మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం పర్వం ఊపందుకుంది. ఎలక్షన్ తేదీ దగ్గరపడుతున్న రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ తరుణంలో ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు టీఆర్‌ఎస్ నాయకులకు షాకిచ్చింది. ఒక స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన రోడ్డురోలర్ సింబల్ ను అక్కడి రిటర్నింగ్ అధికారి జగన్నాథరావు తొలగించడంపై ఈసీ సీరియస్‌గా ఉంది.
ఒకసారి ఒక అభ్యర్థికి కేటాయించిన గుర్తును రద్దు చేయడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవేమీ పాటించకుండా, తమకు సమాచారం ఇవ్వకుండా తనంతట తాను రోడ్డు రోలర్ గుర్తును రద్దు చేయడంపై ఆ రిటర్నింగ్ అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ప్రతినిధులను మునుగోడుకు పంపించి వివరాలు సేకరించింది. ఆ వెంటనే ఆర్‌వోపై వేటు వేసి మరో అధికారికి మునుగోడు బాధ్యతలు అప్పగించింది. అయితే అక్కడితో ఈసీ ఆగ్రహం చల్లారలేదు. జగన్నాథరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానికాధికారి వికాస్‌రాజ్ ప్రభుత్వానికి సిఫారసు చేశారు.
మరోవైపు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై అతికించే బ్యాలట్ పత్రాలకు సంబంధించి పడవ గుర్తు ను తప్పుగా ముద్రించిన చౌటుప్పల్ తహసిల్దార్ ను సస్పెండ్ చేసినట్లు ఎన్నికల సంఘం ప్రధానాధికారి వెల్లడించారు. కారును పోలినట్లున్న ఈ ఎన్నికల గుర్తులతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని, అది తమ విజయావకాశాలపై ప్రభావం చూపిస్తుందని టీఆర్‌ఎస్ నేతలు భయపడుతున్నారు. ఈసీ తీరుపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శలు గుప్పించారు. ఇదంతా కేంద్రం కుట్రలో భాగంగా జరుగుతోందని మండిపడ్డారు.