మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. నాయకులు తమ ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు కొత్త కొత్త పద్దతులు అవలంభిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దక్కిన 18 కోట్ల రూపాయల కాంట్రాక్టును తమ ప్రచారంలో ప్రస్తావిస్తూ రాజగోపాల్ రెడ్డి మీద విమర్శలు గుప్పిస్తున్నారు టీఆర్‌ఎస్ నాయకులు ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ గతవారం కాంట్రాక్ట్ పే అంటూ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. కాంట్రాక్ట్ పే ద్వారా రాజగోపాల్ రెడ్డికి బీజేపీ 18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చిందని తెలియజేస్తూ చండూరు మండలం లోని అన్ని చోట్ల వేల సంఖ్యలో పోస్టర్లు వెలిశాయి. ఇందులో రాజగోపాల్ రెడ్డి ఫోటో తో పాటు 18 వేల కోట్లు ట్రాన్సాక్షన్ ఐడి అని ముద్రించారు. 18 వేల కోట్ల కాంట్రాక్టు లతోపాటు 500 కోట్ల బోనస్ రివార్డును కూడా కోమటిరెడ్డి గెలుచుకున్నారు అంటూ ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. తాజాగా మునుగోడు నియోజకవర్గం లోని చండూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీల పరిధిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా మళ్లీ పోస్టర్లు వెలిశాయి. మునుగోడు ప్రజలారా.. మేము మోసపోయాం.. మీరు మోసపోకండి అంటూ దుబ్బాక, హుజురాబాద్ ప్రజల పేరుతో చౌటుప్పల్ లో పోస్టర్లను అంటించారు. ఇక చండూరులో నేడే విడుదల.. షా ప్రొడక్షన్ సమర్పించు.. 18 వేల కోట్లు.. దర్శకత్వం కోవర్టు రెడ్డి, సత్యనారాయణ 70ఎంఎం లో అంటూ సినిమా పోస్టర్ తరహాలో పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్లకు బీజేపీ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలి.