తాడిపత్రి సోదరుల ఆటలతో పార్టీకి తీవ్ర కష్టాలు….

By KTV Telugu On 29 November, 2024
image

KTV TELUGU :-

కొందరిని కంట్రోల్ చేయడం చాలా కష్టం.ఎంత నచ్చజెప్పినా వాళ్లు కొరకరాని కొయ్యలుగానే కొనసాగుతుంటారు. పార్టీకి చెడ్డపేరు వస్తుందని తెలిసి కూడా వాళ్లు ఇష్టానుసారం వ్యవహరిస్తుంటారు. అధికార పార్టీలోనూ, అధికారానికి దగ్గరగా ఉండే బలమైన పార్టీలోనూ ఉంటూ వచ్చిన అవకాశాన్ని వాళ్లు తమ పెత్తందారీతనానికి రౌడీతనం ప్రదర్శించడానికి వినియోగిస్తుంటారు… అలాంటి వారితో తాడిపత్రి సోదరులైన జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ద్వయం ముఖ్యమైన నేతలుగా చెప్పుకోవచ్చు.

జమ్మలమడుగు ఫ్లై యాష్ వివాదంలో స్థానిక ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి వర్గం… జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గంపై రౌడీయిజం చేస్తున్నట్లు కనిపించినా అసలు మతలబు వేరే ఉంది. జేసీ కుటుంబ సిమెంట్ కంపెనీ కోసం ఫ్లై యాష్ తీసుకెళ్లే విషయంలో లోడింగ్ బకాయిలు చెల్లించనందునే ఆది వర్గం అడ్డుకుంటోంది. ఇంతవరకు 80 లక్షల రూపాయల వరకు బకాయిలు ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి..ఇప్పుడు సైతం పైసా విదిల్చేందుకు ఇష్టపడటం లేదు. టీడీపీ తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ అయిన ప్రభాకర్ రెడ్డి పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా లోడింగ్ చేయించుకోవాలని చూస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. అందుకే ఆది నారాయణ రెడ్డి వర్గం అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. సమస్యను పరిష్కరించి, చీవాట్లు పెట్టేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు నేతలను శుక్రవారం అమరావతి రావాలని ఆదేశించారు. దానితో ఇప్పుడు బంతి చంద్రబాబు కోర్టులో ఉన్నట్లయ్యింది..

ఒకప్పుడు జేసీ కుటుంబం కాంగ్రెస్ లో ఉండేది. అన్న దివాకర్ రెడ్డి మంత్రిగా, ఎంపీగా ఉంటుంటే, తమ్ముడు ప్రభాకర్ రెడ్డి ఏదోక పదవిని నిర్వహిస్తూ తాడిపత్రి చుట్టుపక్కల ప్రాంతాలను రాజకీయంగా, ఆర్థికంగా తమ చెప్పుచేతల్లో పెట్టుకునేవారు. పోలీసు అధికారులను సైతం బెదిరిస్తూ, బూతులు తిడుతూ పనులు చేయించుకునే వారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితుల్లో జేసీ కుటుంబం టీడీపీ వైపు పయనించింది. జేసీ దివాకర్ రెడ్డి ఒక టర్మ్ ఎంపీగా కూడా చేశారు. 2019లో జగన్ అధికారానికి వచ్చిన తర్వాత జేసీ కుటుంబ ప్రభ తగ్గినట్లే కనిపించినా… రౌడీయిజం మాత్రం కొనసాగిందని చెప్పక తప్పదు. దివాకర్ రెడ్డి రాజకీయాలకు కాస్త దూరం జరిగి కుమారుడిని ప్రమోట్ చేసుకుంటే… ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఛైర్మన్ గా చక్రం తిప్పుతున్నారు…

2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ప్రభాకర్ రెడ్డి మూడో కన్ను తెరిచారని వినిపిస్తున్న మాట. వ్యాపారస్తులను, కాంట్రాక్టర్లను పిలిపించి ఆయన తరచూ బెదిరిస్తున్నారట. తాడిపత్రి కోసం మీరేమీ చేశారు, ఏం చేస్తున్నారని అడుగుతున్నారట. తాడిపత్రి కోసం మీరు ఎంత ఖర్చు పెడతారని అడుగుతున్నారట. అందులో నాకు ఎంత ఇస్తావు అన్న మర్మం ఉందని తాడిపత్రి రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే వసూళ్ల మర్మం అందరికీ తెలిసిపోయింది. వీళ్ల కంటే 2019 నుంచి 2024 వరకు వైసీపీ ఎమ్మెల్యేగా చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డే నయమని స్థానిక జనం చెప్పుకుంటున్నారు. పెద్దారెడ్డి ఏదో కాంట్రాక్టులు చేసుకుని, ప్రభుత్వ డబ్బులు తినేశారేగానీ జనం జోలికి రాలేదని స్థానికులు ఒప్పుకుంటున్నారు. జేసీ బ్రదర్స్ మాత్రం అందుకు భిన్నంగా ప్రతీ ఒక్కరినీ కప్పం కట్టమని అడుగుతున్నారట. వెంటనే సమాధానం చెప్పకపోతే మాత్రం బెదిరింపులు ఖాయమని అంటున్నారు. పిలిచిన వెంటనే వచ్చి కాళ్లబేరానికి దిగకపోతే ఇబ్బందేనని వ్యాపారులు, కాంట్రాక్టర్లు భయపడుతున్నారు…

ఈ విషయాలన్నీ టీడీపీ అధిష్టానం దృష్టికి వెళ్లినా ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. తాడిపత్రి ప్రాంతంలో జేసీ బ్రదర్స్ కు ఉన్న బలం అలాంటిది. పైగా ఏదైనా చర్య తీసుకుంటే.. అధికార పార్టీపై విమర్శలు చేసేందుకు విపక్షాలకు అవకాశం ఇచ్చినట్లవుతుంది. అందుకే కక్కలేక మింగలేక ఇబ్బందులు పడుతున్నారు….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి