ఆంధ్రప్రదేశ్ అధికార కూటమిలో రాజ్యసభ రేసు హీటెక్కుతోంది. కొంతకాలంగా కూటమి తరపున రాజ్యసభకు ఎవరూ ప్రాతినిధ్యం వహించడం లేదు. ఇప్పుడు మాత్రం రాజీనామాల కారణంగా మూడు సీట్లు ఖాళీ కావడంతో ఎవరెవరికి అవకాశం వస్తుందన్న చర్చ జరుగుతోంది. ఖాళీ అయిన మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ.. షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబరు 20న పోలింగ్ జరిగే అవకాశం ఉండటంతో కూటమిలోని ఆశావహులు టీడీపీ అధినేత చంద్రబాబు వైపు చూస్తున్నారు. 175 స్థానాలుండే ఏపీ అసెంబ్లీలో కూటమికి 164 మంది సభ్యులు ఉండటంతో మూడు స్థానాల్లోనూ పోటీ చేసి గెలవడం ఖాయమని తేలిపోయింది.
మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్య రాజీనామాలతో ఖాళీ అయిన స్థానాల కోసం ఎన్నికలు జరుగుతాయి. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా లాంటి వారు రాజ్యసభ సీటు కోసం ఎదురు చూస్తున్నప్పటికీ…. వారికి అవకాశాలు లేవనే వార్తలు వస్తున్నాయి. మూడు స్థానాల్లో రెండు చోట్ల టీడీపీ, ఒక చోట జనసేన పోటీ చేయబోతున్నాయి. ఈ సారికి బీజేపీ పార్టీకి అవకాశం రాకపోవచ్చు. టీడీపీ తరపున బరిలో ఉండేవారిలో
మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంత్రి అయ్యారు. 2014లో మాత్రం కేంద్ర మంత్రి అయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. అందుకే ఆయనకు పెద్దల సభకు పంపిస్తారని ప్రచారం జరుగుతోంది. క్షత్రియ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో కూడా చోటు దక్కలేదు. ఇటీవల డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణ రాజుని ఎంపిక చేశారు. ఇప్పుడు రాజ్యసభ పదవికి అశోక్ గజపతిరాజు ఎంపిక చేయడం ద్వారా ఆ సామాజిక వర్దాన్ని బేలన్స్ చేసే అవకాశం ఉంది….
ఇక గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ను రాజ్యసభకు అవకాశం రావచ్చు. . 2014, 2019 ఎన్నికల్లో గుంటూరు లోక్ సభా స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా జయదేవ్ పోటీ చేసి గెలిచారు. 2024 ఎన్నికల ముందు ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యాయి. ఈ సారి పోటీ చేసి ఉంటే తప్పక గెలిచేవారని, కేంద్ర మంత్రి అయ్యే వారని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి…. గుంటూరు నుంచి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. టీడీపీ తీసుకునే రెండు సీట్లు ఖరారైతే ఇక ఒక స్థానం దక్కించుకునే జనసేన అభ్యర్థిపై ఇప్పటికే సస్పెన్స్ వీడిందని అంటున్నారు. మెగా బ్రదర్ నాగబాబుకు ఒక రాజ్యసభ సీటు కేటాయిస్తారు. ఎన్నికల్లో జనసేనతో పాటు కూటమి గెలుపు కోసం నాగబాబు పని చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నాగబాబుకు మంచి పదవి అని ప్రచారం సాగింది. ఒకటి రెండు నామినేటెడ్ పోస్టులు ఆఫర్ చేసినా ఆయన ఇష్టపడలేదు. తన గౌరవానికి తగిన పదవి కావాలని కోరుకున్నారు. దానితో ఇప్పుడు నాగబాబుకు జనసేన తరపున తొలి రాజ్యసభ సీటు ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇప్పుడు అవకాశం రాని వారికి త్వరలో ఖాళీ అయ్యే మూడు రాజ్యసభ స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. అందుకే దేవినేని ఉమా లాంటి వారికి ఇంకా ఛాన్స్ ఉందని అంటున్నారు..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…