”ఇది 21వ శతాబ్దం. శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకోవాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏ మనకి చెబుతోంది. కానీ మతం పేరుతో మనం ఎక్కడికి వెళ్తున్నాం. మతాన్ని ఎంత వరకు దిగజారుస్తున్నాం. నిజంగా ఇదొక విషాదం” ఇవీ సుప్రీం న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు.
ఏపీ రాజకీయాలే సెన్సార్‌లేని బూతు సిన్మాలా ఉన్నాయి. ఇక జాతీయరాజకీయాల గురించి చెప్పుకుంటే సిగ్గుచేటు. కడుపుచించుకుంటే కాళ్లమీద పడేలా ఉంది. వ్యక్తిగత దూషణలవరకైతే కాస్త చూసీచూడనట్లు పోవచ్చు. కానీ మంటలు రాజేసే భావోద్వేగాల విషయాల్లో నేతల వ్యాఖ్యలు హద్దు దాటుతున్నాయి. అసలే ఇదిగోపులి అంటే అదిగోతోక అనేరోజులు. నిప్పులేకుండా పొగపుట్టిస్తున్నారు. అగ్రనేతల మెప్పుకోసం వివాదాస్పద వ్యాఖ్యలకు తెగబడుతున్నారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. మా నోరు మా ఇష్టం. నచ్చింది ఏదన్నా మాట్లాడతాం అన్నట్లుంది కొందరు నేతల రాజకీయం. ఫలానా మతం వారిని వెలేయమంటున్నారు. ఎదుటి మతాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారు. భిన్న మతాలు, సంస్కృతులు ఉన్న భారతదేశంలో భావోద్వేగ చిచ్చు పెడుతున్నారు. ఎవరిమతం వారికి గొప్పది. ఎవరి ఆచారవ్యవహారాలు వారివన్న ఇంగితజ్ఞానం మరిచిపోతున్నవారిపై అత్యున్నత న్యాయస్థానం కన్నెర్రచేసింది. ఓ మత జనాభా పెరిగిపోతోందని, మెజారిటీ మతం ప్రమాదంలో పడుతోందని విద్వేషాలు రెచ్చగొట్టేవారికి సుప్రీం హెచ్చరికలు చేసింది. రాజ్యాంగ ప్రకారం మనది లౌకిక దేశం. అందుకే ఎవరైనా మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఫిర్యాదులకోసం ఎదురు చూడకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
నుపుర్‌శర్మ వ్యాఖ్యలు పెనుదుమారానికి దారితీశాయి. ఆమె వ్యాఖ్యల ఫలితంగా దేశవ్యాప్తంగా అవాంఛనీయఘటనలు చోటుచేసుకున్నాయి. అయినా దిద్దుబాటు చర్యలు మాత్రంలేవు. అలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు తరచూ అలజడి రేపుతూనే ఉన్నాయి. దీంతో సుప్రీం జోక్యం చేసుకుంది. విద్వేష ప్రసంగాలు పెరిగిన ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది. మత విద్వేషకులపై చర్యల విషయంలో జాప్యంచేస్తే కోర్టు ధిక్కారం కిందికి వస్తుందని సుప్రీం కఠినస్వరంతో హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాష్ట్రాల బీజేపీ నేతలు, ప్రజాప్రతినిధులు విద్వేషాలు రెచ్చగొట్టేలా చేసిన ప్రసంగాలను పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దేశంలో తటస్థంగా ఉండేవారిని కూడా మతవిద్వేష వ్యాఖ్యలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని సుప్రీం వ్యాఖ్యానించింది. ఏ మతానికి చెందినవారైనా కావచ్చు. అలజడి రేపే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుని దేశ లౌకికతత్వాన్ని కాపాడాలని అత్యున్నత న్యాయస్థానం చెప్పిన హితవు తుప్పుపట్టిన చెవులకు వినిపిస్తోందో లేదో!