– కన్నడ కాంతార.. ఫిల్మ్ ఇండస్ట్రీకి లాంతరా!
పెద్దపెద్ద హీరోల సిన్మాలే ఢమాల్ అంటున్నాయి. భారీ గ్రాఫిక్స్ సిన్మాలు రిలీజ్‌కి ముందే తేలిపోతున్నాయి. కంటెంట్‌లో దమ్ముంటేనే సిన్మా అడుద్దని అందరికీ అర్ధమైపోయింది. కానీ జీవనాడిలాంటి ఆ కంటెంట్‌ని పట్టుకోవడం, పట్టుతప్పకుండా కాపాడుకోవడం అందరికీ చేతగాదు. ఆ టాలెంట్ ఉన్నోడు ఏ మూలన ఉన్నా ఆపడం ఎవరి తరమూ కాదు. కొని సిన్మాలంతే కళ్ళార్పనీయని శిల్పంలా అందరినీ కట్టిపడేస్తాయి. కన్నడలో దుమ్ము దులిపేస్తున్న ఓ సిన్మావైపు ఇప్పుడు దేశమంతా చూస్తోంది.
కాంతార. ఇప్పుడు ఎవరినోట విన్నా ఈ సిన్మా ముచ్చటే. ఎందుకంటే పెద్దగా ఎక్స్పెక్టేషన్సేమీ లేకుండా కన్నడనాట విడుదలైన కాంతార ఇప్పుడు కోలీవుడ్ టూ బాలీవుడ్ షేక్ చేస్తోంది. అన్ని ఉడ్లలో మ్యాజిక్ చేస్తోంది. చివరికి ట్రిపులార్, కేజీఎఫ్-2 సిన్మాలను కూడా కాంతార బీట్ చేసేసింది. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ సొంతం చేసుకుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే పాత రికార్డుల్ని బద్దలు కొటేస్తోంది. ఐఎండీబీలో 8.4 రేటింగ్‌తో కేజీఎఫ్-2, 8 రేటింగ్‌తో ఆర్ఆర్ఆర్ ఉంటే కాంతార 9.5 రేటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
సంస్కృతీ, సంప్రదాయాలకు యాక్షన్ మసాలా అద్ది తీసిన ఎంటర్టైనర్ మూవీగా కాంతార నిలిచిపోయింది. సెప్టెంబర్ 30న ఒక మామూలు సిన్మాగా రిలీజై కన్నడ ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించింది. హిందీ ప్రేక్షకులను అలరిస్తూనే తెలుగులోనూ రిలీజైంది. భావోద్వేగాల్ని అద్భుతంగా పండించిందీ సిన్మా. శుభం కార్డు పడ్డాక కూడా జనం సీట్లలోంచి లేవనంత మ్యాజిక్ చేస్తోంది. సినిమా అద్భుతమంటూ ధనుష్ ప్రశంసించాడు. మన డార్లింగ్‌కి కూడా కాంతార తెగనచ్చేసింది. థ్రిల్లింగ్ క్లైమాక్స్ ఉన్న ఈ సిన్మాని రెండోసారి చూశానంటూ ప్రభాస్ చెప్పటం ఈ సిన్మా రేంజ్‌ని చాటుతోంది. కన్నడ ఇండస్ట్రీలో ఆర్ఆర్ఆర్గా ఫేమస్ అయిన రిషబ్ శెట్టి, రక్షిత్‌శెట్టి, రాజ్ బీ శెట్టి భిన్నమైన సినిమాల్ని తెరకెక్కిస్తున్నారు. కాంతారతో ఈ విషయంలో వాళ్లు మరో మెట్టు ఎక్కేశారు.