పవన్ కల్యాణ్… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనే రైజింగ్ స్టార్ గా కనిపిస్తున్నారు…అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 21 స్థానాల్లో జనసేనను గెలిపించుకున్న పవన్ కల్యాణ్.. ఇద్దరు ఎంపీలను సైతం లోక్ సభకు పంపారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా నిత్యం వార్తల్లో ఉండే పవన్ కల్యాణ్… ప్రజల సమస్యలను ప్రస్తావించేందుకు ఎన్నడూ వెనుకాడలేదు. ఏపీలో అధికారానికి వచ్చిన దాదాపు ఆరునెలల్లోనే పవన్ కల్యాణ్ పొలిటికల్ ఇమేజ్ తెలుగు రాష్ట్రాలను దాటింది. మహారాష్ట్రలో ఆయన పరపతి…. జెండా కట్టి ఎగురుతోంది. కాంగ్రెస్ పార్టీ కంచుకోటలను నేలకూల్చడంలో పవన్ కల్యాణ్ ప్రచారం బాగానే పనిచేసింది…
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని మహాయుతి కూటమికి మొత్తం 288 సీట్లకు గానూ 233 సీట్లు దక్కాయి. ఇక బీజేపీ మిత్ర పక్షాలు సాధించిన ఈ ఘన విజయంలో పవన్ క్రెడిట్ ఎంత అన్న చర్చ అయితే సాగుతోంది. పవన్ ఈసారి కొన్ని కీలకమైన ప్రాంతాలలో పర్యటించి ఎన్డీయే తరఫున ప్రచారం చేశారు. రెండు రోజుల పాటు పవన్ చేసిన ప్రచారం మొత్తం పది అసెంబ్లీ సీట్లలో సాగింది. ఆ సీట్లు అన్ని బీజేపీ మిత్రపక్షాలకు దక్కాయి.
పవన్ ప్రచారం చేసిన సీట్లు చాలా వరకూ కాంగ్రెస్ దాని మిత్రులకు కంచుకోటలుగా ఉండేవి. అక్కడ మరో పార్టీ గెలిచిన దాఖలాలు చాలా ఎన్నికల్లో లేవు అలాంటి టఫ్ జాబ్ పవన్ కి ఇస్తే ఆయన దానిని చాలా ఈజీగా ఛేదించి బీజేపీని మిత్రులకు ఘన విజయం రూపంలో తీరాలకు చేర్చగలిగారు అని అంటున్నారు. కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆయన కుమార్తె ప్రణతి షిండె షోలాపూర్ నుంచి ఏడు సార్లు గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి అంత బలమైన షోలాపూర్ ఈ సారి మహారాష్ట్ర అధికార కూటమి వశమైంది. అక్కడ పవన్ కల్యాణ్ మెగా షో నిర్వహించి.. స్థానిక రాజకీయాలను ఎన్డీయేకు అనుకూలంగా మార్చారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రతీ చోట పవన్ ఇమేజ్ బాగానే పనిచేసింది. పవన్ ఇమేజ్ మహారాష్ట్ర ఎన్నికల్లో బాగానే పనిచేసిందని రాజకీయ విశ్లేషకులు, సర్వే సంస్థల ప్రతినిధులు అంటున్నారు. పైగా పవన్ ప్రచారం చేసిన కూటమి మెజార్టీ కూడా పెరిగింది.
మహారాష్ట్రలో కూటమి విజయం…ఇప్పుడు పవన్ అభిమానులు, జనసైనికుల్లో జోష్ పెంచింది. తమ నాయకుడు జాతీయ స్థాయికి ఎదిగాడని వారు ప్రకటించేశారు. రానున్న రోజులలో పవన్ ప్రచారాన్ని మరింతంగా ఎన్డీయే నేతలు ఉపయోగించుకుంటారు అని అంటున్నారు. పవన్ కి సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఉన్న గౌరవం, వెండితెర మీద ఆయనకు ఉన్న స్టార్ ఇమేజ్, అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవం…..ఇవన్నీ కలిస్తే దేశంలోని మిగిలిన రాష్ట్రాలలో పవన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తోంది. దాంతో పవన్ కళ్యాణ్ ని దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాలలో సైతం రానున్న రోజులలో ప్రచారానికి వినియోగించుకుంటుంది అని అంటున్నారు. మరి పవన్ కల్యాణ్ అసలు లక్ష్యం ఏమిటి.. ఆయన ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారా.. కేంద్ర మంత్రి పదవిని ఆశిస్తున్నారా..అన్నది చూడాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…