరపుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా తానా ప్రత్యేక సమావేశంలో నిర్ణయిస్తారు. మరో పక్క 30 లక్షల డాలర్లు దారి మళ్లినప్పటికీ.. తానా నిధులకు కొదవ లేదని, నిర్దేశిత కార్యక్రమాలు యథావిథిగా కొనసాగుతాయని తానా ఫౌండేషన్ కార్యవర్గం ప్రకటించింది. ఈ అంశంలో తానా సభ్యులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. నిధుల వ్యవహారానికి సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు సభ్యులకు తెలియజేస్తామని కూడా చెప్పారు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి