మునుగోడు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రకటించకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ ను అడ్డుకోవడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈసీఐ రాజ్యాంగబద్ధమైన సంస్థ అని.. దాని విధుల్లో జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని తెలిపింది. ఓటర్ల జాబితా ప్రకటనను అడ్డుకునేలా మధ్యంతర ఆదేశాలు జారీ చేయడానికి నిరాకరించింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కేవలం రెండు నెలల్లోనే కొత్తగా 25 వేల ఓటరు దరఖాస్తులు వచ్చాయని.. వాటిని ఎలాంటి విచారణ లేకుండానే ఆమోదించారని..ఇందులో అధికార పార్టీ కుట్ర ఉందని బీజేపీ నాయకులు హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కొత్తగా 25 వేల ఓట్లను ఓటరు జాబితాలో చేర్చారని.. రెండు నెలల్లో ఇంత భారీగా ఓట్లు ఎలా పెరుగుతాయని ప్రశ్నించారు. జూలై 31 నాటికి ఉన్న ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. ఈసీఐ, జిల్లా ఎన్నికల అధికారి తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయి వాదనలు వినిపిస్తూ..ఓటర్ల జాబితా సవరణ అనేది నిరంతరం చేపట్టే ప్రక్రియ అని తెలిపారు. ఏ ఎన్నికల్లో అయినా నామినేషన్ల దాఖలుకు చివరి రోజున ఓటర్ల జాబితా ప్రకటిస్తామని తెలిపారు. మునుగోడులో కొత్తగా ఆమోదించిన ఓట్లు 12వేలేనని, 7వేల దరఖాస్తులు తిరస్కరించామని తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం..ఓటర్ల జాబితా ప్రకటనను అడ్డుకునేలా మధ్యంతర ఆదేశాలివ్వడం కదరదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది